Begin typing your search above and press return to search.

పెళ్లికూతురిపై ఈ టైమ్‌లో బాడీ షేమింగ్ స‌మంజ‌స‌మేనా?

ఆ పాత ఫొటోలో స‌ద‌రు సెల‌బ్రిటీ జంట‌ కుమార్తెలు కాస్త భారీ కాయంతో లావుగా కనిపించారు.

By:  Sivaji Kontham   |   28 Jun 2026 8:00 PM IST
పెళ్లికూతురిపై ఈ టైమ్‌లో బాడీ షేమింగ్ స‌మంజ‌స‌మేనా?
X

దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన ఒక ప్రముఖ స్టార్ డైరెక్టర్- పాపుల‌ర్ నటి దంపతుల కుమార్తె వివాహం ఇటీవల చెన్నైలో అత్యంత వైభవంగా జరిగింది. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఇప్ప‌టికే వైరల్‌గా మారాయి. కొత్త దంపతులకు అభిమానులు- పరిశ్రమ వర్గాల నుండి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అయితే ఈ సంతోషకరమైన సమయంలో కొందరు నెటిజన్లు ఆ కుటుంబానికి సంబంధించిన ఒక పాత ఫొటోను తెరపైకి తెచ్చి సామాజిక మాధ్యమాల్లో చర్చకు పెట్టారు.

ఆ పాత ఫొటోలో స‌ద‌రు సెల‌బ్రిటీ జంట‌ కుమార్తెలు కాస్త భారీ కాయంతో లావుగా కనిపించారు. అయితే పెళ్లి ఫోటోల‌లో అందుకు భిన్నంగా బ‌రువు త‌గ్గి ఛామింగ్‌గా క‌నిపిస్తున్నారు. దీంతో పాత- కొత్త ఫోటోల‌తో పోలిక పెడుతూ ర‌క‌ర‌కాల కామెంట్లు చేస్తున్నారు. ఇప్ప‌టి అసాధార‌ణ‌మైన రూపం చూసి కొందరు నెటిజన్లు న‌వ‌వ‌ధువు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని ఉండవచ్చని ఊహాగానాలు మొదలుపెట్టారు. మరికొందరైతే బరువు తగ్గడానికి ఓజెంపిక్ వంటి బరువు తగ్గించే మందులను వాడి ఉంటుందంటూ ప్రచారం చేయడం ప్రారంభించారు.

అయితే ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న ఈ పుకార్లపై ఈ సెల‌బ్రిటీ ఫ్యామిలీ ఎలాంటి అధికారిక వివరణ ఇవ్వలేదు. ఈ ప్రచారంలో నిజం ఎంత‌? ఒక అమ్మాయి జీవితంలో అత్యంత కీలకమైన పెళ్లి సమయంలో ఇలాంటి పాత ఫొటోల పోలికలు తీసుకురావడం.. ట్రోలింగ్ చేయడాన్ని మెజారిటీ నెటిజన్లు తప్పుబడుతున్నారు. ఒక వధువును లక్ష్యంగా చేసుకుని పెళ్లి వేడుకల సమయంలో ఇలాంటి చెత్త‌ వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిపడుతున్నారు.

ఇవ‌న్నీ నిరాధారమైన పుకార్లు.. ఆ కుటుంబాన్ని ప్రశాంతంగా పెళ్లి వేడుకలను జరుపుకోనివ్వాలని పలువురు యూజర్లు హితవు పలికారు.

బ‌రువు త‌గ్గ‌డానికి అడ్డదారుల్లో వెళ్లాల్సిన ప‌ని లేదు. సరైన ఆహార నియమాలు, క్రమబద్ధమైన వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలితో ఎవరైనా సహజంగానే బరువు తగ్గవచ్చని.. ప్రతిదానికి సర్జరీలు, మందులంటూ తప్పుడు ప్రచారాలు చేయడం ముమ్మాటికీ స‌రికాద‌ని ఆ ప్ర‌చారాన్ని త‌ప్పు ప‌డుతున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆన్‌లైన్‌లో ఊహాగానాలు చేసేవారిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవ‌ల స‌ద‌రు సెల‌బ్రిటీ డాట‌ర్ తాను బ‌రువు త‌గ్గేందుకు 2018 నుంచి ఇంత‌కాలం చాలా శ్ర‌మించాల్సి వ‌చ్చింద‌ని తెలిపారు. త‌న‌ను అన్యాయంగా నెటిజ‌నులు ట్రోల్ చేస్తున్నార‌ని, అధిక బ‌రువు త‌గ్గేందుకు క‌ఠిన‌మైన జిమ్ చేసాన‌ని కూడా చెప్పారు. బ‌రువు త‌గ్గేందుకు స‌ర్జ‌రీలు చేయించుకోలేద‌ని, త‌న‌ను తీవ్రంగా బాడీ షేమింగ్ చేసార‌ని కూడా ఆవేద‌న చెందారు. దీంతో ఆన్‌లైన్ న‌టి కుమార్తెకు నెటిజన్లు, అభిమానుల నుండి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. ఒక శుభకార్యం జరుగుతున్న వేళ ఇలాంటి నెగెటివిటీని ప్రోత్సహించకూడదంటూ డిజిటల్ వేదిక‌ల‌పై త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నవారిపై విరుచుకుప‌డుతున్నారు.