Begin typing your search above and press return to search.

NEET వివాదం: భార్య‌ల్ని ముందుకు నెట్టి స్టార్ హీరోలు వినోదం చూస్తున్నారు!

అంతేకాకుండా.. దంపతులలో ఇద్దరికీ సోషల్ మీడియాలో ఉండే భిన్నమైన ఫాలోయింగ్‌ను ఉపయోగించుకుని వేర్వేరు వర్గాల ప్రజలకు చేరువకావడం కూడా ఈ వ్యూహంలో భాగమే.

By:  Sivaji Kontham   |   27 July 2026 9:22 AM IST
NEET వివాదం: భార్య‌ల్ని ముందుకు నెట్టి స్టార్ హీరోలు వినోదం చూస్తున్నారు!
X

క‌రెంట్ డిబేట్ లో సామాజిక అంశాలపై ప్రముఖుల స్పందనలు ఎప్పుడూ ఆసక్తికరమైన చర్చలకు దారితీస్తుంటాయి. ఇటీవల ఎన్‌ఈఈటీ (NEET) వివాదం, విద్యార్థుల ఆందోళనలపై ప్ర‌ముఖ హీరోల భార్య‌లు ట్వింకిల్ ఖన్నా, ఆలియా భట్, కరీనా కపూర్, రితిక సజ్దే, సంజనా గణేశన్ సోషల్ మీడియా వేదికగా మద్దతును బ‌హిరంగంగా ప్ర‌క‌టించ‌డం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. అయితే అదే సమయంలో వారి భ‌ర్త‌లు అక్షయ్ కుమార్, రణ్‌బీర్ కపూర్, సైఫ్ అలీ ఖాన్, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా మౌనంగా ఉండటం సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు తావిచ్చింది. పురుషుల కంటే మహిళలకే మాట్లాడే ధైర్యం ఉందంటూ నెటిజన్లు వ్యాఖ్యానించడం ప్రారంభించినా దీనివెనుక లోతైన వ్యక్తిగత స్వేచ్ఛ- వ్యూహాత్మక అంశాలు దాగి ఉన్నాయని విశ్లేషిస్తున్నారు.

అయితే భార్యలు మాట్లాడినా భ‌ర్త‌లు మాట్లాడ‌క‌పోవ‌డంపై ర‌క‌ర‌కాల విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. ఇదంతా ముంద‌స్తు ప్లాన్ లేదా వ్యూహం అంటూ నెటిజ‌నులు విశ్లేషిస్తున్నారు. అంతేకాదు.. వివాహ బంధం అనేది ఇద్దరు స్వతంత్ర వ్యక్తుల సమాహారమే తప్ప వారిద్దరి ఆలోచనలు, సిద్ధాంతాలు ఒకేలా ఉండాలనే నియమం లేదు. పెరిగిన వాతావరణం, విద్యాభ్యాసం, జీవిత అనుభవాల ఆధారంగా దంపతులలో ఒకరికొకరు భిన్నమైన సామాజిక, రాజకీయ దృక్పథాలు ఉండటం చాలా సహజం. దురదృష్టవశాత్తు మన సమాజం దంపతులను ఒకే యూనిట్‌గా చూస్తూ ఒకరి అభిప్రాయాలను కుటుంబం మొత్తానికి ఆపాదిస్తుంటుంది.

ఇది ఒక‌ వ్యూహాత్మకమైన `కమ్యూనికేషన్ స్ట్రాటజీ` అంటూ విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. ప్రధాన సెలబ్రిటీలు లేదా స్టార్ హీరోలు, క్రికెటర్లు భారీ బ్రాండ్ ఎండోర్స్‌మెంట్స్, వ్యాపార ఒప్పందాలతో ముడిపడి ఉంటారు. వారు బహిరంగంగా వివాదాస్పద అంశాలపై మాట్లాడటం వల్ల బ్రాండ్ విలువ దెబ్బతినే లేదా రాజకీయ విమర్శలు ఎదుర్కొనే ప్రమాదం ఉంటుంది. అందువల్ల భర్తలు మౌనంగా ఉండటం వల్ల వ్యాపారపరమైన రిస్క్ తగ్గుతుంది. అదే సమయంలో వారి భార్యలు స్పందించడం ద్వారా `ఆ కుటుంబానికి సామాజిక స్పృహ ఉందనే` మంచి పేరు లభిస్తుంది.

అంతేకాకుండా.. దంపతులలో ఇద్దరికీ సోషల్ మీడియాలో ఉండే భిన్నమైన ఫాలోయింగ్‌ను ఉపయోగించుకుని వేర్వేరు వర్గాల ప్రజలకు చేరువకావడం కూడా ఈ వ్యూహంలో భాగమే. ఏదైనా అంశంపై ఒకరు మాట్లాడి మరొకరు మౌనంగా ఉండటం వల్ల... ఒకవేళ ఆ వ్యాఖ్యలు వివాదాస్పదమైనా ``అది వారి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే`` అని చాలా సులభంగా చెప్పి తప్పుకోవడానికి ఇది ఒక సురక్షితమైన మార్గంగా పనిచేస్తుంది. కాబట్టి సోషల్ మీడియాలో ఒకరు పోస్ట్ పెట్టినంత మాత్రాన పూర్తి విశ్వసనీయత ఉందని లేదా మౌనంగా ఉన్నంత మాత్రాన వారికి మద్దతు లేదని భావించడం సరైన విశ్లేషణ కాదు.

విద్యార్థుల సమస్యలను వెలుగులోకి తీసుకురావడానికి మహిళా సెలబ్రిటీలు తమ డిజిటల్ వేదికలను ఉపయోగించడాన్ని స్వాగతించాల్సిందే. అయితే దీని ఆధారంగా భార్యాభర్తల మధ్య అభిప్రాయ బేధాలను లేదా ధైర్యాన్ని విశ్లేషించ‌డం సరికాదు. సెలబ్రిటీల ప్రపంచంలో ఒకరు మాట్లాడటం, మరొకరు మౌనంగా ఉండటం అనేది ఉద్దేశపూర్వక వ్యక్తిగత స్వేచ్ఛ.. తమ కెరీర్ ను, బ్రాండ్ ఇమేజ్‌ను కాపాడుకునే వ్యూహం అని అర్థం చేసుకోవాలి.