పరిచయాలు సెలబ్రిటీల భద్రతకు శాపంగా మారుతున్నాయా?
గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో ఒక సినిమా పరిశ్రమకు చెందిన వారు మరో పరిశ్రమకు చెందిన వారితో వృత్తిపరమైన సంబంధాలు కలిగి ఉండటం.. వివిధ వేడుకల్లో కలుసుకోవడం అత్యంత సహజమైన విషయం.
By: Srikanth Kontham | 20 Jun 2026 3:00 PM ISTగ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో ఒక సినిమా పరిశ్రమకు చెందిన వారు మరో పరిశ్రమకు చెందిన వారితో వృత్తిపరమైన సంబంధాలు కలిగి ఉండటం.. వివిధ వేడుకల్లో కలుసుకోవడం అత్యంత సహజమైన విషయం. సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి హాజరుకావడం... తోటి కళాకారుడిని అభినందించడం .. వేడుకల్లో పక్కపక్కన కూర్చోవడం వంటివి జరుగుతుంటాయి. ఇవన్నీ వృత్తిపరమైన మర్యాదలు మాత్రమే. ఈ విధమైన నెట్‌వర్కింగ్ అనేది చిత్ర పరిశ్రమ ఎదుగుదలకు.. సృజనాత్మక కలయికలకు ఎంతో అవసరం. కానీ ప్రస్తుత రోజుల్లో సాధారణ పరిచయలే కొందరు కళాకారుల ప్రాణాల మీదకు తెస్తున్నాయి.
నేర ముఠాలు సెలబ్రిటీల భద్రతను టార్గెట్ చేస్తోన్న తరుణంలో సరికొత్త ప్రమాదకర ధోరణి వెలుగులోకి వస్తోంది. టార్గెట్ చేసిన ప్రధాన శత్రువును నేరుగా తాకలేనప్పుడు? అతనికి వృత్తిపరమైన పరిచయం ఉన్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవడం. నేరస్థులు తమ ఉనికిని చాటుకోవడానికి సమాజంలో భయాందోళనలు సృష్టించడానికి ఈ విధమైన కొలాటరల్ టార్గెటింగ్ వ్యూహాన్ని ఎంచుకుంటున్నారు. దీంతో అసలు వివాదంతో ఎలాంటి సంబంధం లేని మూడో వ్యక్తి అనవసరంగా భయాందోళనలకు గురికావాల్సి వస్తోంది.
ఇటీవల కాలంలో చిత్ర పరిశ్రమలో జరిగిన కొన్ని పరిణామాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఒక పెద్ద స్టార్ హీరోతో కేవలం ఒకే ఒక్క వేదికను పంచుకున్నందుకో? అతనితో ప్రాజెక్ట్‌లో కలిసి పనిచేసినందుకో? కొందరు గాయకులు, నటుల అంతర్జాతీయ నివాసాలపై దాడులు జరగడం తెలిసిందే. కేవలం ఆ స్టార్ హీరోతో ఉన్న చిన్న పరిచయం కారణంగా ప్రాణాలు సైతం కోల్పోవాల్సి వస్తోంది. ఈ ప్రమాదకర ధోరణి వల్ల చిత్ర పరిశ్రమలోని కళాకారులలో ఒక రకమైన అభద్రతా భావం.. ఒకరినొకరు కలుసుకోవడానికి భయపడే పరిస్థితి ఏర్పడుతోంది.
షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం.. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వల్ల తమ ప్రాణాలకే ముప్పు వస్తుందని తెలిస్తే భవిష్యత్తులో కళాకారులు తమను తాము ఐసోలేట్ చేసుకోవడానికి మొగ్గు చూపుతారు. ఇది చిత్ర పరిశ్రమల మధ్య జరిగే ఆరోగ్యకరమైన వాతావరణాన్ని దెబ్బతీస్తుందన్నది కాదన లేని నిజం. పరిశ్రమ ప్రగతికి అడ్డుకట్ట వేస్తుంది. నేర ముఠాలు సెలబ్రిటీల డిజిటల్ ఫుట్‌ప్రింట్ ను నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. మీడియాలో వచ్చే వార్తలు, సోషల్ మీడియా అప్‌డేట్స్ ఆధారంగానే ఈ ముఠాలు లక్ష్యాలను నిర్దేశించుకుంటున్నాయని నిఘా వర్గాలు.. పోలీసులు భావిస్తున్నారు.
నిజమైన బంధాలు .. లోతైన పరిచయాలు ఉండాల్సిన అవసరం లేదు. ఇంటర్నెట్ ప్రపంచంలో ఒక స్టార్ హీరోతో కలిసి ఉన్నట్లు కనిపించే ఏ చిన్న ఆధారమైనా సరే బ్లాక్‌మెయిలింగ్‌కు .. దాడులకు సాధనంగా మారుతోంది. ఇది సాంకేతికత యుగంలో కళాకారులకు ఎదురవుతున్న డిజిటల్ ముప్పుగా చెప్పొచ్చు. అలాగే సెలబ్రిటీల భద్రతా వ్యవస్థ అనేది కేవలం ఒక వ్యక్తి రక్షణకే పరిమితం కాకూడదు. ఒక అగ్ర నటుడికి రక్షణ కల్పిస్తున్నప్పుడు అతనితో అనుబంధం ఉన్న ఇతరుల భద్రతను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. చిత్ర పరిశ్రమ అంతా ఏకతాటిపైకి వచ్చి ఇలాంటి బెదిరింపు సంస్కృతిని తిప్పికొట్టకపోతే భయం నీడలోనే కళాకారులు బ్రతకాల్సి ఉంటుంది. స్వేచ్ఛగా తమ సృజనాత్మకతను చాటుకోలేరు అన్నది అంతే వాస్తవం.
