హృదయ విదారకం: ఒక బిడ్డను కోల్పోయి, ఉన్న బిడ్డల్ని చూడలేక..నరక కూపంలో హీరోయిన్
తాజాగా తన దివంగత కుమారుడు శంషేర్ జన్మదినం సందర్భంగా సెలినా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఒక వీడియో అందరినీ కంటతడి పెట్టించింది.
By: Sivaji Kontham | 12 Sept 2026 10:31 AM ISTఒక వైపు ప్రియమైన కుమారుడిని కోల్పోయిన తీరని శోకం.. మరోవైపు విదేశీ భర్తతో విడాకుల పోరాటం, పిల్లలను నేరుగా కలువలేని దయనీయ పరిస్థితి. వీటన్నింటి మధ్య ప్రముఖ నటి సెలినా జైట్లీ పడుతున్న వేదన ఎంతో హృదయ విదారకంగా ఉంది. ఒక తల్లి తన బిడ్డ జ్ఞాపకాలను గుండెల్లో దాచుకుని.. న్యాయస్థానాల చుట్టూ తిరుగుతూ పడుతున్న నరకయాతన ఇటీవలి ఒక ఎమోషనల్ పోస్ట్ ద్వారా వెలుగులోకి వచ్చింది. జీవితాంతం ఎన్నో ఆశలతో విదేశాలకు వెళ్లిన ఈ నటి నేడు తన మాతృమూర్తి ప్రేమను నిరూపించుకోవడానికి కోర్టుల చుట్టూ పత్రాలతో పోరాడాల్సి రావడం విధి ఆడిన వింత నాటకం.. విషాదకరమైన పరిహాసం.
తాజాగా తన దివంగత కుమారుడు శంషేర్ జన్మదినం సందర్భంగా సెలినా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఒక వీడియో అందరినీ కంటతడి పెట్టించింది. ఆస్ట్రియాలోని తన కొడుకు సమాధిని సందర్శించి.. దానిని హత్తుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న ఒక పాత వీడియోను సెలీనా షేర్ చేశారు. తన జీవితం ముగిశాక తన భౌతిక కాయాన్ని భారతదేశంలో దహనం చేసి... బూడిదను మాత్రం ఆస్ట్రియాలో ఉన్న శంషేర్ సమాధి వద్ద కలపాలని సెలీనా కోరుకోవడం ఒక తల్లి కన్న పేగు తపనకు నిదర్శనం. బిడ్డను కనీసం సరిగ్గా ఎత్తుకోలేకపోయాననే బాధ తను రాసిన ప్రతి అక్షరంలోనూ స్పష్టంగా కనిపిస్తోంది.
భర్త పీటర్‌తో నడుస్తున్న విడాకుల కేసుల వల్ల ప్రస్తుత పరిస్థితులలో శంషేర్ సమాధిని మళ్లీ దర్శించుకోవడం తనకు అసాధ్యంగా మారిందని సెలినా ఆవేదన వ్యక్తం చేశారు. నవంబర్ 2025లో భర్తపై గృహహింస, వేధింపుల కింద సెలీనా కేసు నమోదు చేసి రూ. 50 కోట్ల నష్టపరిహారాన్ని కోరారు. ఈ చట్టపరమైన అనిశ్చితి కారణంగా ఆమె తన మిగిలిన పిల్లలైన విన్‌స్టన్, వీరాజ్, శంషేర్- అర్థ్ కవలలను కూడా సక్రమంగా కలువలేని దుస్థితి ఏర్పడింది. ఒక తల్లి తాను పొందిన మాతృత్వభావాన్ని.. పక్షం రోజుల పాటు కన్న ప్రేమను కోర్టుల ముందు నిరూపించుకోవాల్సి రావడం అత్యంత బాధాకరం.
ఇదే కాకుండా.. ఇదే కష్ట కాలంలో ఆమె కుటుంబానికి సంబంధించిన మరో తీవ్రమైన సమస్య కూడా నిద్రలేని రాత్రులను మిగిల్చింది. యూఏఈలో సెలీనా సోదరుడు అకారణంగా లేదా అనుకోని పరిస్థితుల్లో అరెస్టవడంతో ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి అలుపెరుగని పోరాటం చేయాల్సి వచ్చింది. ఒకవైపు కన్న బిడ్డ దూరమవడం.. మరోవైపు కుటుంబ జీవితం ఛిన్నాభిన్నమవడం... మరోపక్క సోదరుడి అరెస్ట్ వంటి వరుస విషాదాలు ఈ నటిని మానసికంగా తీవ్రంగా కుంగదీశాయి. అయినా తన మిగిలిన ముగ్గురు పిల్లల భవిష్యత్తు కోసం ధైర్యంగా నిలబడుతున్నారు.
2011లో వచ్చిన `థాంక్యూ` సినిమా తర్వాత గత దశాబ్ద కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న సెలినా జైట్లీ... వ్యక్తిగత జీవితంలో మాత్రం అత్యంత కఠినమైన పరీక్షలను ఎదుర్కొంటున్నారు. ఏ తల్లైనా తన పిల్లల నవ్వులు చూడాలని కోరుకుంటుంది.. కానీ ఆమె మాత్రం వీడియోల ద్వారా తన ప్రేమను పిల్లలకు చేరవేయాల్సిన దుస్థితిలో ఉన్నారు. తన ముద్దుల కొడుకులు శంషేర్, ఆర్థులకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూనే.. మిగిలిన పిల్లలను కాపాడుకోవడానికి తాను జీవితంతో పోరాడుతూనే ఉంటానని ధైర్యం ప్రకటించారు. ఈ కష్టకాలంలో సెలినా పడుతున్న మానసిక వేదన ప్రతి ఒక్కరి చేత కన్నీరు పెట్టిస్తోంది. సెలీనా జైట్లీ మంచు విష్ణు సరసన టాలీవుడ్ చిత్రం- `సూర్యం`లో నటించిన సంగతి తెలిసిందే.
