సెలబ్రిటీలకు మాబ్ టెర్రర్.. తప్పు ఎవరిది?
ప్రజలు గుంపులుగా హాజరయ్యే కార్యక్రమాలకు సరైన భద్రత కల్పించకపోతే దాని పర్యవసానం ఎలా ఉంటుందో ఇటీవలి కొన్ని ఘటనలు చెబుతున్నాయి.
By: Sivaji Kontham | 22 Dec 2025 10:28 AM ISTప్రజలు గుంపులుగా హాజరయ్యే కార్యక్రమాలకు సరైన భద్రత కల్పించకపోతే దాని పర్యవసానం ఎలా ఉంటుందో ఇటీవలి కొన్ని ఘటనలు చెబుతున్నాయి. ముఖ్యంగా సెలబ్రిటీలతో కార్యక్రమాలు ఏవైనా, గుంపుగా ప్రజలు మీద పడటం, వెకిలి వేషాలు వేయడం చాలా సహజంగా చూస్తున్నదే. ఒక పెద్ద మాబ్ మీదికి దూసుకొస్తే నటీమణులు బెంబేలెత్తకుండా ఉంటారా? కార్యక్రమ నిర్వహణా లోపం అని అనాలా? లేక పబ్లిక్ తప్పుడు ఆలోచనలతో అలా మీదికి దూసుకొచ్చారని నెపం వారిపైకి నెట్టేయాలా! తెలియని పరిస్థితి అది.
పబ్లిక్ లో ఇమేజ్ ఉన్న స్టార్లు కనీస జాగ్రత్తలు లేకుండా ఎలా బయటకు వస్తున్నారు? నిధి అగర్వాల్, సమంత, రకుల్ లేదా తమన్నా లాంటి క్రేజ్ ఉన్న కథానాయికలు బహిరంగ ప్రదేశాలలోకి వచ్చినప్పుడు తగిన జాగ్రత్తలు తప్పనిసరి. ఒకవేళ రిబ్బన్ కటింగ్ కార్యక్రమాలు లేదా ఏవైనా ప్రమోషనల్ ఈవెంట్స్ కి వెళ్లినప్పుడు దానికి తగ్గట్టుగా భద్రత కల్పించాల్సిన అవసరం నిర్వాహకులకు ఉంది. కానీ ఇటీవలి కాలంలో నిర్వహణా లోపాలు చాలా చోట్ల బయటపడుతున్నాయి.
ఇంతకుముందు రాజాసాబ్ ప్రచారానికి వెళ్లిన నిధి అగర్వాల్ కి దారుణమైన పరిస్థితి ఎదురైంది. యువకులు గుంపుగా వచ్చి మీద పడ్డారు. తనతో సెల్ఫీలు కావాలంటే తనను అసభ్యంగా తాకేందుకు ప్రయత్నించారు. అదుపులోకి పెట్టలేని స్థితిలో నిధి ఆ గుంపులో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కార్యక్రమం ముగించి తన కార్ ని చేరుకునే లోపే యువకులంతా మీద పడ్డారు. తనను జాగ్రత్తగా కార్ ఎక్కించలేని స్థితిలో సహాయకులు కూడా చేతులెత్తేసారు. ఇప్పుడు సమంత కూడా అందుకు మినహాయింపు కాదు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో సమంతను అభిమానులు చుట్టుముట్టి కనిపిస్తున్నారు. తన వాహనం వద్దకు చేరుకోవడానికి సమంత చాలా ట్రబుల్ ఫేస్ చేసారు.
పబ్లిక్ లోకి వచ్చేప్పుడు సెలబ్రిటీలు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ప్రచారకార్యక్రమానికి వచ్చినా అక్కడ మాబ్ ని కంట్రోల్ చేయడానికి అవసరమైన ముందస్తు ఏర్పాట్లు తప్పనిసరి. అలా కాకుండా నిర్వహణా లోపం తలెత్తితే పరిణామాలు తీవ్రంగా మారతాయి. సెలబ్రిటీల ఈవెంట్లలో తొక్కిసలాటలు వంటివి మరింత దారుణ పరిణామాలకు దారి తీస్తున్న వైనం తెలిసిందే. ఏదైనా ఈవెంట్ నిర్వాహకులు అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేయడానికి మరింత ప్రణాళికా బద్ధంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇక పబ్లిక్ లో సెల్ఫీలు, ఫోటోగ్రాఫ్ లు వంటి వాటికి అనుమతులు ఇవ్వాలన్నా చాలా ఆలోచించాల్సి ఉంది. లోపం ఎక్కడుందో నిర్వాహకులు, సెలబ్రిటీలు కూడా విశ్లేషించుకుంటే భవిష్యత్‌లో ఎలాంటి ప్రమాదాలు లేకుండా జాగ్రత్తపడగలరు.
