భవిష్యత్తు మాతృత్వం కోసం 10 మంది నటీమణుల ప్రయోగం!
ఈ క్రమంలో తమ సంతానోత్పత్తి సామర్థ్యాన్ని భవిష్యత్తు కోసం సురక్షితంగా దాచుకునేందుకు `ఎగ్ ఫ్రీజింగ్- (అండాలను భద్రపరచడం) అనే సరికొత్త వైద్య ప్రక్రియను ఎంచుకుంటున్నారు.
By: Sivaji Kontham | 8 July 2026 12:00 PM ISTప్రస్తుత ఆధునిక కాలంలో మహిళలు కెరీర్, వ్యక్తిగత కారణాల వల్ల మాతృత్వాన్ని వాయిదా వేసుకుంటున్నారు. ఈ క్రమంలో తమ సంతానోత్పత్తి సామర్థ్యాన్ని భవిష్యత్తు కోసం సురక్షితంగా దాచుకునేందుకు `ఎగ్ ఫ్రీజింగ్- (అండాలను భద్రపరచడం) అనే సరికొత్త వైద్య ప్రక్రియను ఎంచుకుంటున్నారు. గతంలో దీనిపై పెద్దగా అవగాహన లేకపోయినా ఈ మధ్యకాలంలో పలువురు భారతీయ మహిళా సెలబ్రిటీలు తాము ఈ ప్రక్రియను ఎంచుకున్నట్లు బహిరంగంగా మాట్లాడటం వల్ల సమాజంలో దీనిపై అవగాహన, సానుకూల చర్చలు బాగా పెరిగాయి.
గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా తన 30 ఏళ్ల వయసులోనే అండాలను భద్రపరుచుకున్నట్లు ప్రకటించి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. కెరీర్‌లో బిజీగా ఉండటం వల్లే భవిష్యత్తులో తల్లి అయ్యే అవకాశాన్ని కాపాడుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అలాగే భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ కూడా తన క్రీడా కెరీర్.. వ్యక్తిగత లక్ష్యాల మధ్య సమతుల్యత కోసమే తన 30 ఏళ్ల వయసులో ఈ ఆప్షన్‌ను ఎంచుకున్నారు. ప్రముఖ కొరియోగ్రాఫర్, సినిమా దర్శకురాలు ఫరా ఖాన్ సైతం తన పునరుత్పత్తి ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచుకోవడానికి, భవిష్యత్తులో కుటుంబ నియంత్రణ కోసం ఈ ప్రక్రియను ఎంచుకున్నట్లు వెల్లడించారు.
ఇక టెలివిజన్ రంగంలో సంచలనాలు సృష్టించిన ప్రముఖ ప్రొడ్యూసర్ ఏక్తా కపూర్ తన 36 ఏళ్ల వయసులో అండాలను ఫ్రీజ్ చేయించుకుని... ఆ తర్వాత సరోగసీ ద్వారా తన కుమారుడు `రవీ`కి జన్మనిచ్చారు. బిగ్ బాస్ ఫేమ్ రాఖీ సావంత్ తాను మాతృత్వాన్ని పొందాలని ఆశపడుతున్నట్లు.. అందుకోసమే తన అండాలను భద్రపరిచినట్లు బహిరంగంగానే వెల్లడించారు. అలాగే `జస్సీ జైసీ కోయి నహిన్` సీరియల్ ఫేమ్ మోనా సింగ్ 34 ఏళ్ల వయసులో ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకుని ఆలస్యంగా మాతృత్వాన్ని పొందాలనుకునే మహిళలకు ఇది ఒక అద్భుతమైన ఆప్షన్ అని చాటిచెప్పారు.
బాలీవుడ్ నటి రిచా చద్దా సామాజిక నిబంధనలతో సంబంధం లేకుండా.. తన కెరీర్ ఎదుగుదలపై పూర్తి దృష్టి పెట్టేందుకు ఎగ్ ఫ్రీజింగ్ తనకు ఎంతగానో తోడ్పడిందని తెలిపారు. ప్రముఖ నటి, ఫ్యాషన్ డిజైనర్ మందిరా బేడీ తన 30 ఏళ్ల మధ్య వయసులో అండాలను భద్రపరిచారు. ఇది బయోలాజికల్ క్లాక్ ఒత్తిడి లేకుండా మాతృత్వాన్ని ప్లాన్ చేసుకోవడానికి తనకు మానసిక ప్రశాంతతను ఇచ్చిందని చెప్పారు. `సీతా రామం` సినిమాతో భారీ క్రేజ్ తెచ్చుకున్న నటి మృణాల్ ఠాకూర్ కూడా భవిష్యత్తు కోసం తన అండాలను ఫ్రీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు ఇటీవలి ఒక ఇంటర్వ్యూలో వెల్లడించగా... టెలివిజన్ నటి నేహా పెండ్సే తన 30 ఏళ్ల ప్రారంభంలోనే ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకుని తక్షణ ఫ్యామిలీ ఒత్తిడి లేకుండా తన షెడ్యూల్ ప్రకారం మాతృత్వాన్ని ప్లాన్ చేసుకునేందుకు ఈ ప్రొటెక్షన్ తీసుకున్నారు.
ఈ విధంగా సెలబ్రిటీలు అందరూ ముక్తకంఠంతో ఎగ్ ఫ్రీజింగ్ ప్రయోజనాలను వివరిస్తున్నారు. ప్రధానంగా మహిళలు తమ కెరీర్‌పై పూర్తి దృష్టి పెట్టడం, సరైన భాగస్వామి దొరకకపోవడం లేదా కీమోథెరపీ వంటి కఠినమైన వైద్యపరమైన చికిత్సల వల్ల భవిష్యత్తులో సంతానోత్పత్తి దెబ్బతినకుండా ఉండటం వంటి అనేక కారణాల వల్ల ఈ అధునాతన వైద్య విధానాన్ని ఎంచుకుంటున్నారు. ఈ ప్రక్రియ మహిళలకు వారి పునరుత్పత్తి జీవితంపై పూర్తి నియంత్రణను -మానసిక ప్రశాంతతను ఇస్తోందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
