సెలబ్రిటీ వివాదం : కెమెరాలు తేవడానికి స్టార్ హోటల్స్ అభ్యంతరం వెనక?
స్టార్ హోటల్స్‌లో సెలబ్రిటీలకు ఎదురయ్యే కఠిన అనుభవాలు సోషల్ మీడియాలలో చాలాసార్లు చర్చకు తావిచ్చాయి.
By: Sivaji Kontham | 10 Feb 2026 9:23 AM ISTస్టార్ హోటల్స్‌లో సెలబ్రిటీలకు ఎదురయ్యే కఠిన అనుభవాలు సోషల్ మీడియాలలో చాలాసార్లు చర్చకు తావిచ్చాయి. సాధారణంగా సెలబ్రిటీలు తాము వెళ్లే చోట ఫోటోలు, వీడియోలు తీసుకోవడం సహజం. అయితే, హోటల్ సిబ్బంది అడ్డుకోవడంతో వివాదాలుగా మారుతున్నాయి. ప్రముఖ తెలుగు నటి చెన్నైలోని ఒక స్టార్ హోటల్ లో రిసెప్షనిస్టుపై ఫిర్యాదు చేయడం చర్చగా మారింది. తనతో పాటు కెమెరామేన్ ని, పెద్ద కెమెరా సెటప్ ని హోటల్ రూమ్ లోకి తేవడానికి నిరాకరించారని, దీంతో గంటల కొద్దీ సమయం వృధా అయిందని ఫైర్ అయ్యారు.
ఈ నేపథ్యంలో హోటల్ నియమ నిబంధనలు, గతంలో జరిగిన ఇలాంటి సంఘటనల గురించి కొన్ని వివరాలు పరిశీలిస్తే... హోటల్ రూమ్‌లలో ఫోటోషూట్ల విషయంలో నియమాలు ఏం చెబుతున్నాయి? అంటే.. చాలా మందికి `రూమ్ బుక్ చేసుకున్నాం కదా.. అక్కడ మాకు నచ్చింది చేసుకునే హక్కు ఉంటుంది`` అనే అభిప్రాయం ఉంటుంది. కానీ హోటళ్లలో కొన్ని పాలసీలు ఉంటాయి.
ఎవరైనా ఫోన్‌తో సెల్ఫీలు లేదా సాధారణ ఫోటోలు తీసుకుంటే ఎవరూ అభ్యంతరం చెప్పరు. కానీ ప్రొఫెషనల్ కెమెరాలు, లైటింగ్ సెటప్, టీమ్‌తో చేసే ఫోటోషూట్‌లను `కమర్షియల్` కింద పరిగణిస్తారు. దీనికి ముందస్తు అనుమతి, అదనపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
ఇతర అతిథుల ప్రైవసీకి భంగం కలగకుండా ఉండటానికి హోటళ్లు లాబీలు, పబ్లిక్ ఏరియాల్లో షూటింగ్‌లను అనుమతించవు. హోటల్స్ కి బ్రాండ్ ఇమేజ్ కూడా చాలా ముఖ్యం. హోటల్ ప్రాంగణాన్ని కమర్షియల్ ప్రయోజనాల కోసం వాడుకున్నప్పుడు తమ బ్రాండ్‌కు నష్టం కలగకూడదని యాజమాన్యం భావిస్తుంది.
రిసెప్షనిస్ట్ కు ఆపే అధికారం ఉందా?
రిసెప్షనిస్ట్ సాధారణంగా హోటల్ మేనేజ్‌మెంట్ ఇచ్చిన `స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్` (SOPs)ని అనుసరిస్తారు. దీని ప్రకారం.. పెద్ద కెమెరాలను చూసినప్పుడు అది ప్రొఫెషనల్ షూట్ అని భావిస్తారు. 2) ముందస్తు అనుమతి లేకపోవడం వల్ల నిబంధనల ప్రకారం అడ్డుకుని ఉండవచ్చు. 3) సెలబ్రిటీల విషయంలో ఒక్కోసారి కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఇలాంటి వాగ్వాదాలు జరుగుతుంటాయి.
గతంలో సెలబ్రిటీలకు ఎదురైన చేదు అనుభవాలను పరిశీలిస్తే... పలువురు సెలబ్రిటీలు హోటల్ సర్వీస్ లేదా నిబంధనలపై అసహనం వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి. చండీగఢ్‌లోని ఒక హోటల్‌లో రెండు అరటిపండ్లకు రూ. 442 బిల్లు వేయడంతో నటుడు రాహుల్ బోస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది పెద్ద వైరల్ అయ్యింది. అహ్మదాబాద్‌లోని ఒక హోటల్ ఆహారంలో పురుగులు వచ్చాయని మీరా చోప్రా కంప్లయింట్ చేశారు. గతంలో కూడా విమాన ప్రయాణాల్లో లేదా ఇతర సేవల విషయంలో తనకు ఎదురైన అసౌకర్యాల గురించి మంచు లక్ష్మి ధైర్యంగా స్పందించారు. ఇప్పుడు కూడా హోటల్ లో సిబ్బంది వ్యవహారంపై ఫిర్యాదు చేసారు.
అయితే హోటళ్లు అనేవి ప్రైవేట్ ప్రాపర్టీలు. కాబట్టి అక్కడ వారి నియమ నిబంధనలు వర్తిస్తాయి. సెలబ్రిటీలకైనా, సామాన్యులకైనా ప్రొఫెషనల్ షూట్స్ చేయాలనుకున్నప్పుడు ముందే సమాచారం ఇవ్వడం వల్ల ఇలాంటి గొడవలను నివారించవచ్చు.
