బన్ని-స్నేహ జంటను రౌండప్ చేసిన జనం
అల్లు అర్జున్ తన భార్య స్నేహారెడ్డితో కలిసి హైదరాబాద్ లోని ఓ కేఫ్ కి వెళ్లి తిరిగి వస్తుండగా, ఆ ఇద్దరూ వెళ్లేందుకు దారి ఇవ్వలేదు. జనం అంతగా చుట్టూ మూగారు.
By: Sivaji Kontham | 5 Jan 2026 12:39 AM ISTసెలబ్రిటీలు పబ్లిక్ స్పేస్‌లోకి వచ్చినప్పుడు జనం గుంపుగా మీదపడటం అరాచకమా? ఇది పబ్లిక్ తప్పా? లేక నిర్వాహకుల తప్పా? అంటే ఈ ప్రశ్నకు సరైన సమాధానం లేదు. ఇంతకుముందు నిధి అగర్వాల్ పబ్లిక్ లోకి వచ్చినప్పుడు తన కార్ లోకి వెళ్లే ముందు గుంపు నుంచి బయటపడేందుకు నానా ప్రయాసలు పడాల్సి వచ్చింది. పైగా యూత్ పిచ్చిగా తన మీది మీదికి ఉరుకుతూ దూసుకొచ్చేయడంతో ఆ ఘటన భయపెట్టింది.
ఆ తర్వాత సమంత ఓ లాంచింగ్ ఈవెంట్ కి వెళ్లినప్పుడు కూడా ఇలాంటిదే ఎదురైంది. జనం గుమికూడారు. గుంపుగా వచ్చి మీద పడ్డారు. కానీ నెమ్మదిగా అక్కడి నుంచి సమంత వెళ్లడానికి చాలా శ్రమించారు. ఈ రెండు సంఘటనల్లో జనాలను అదుపు చేయడంలో నిర్వాహకులు విఫలమయ్యారని ఆరోపణలు వచ్చాయి. గ్లామరస్ కథానాయికలకు పబ్లిక్ లో ఉండే ఇమేజ్ దృష్ట్యా ఇలాంటి సమస్యలు ప్రతిసారీ పునరావృతం అవుతూనే ఉన్నాయి. అయితే ఘటన జరగక ముందే జాగ్రత్త పడేందుకు అవకాశం ఉన్నా ఎవరూ దీనిని అస్సలు పట్టించుకునే స్థితి ఉండదు.
కేవలం నిధి అగర్వాల్, సమంత వరకే కాదు.. ఇటీవల జననాయగన్ ఈవెంట్ ముగించి మలేషియా నుంచి చెన్నైకి వచ్చిన దళపతి విజయ్ కి అలాంటి పరాభవమే ఎదురైంది. ఆయన చుట్టూ గుమిగూడిన అభిమానులు అతడిని నెట్టేయడంతో కింద జారి పడ్డాడు. ఆ సమయంలో ఇతరులు సహాయం చేయడంతో ఘటన నుంచి వెంటనే కోలుకుని కార్ లో కి ఎక్కాడు.
ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి కూడా అభిమానుల నుంచి అలాంటి అనుభవం ఎదురైంది. అల్లు అర్జున్ తన భార్య స్నేహారెడ్డితో కలిసి హైదరాబాద్ లోని ఓ కేఫ్ కి వెళ్లి తిరిగి వస్తుండగా, ఆ ఇద్దరూ వెళ్లేందుకు దారి ఇవ్వలేదు. జనం అంతగా చుట్టూ మూగారు. సెల్ఫీల కోసం మీదికి వస్తుంటే, వారిని తప్పించుకుని వెళ్లేందుకు బన్ని చాలా ప్రయాస పడాల్సి వచ్చింది. దీనిని బట్టి సెలబ్రిటీలు బహిరంగ ప్రదేశాలకు వస్తే, ప్రత్యేకించి నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని మరోసారి నిరూపణ అయింది. కార్యక్రమ నిర్వాహకులు ఫెయిలైనప్పుడు సంధ్య థియేటర్ తొక్కిసలాట లాంటి ఘటనలు రిపీటవుతుంటాయి. అది గ్లామర్ ఒలకబోసే కథానాయిక అయినా, ఒక స్టార్ హీరో అయినా ప్రజల్లో, అభిమానుల్లో హుషారు ఒకేలా ఉంటుందని ఇప్పుడు మరోసారి నిరూపణ అయింది.
