విడ్డూరం.. ఈ టైటిల్ కూడా మారిపోయింది
ఈ విషయంలో ఎన్ని విమర్శలు వస్తున్నప్పటికీ.. సెన్సార్ బోర్డు తగ్గడం లేదు. తాజాగా ఇంకో చిన్న సినిమాకు టైటిల్ మార్చాల్సిన పరిస్థితి తలెత్తింది.
By: Garuda Media | 5 March 2026 12:06 PM ISTఇటీవల చిన్న సినిమాలు విడుదలకు రెడీగా ఉండగా.. సెన్సార్ బోర్డు అభ్యంతరాల కారణంగా కొన్ని రోజుల ముందు టైటిల్ మార్చుకోవాల్సిన పరిస్థితి రావడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. వానరను వనవీర అని.. శ్రీ చిదంబరంను శ్రీ చిదంబరం గారు అని, ఛాయ్‌వాలాను నవాబ్ కేఫ్ అని.. హే భగవాన్‌ను హే బల్వంత్ అని.. పేరు మార్చి విడుదల చేయాల్సి వచ్చింది. కపుల్ ఫ్రెండ్లీ అనే సినిమా పేరును సైతం మార్చాలని సెన్సార్ బోర్డు సూచించగా.. ఎ సర్టిఫికెట్ వచ్చినా ఇబ్బంది లేదంటూ అదే పేరుతో చిత్ర బృందం ముందుకు వెళ్లిపోయింది. బలమైన కారణాలు లేకుండానే సెన్సార్ బోర్డు ఇలా టైటిళ్ల విషయంలో అభ్యంతరాలు చెబుతుండడం.. ముఖ్యంగా చిన్న సినిమాల నిర్మాతలను ఇబ్బంది పెడుతుండడం మీద పెద్ద జరుగుతోంది. ఈ విషయంలో ఎన్ని విమర్శలు వస్తున్నప్పటికీ.. సెన్సార్ బోర్డు తగ్గడం లేదు. తాజాగా ఇంకో చిన్న సినిమాకు టైటిల్ మార్చాల్సిన పరిస్థితి తలెత్తింది.
ఈ శుక్రవారం రిలీజ్ కాబోతున్న వరలక్ష్మి శరత్ కుమార్ మూవీ సరస్వతికి.. రెండు రోజుల ముందు టైటిల్లో చిన్న మార్పు చేశారు. సరస్వతి ముందు ఎస్ అని జోడించారు. సరస్వతి అన్నది దేవత పేరు అన్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమాలో ఏముందో.. టైటిల్‌తో ఉన్న ఇబ్బంది ఏంటో తెలియదు కానీ.. సెన్సార్ వాళ్లు టైటిల్ మార్పించారు. దేవత పేరు కాబట్టి సినిమాలో చూపించిన అంశాల వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బ తింటాయని ఇలా చేయించారేమో తెలియదు మరి. ఆ లెక్కన శివ, శీను, రామ్, కృష్ణ లాంటి ఎన్నో దేవుళ్ల పేర్లే సినిమా టైటిళ్లుగా వచ్చాయి. మరి ఆ పేర్లు పెట్టుకుని సినిమాలు తీయడం వల్ల ఎవరి మనోభావాలు దెబ్బ తినలేదా అన్నది ప్రశ్న. ఈ మనోభావాల పేరు చెప్పి సెన్సార్ బోర్డు సభ్యులు ఇలా ప్రతిదానికీ అభ్యంతరం చెబితే.. ఇక సినిమాలు తీసే వాళ్లకు ఏం స్వేచ్ఛ ఉంటుంది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. హే భగవాన్ సినిమాలో చూపించిన అంశాల కారణంగా హే బల్వంత్ అని మార్చారంటే ఒక అర్థం ఉంది. కానీ ఇలా వారం వారం ఒక సినిమా టైటిల్ మార్చాల్సిన పరిస్థితి తలెత్తడమే విడ్డూరం.
