Begin typing your search above and press return to search.

పిల్లలు పుట్టాక పెళ్లి: సెలబ్రిటీ ప్రపంచంలో ఇంట్రెస్టింగ్ ట్రెండ్!

సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలు, వారి సంబంధాలు ఎప్పుడూ అభిమానుల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి.

By:  Sivaji Kontham   |   22 Aug 2026 7:00 AM IST
పిల్లలు పుట్టాక పెళ్లి: సెలబ్రిటీ ప్రపంచంలో ఇంట్రెస్టింగ్ ట్రెండ్!
X

సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలు, వారి సంబంధాలు ఎప్పుడూ అభిమానుల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. అయితే ఇటీవల కాలంలో వివాహ వ్యవస్థపై మారిన ఆలోచనా దృక్పథానికి నిదర్శనంగా ఒక సరికొత్త ట్రెండ్ కనిపిస్తోంది. సాంప్రదాయ పద్ధతి ప్రకారం ముందుగా పెళ్లి చేసుకుని ఆ తర్వాత పిల్లలను కనడానికి భిన్నంగా.. ముందుగా సహజీవనం (లివ్- ఇన్) చేసి.. పిల్లలు పుట్టిన కొన్నేళ్ల తర్వాత వివాహ బంధంలోకి అడుగుపెట్టడం సెలబ్రిటీ ప్రపంచంలో సాధారణమైపోయింది. హాలీవుడ్ నుంచి మొదలైన ఈ సంస్కృతి ఇప్పుడు బాలీవుడ్‌తో పాటు దక్షిణాది చిత్ర పరిశ్రమలకూ విస్తరిస్తోంది.

తాజాగా బాలీవుడ్ ప్రముఖ నటుడు అర్జున్ రాంపాల్ తన దీర్ఘకాల భాగస్వామి, మోడల్ గ్యాబ్రియెల్లా డెమెట్రియేడ్స్‌ను గోవాలో రిజిస్టర్ వివాహం చేసుకుని వార్తల్లో నిలిచారు. గత ఆరేళ్లకు పైగా సహజీవనం చేస్తున్న ఈ జంటకు ఇప్పటికే అరిక్, అరవ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. 2018 నుండి కలిసి ఉంటున్న వీరి బంధానికి ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత తాజాగా గోవాలోని యూనిఫాం సివిల్ కోడ్ కింద తమ వివాహాన్ని అధికారికంగా నమోదు చేయించుకోవడం ద్వారా ఈ సెలబ్రిటీ ట్రెండ్‌ను మరోసారి చర్చనీయాంశంగా మార్చారు.

కేవలం అర్జున్ రాంపాల్ మాత్రమే కాకుండా.. అంతర్జాతీయంగా - భారతీయ సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు కూడా ఇదే బాటలో నడిచారు. హాలీవుడ్ స్టార్ జంట బ్రాడ్ పిట్-ఆంజెలీనా జోలీ దాదాపు దశాబ్ద కాలం సహజీవనం చేస్తూ.. పిల్లలు పుట్టి పెద్దయ్యాక 2014లో వివాహం చేసుకున్నారు. మన దేశంలో విశ్వనటుడు కమల్ హాసన్-సారికల బంధంలో శృతి హాసన్ జన్మించిన తర్వాతే వారు పెళ్లి చేసుకున్నారు. అలాగే నటి కల్కి కొచ్లిన్ తన ఇజ్రాయెలీ ప్రియుడు గై హెర్ష్‌బర్గ్‌తో సహజీవనంలో ఉండగానే 2020లో ఒక ఆడపిల్లకు జన్మనిచ్చింది.

అంతర్జాతీయ స్థాయిలో ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఆయన భాగస్వామి జార్జినా రోడ్రిగ్జ్ సుదీర్ఘకాలంగా పెళ్లి కాకుండానే నలుగురు పిల్లలను పెంచుతూ ఒకే ఇంట్లో ఉంటున్నారు. అత‌డు ఇటీవ‌లే ప్రియురాలిని పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే. `ఆక్వామ్యాన్` ఫేమ్ జాసన్ మోమోవా, లిసా బోనెట్ జంటకు ఇద్దరు పిల్లలు పుట్టిన దాదాపు పదేళ్ల తర్వాత 2017లో అధికారికంగా వివాహం చేసుకున్నారు. అలాగే దిగ్గజ నటుడు రిచర్డ్ గేర్.. బాలీవుడ్ పాతతరం నటి నీనా గుప్తా వంటి వారు కూడా వివాహ వ్యవస్థ కంటే ముందే సంతానాన్ని పొంది వార్తల్లో నిలిచారు.

ఒకప్పుడు సమాజం ఇలాంటి నిర్ణయాలను భిన్నంగా చూసినా నేటి ఆధునిక కాలంలో పెళ్లి అనేది కేవలం ఒక చట్టబద్ధమైన ప్రక్రియ మాత్రమేనని.. ఇద్దరి మధ్య ప్రేమ- పిల్లల పెంపకంలో బాధ్యతే ముఖ్యమని భావిస్తున్నారు. పిల్లలు పుట్టిన తర్వాత కూడా పరస్పర అవగాహనతో బాధ్యతాయుతంగా పెళ్లి చేసుకుని సంతోషంగా జీవించవచ్చని ఈ సెలబ్రిటీల జీవితాలు నిరూపిస్తున్నాయి.