16 నెలల ప్రెగ్నెన్సీ.. వరల్డ్ రికార్డంటున్న బాలీవుడ్ భామ
సంవత్సరం నుంచి తన ప్రెగ్నెన్సీపై రూమర్లు వస్తున్నాయని, 16 నెలలకు పైగా ప్రెగ్నెంట్ గా ఉండటం వరల్డ్ రికార్డని సోనాక్షి సమాధానమిచ్చారు.
By: Sravani Lakshmi Srungarapu | 21 Oct 2025 11:46 AM ISTసోషల్ మీడియా విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఏదైనా ఒక విషయం బయటకు రావడం ఆలస్యం. అందులో నిజమెంతన్నది కనీసం ఆలోచించకుండా ఆ విషయాన్ని సోషల్ మీడియా మొత్తం షేర్ చేస్తూ వైరల్ చేసేస్తున్నారు నెటిజన్లు. ఇంకొందరైతే ఓ అడుగు ముందుకేసి మరీ, లేని వార్తల్ని పుట్టించి సంతోషిస్తూ ఉంటారు. అయితే ఆ వార్తల్లో ఎక్కువగా సెలబ్రిటీలకు సంబంధించిన వార్తలే ఉండటం కామన్.
ఫలానా హీరోయిన్ ఫలానా హీరోతో ప్రేమలో ఉందనో, ఫలానా హీరో త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నాడనో లేదంటే ఫలానా సెలబ్రిటీ కపుల్ త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారో ఇష్టమొచ్చినట్టు వార్తలు పుట్టిస్తారు. ఆ వార్తల్ని కొందరు తారలు లైట్ తీసుకుంటే మరికొందరు మాత్రం వాటిపై సీరియస్ గా రియాక్ట్ అవుతూ ఆ వార్తల్ని ఖండిస్తూ ఉంటారు. అందులో భాగంగానే కొందరు హీరోయిన్లు తమపై వచ్చే రూమర్లకు స్ట్రాంగ్ రిప్లైలిస్తున్నారు.
ప్రెగ్నెన్సీ వార్తలపై రియాక్ట్ అయిన సోనాక్షి
బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా గతంలో ఓ సారి పొట్టపై చెయ్యి వేసి ఫోటో దిగడంతో ఆమె ప్రెగ్నెంట్ అని పోస్టులు పెడుతూ ఎంతో హంగామా చేశారు నెటిజన్లు. రీసెంట్ గా మరోసారి ఈ వార్తలు సోనాక్షి దగ్గరకు వెళ్లడంతో వాటిపై తనదైన రీతిలో స్పందించారు. సంవత్సరం నుంచి తన ప్రెగ్నెన్సీపై రూమర్లు వస్తున్నాయని, 16 నెలలకు పైగా ప్రెగ్నెంట్ గా ఉండటం వరల్డ్ రికార్డని సోనాక్షి సమాధానమిచ్చారు.
హనీమూన్ షెడ్యూల్ చెప్తారని వెయిటింగ్
ఇక ఇండస్ట్రీలో పెళ్లి కాని సీనియర్ హీరోయిన్లలో త్రిష కూడా ఒకరు. దీంతో ఎప్పటికప్పుడు త్రిష పెళ్లిపై రూమర్లు వస్తూనే ఉంటాయి. అందులో భాగంగానే రీసెంట్ గా మరోసారి త్రిష పెళ్లిపై పుకార్లు రాగా వాటిపై అమ్మడు స్పందించింది. తన కోసం తన లైఫ్ ను ప్లాన్ చేస్తున్న వాళ్లను తాను ప్రేమిస్తానని, అలానే హనీమూన్ షెడ్యూల్ కూడా చెప్తారేమో అని వెయిట్ చేస్తున్నట్టు సెటైరికల్ గా రిప్లై ఇచ్చారు త్రిష.
తెలుగబ్బాయితో మృణాల్ పెళ్లి
సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న మృణాళ్ ఠాకూర్ కూడా తనపై వస్తున్న వార్తలకు రియాక్ట్ అయ్యారు. తన ఫ్రెండ్స్, స్టైలిస్టులు, బంధువులు ఫోన్స్ చేసి తెలుగబ్బాయిని పెళ్లి చేసుకుంటున్నావా అని అడుగుతున్నారని, ఆ అబ్బాయి ఎవరో తనక్కూడా తెలుసుకోవాలనుందని చెప్పిన మృణాల్, ఇలాంటి రూమర్లపై ఎలా రియాక్ట్ అవాలో కూడా తెలియడం లేదని, తనకు త్వరలోనే పెళ్లవుతుందని, కాకపోతే అబ్బాయిని వెతికి, పెళ్లి ఎక్కడనే లొకేషన్ కూడా పంపమని కోరుతూ వ్యంగ్యంగా రిప్లై ఇచ్చారు.
పెళ్లి చేసుకుని వేరే ఇంట్లోకి..
ఇక తెలుగు భామ అంజలి సిట్యుయేషన్ కూడా ఇంచుమించు ఇదే. తనకు తెలియకుండానే తన పెళ్లి నాలుగు సార్లు చేశారని, ఇప్పుడు మరోసారి చేస్తున్నారని, పెళ్లి చేసుకుని తాను వేరే ఇంట్లో ఉంటున్నట్టు రాశారని, కానీ తాను షూటింగ్స్ వల్ల అవుట్ డోర్స్ లోనే ఎక్కువగా ఉంటున్నానని, పెళ్లి చేసుకుంటూ కానీ దానికి కాస్త టైముందంటూ క్లారిటీ ఇచ్చారు అంజలి.
వీరు కాకుండా ఎంతో మంది హీరో, హీరోయిన్ల పెళ్లిళ్ల గురించి కూడా ఎన్నోసార్లు వార్తలొచ్చాయి. ప్రభాస్, అనుష్క లాంటి సీనియర్లకు సోషల్ మీడియాలో ఎన్నో సార్లు పెళ్లి చేసిన నెటిజన్లు, శృతి హాసన్, అనుపమ, తమన్నా పెళ్లిలపై కూడా ఇలాంటి పుకార్లే పుట్టించారు. కాకపోతే వార్తలొచ్చిన ప్రతీసారీ సెలబ్రిటీలు రియాక్ట్ అవడమంటే కష్టమే.
