Begin typing your search above and press return to search.

ఆధ్యాత్మిక మార్గంలో సినీ తారలు!

సినిమా రంగం అంటేనే నిరంతరం షూటింగ్‌లు, గ్లామర్, ప్రయాణాలతో కూడిన ఉరుకుల పరుగుల జీవితం.

By:  Srikanth Kontham   |   13 May 2026 9:00 PM IST
ఆధ్యాత్మిక మార్గంలో సినీ తారలు!
X

సినిమా రంగం అంటేనే నిరంతరం షూటింగ్‌లు, గ్లామర్, ప్రయాణాలతో కూడిన ఉరుకుల పరుగుల జీవితం. వెండితెరపై మెరిసే తారలు వృత్తిపరమైన బాధ్యతలతో ఎంత బిజీగా ఉన్నా? మనశ్శాంతి కోసం ఆధ్యాత్మికతకు పెద్దపీట వేస్తుంటారు. ఇటీవల కాలంలో టాలీవుడ్, బాలీవుడ్ భామలు వరుసగా పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. మొక్కులు తీర్చుకోవడమే కాకుండా అంతర్గత ప్రశాంతత కోసం, వ్యక్తిగత సవాళ్లను ఎదుర్కొనే శక్తి కోసం దైవ చింతనను ఆశ్రయించడం ప‌రిపాటిగా మారింది. ఈ క్రమంలోనే మిల్కీ బ్యూటీ తమన్నా, యువ నటి సారా అర్జున్ కలిసి మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శించారు.

అక్కడ అత్యంత పవిత్రమైన భస్మహారతి సేవలో పాల్గొని శివుని ఆశీస్సులు అందుకున్నారు. తెల్లవారుజామునే జరిగే ఈ విశిష్ట పూజలో పాల్గొన్న ఇద్దరు సాధారణ భక్తుల మాదిరిగానే సంప్రదాయ దుస్తుల్లో కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు. విజయవంతమైన కెరీర్‌ను కొన‌సాగిస్తున్నా? దైవ దర్శనం తమకు ఎంతో సానుకూల శక్తిని అందిస్తుంద‌ని ఈ సందర్భంగా పేర్కొన్నారు. స్టార్ హీరోయిన్ సమంత జీవితంలోని క్లిష్ట పరిస్థితుల్లో ఆధ్యాత్మికతనే బలమైన ఆసరాగా చేసుకున్నారు. అనారోగ్య సమస్యలు, వ్యక్తిగత ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు భక్తి మార్గాన్ని ఎంచుకున్నారు.

ఆలయాలను దర్శించడమే కాకుండా, ధ్యానం, యోగా , ఆధ్యాత్మిక ప్రసంగాల ద్వారా తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటున్నారు. సమంత అనుసరిస్తున్న ఈ జీవనశైలి ఆమె అభిమానులకు కూడా ఒక స్ఫూర్తినిస్తోంది. ఎన్ని సమస్యలు ఎదురైనా ఆధ్యాత్మిక బలం ఉంటే ధైర్యంగా ముందుకు సాగొచ్చ‌ని నిరూపిస్తున్నారు. తెలుగు సినిమా రంగంలో నేటి క్రష్ శ్రీలీల సైతం భక్తి భావంలో ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. వరుస సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న అమ్మడు ఇటీవల తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీనివాసుని పాదాల చెంత గడపడం వల్ల తనకు ఎనలేని ప్రశాంతత లభిస్తుందని భావిస్తారు.

ఆధునిక కాలంలో కూడా సంస్కృతి, సంప్రదాయాలకు విలువ ఇస్తూ సమయం దొరికినప్పుడల్లా పుణ్యక్షేత్రాలకు వెళ్లే యువతరం తారల ధోరణి మెచ్చుకోదగ్గదిగా ఉంది. బాలీవుడ్ నటి జాన్వి కపూర్ తల్లి దివంగత శ్రీదేవి వారసత్వాన్ని ఆధ్యాత్మికంగానూ కొనసాగిస్తున్నారు. శ్రీదేవికి తిరుమల వెంకన్నపై ఉన్న అచంచలమైన భక్తిని పుణికిపుచ్చుకున్న జాన్వి ప్రతి ఏటా తిరుమల కొండకు చేరుకుంటారు. తన పుట్టినరోజు లేదా ముఖ్యమైన సినిమాల ప్రారంభోత్సవాల సమయంలో తిరుపతి వెళ్లడం ఆచారంగా మార్చుకున్నారు. తల్లి బాటలో నడుస్తూ దక్షిణాది సంప్రదాయాలను పాటిస్తున్న జాన్వి తీరు నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది.

సినీ ప్రపంచం వెలుపల ఈ తారలు కూడా సామాన్యుల లాగే ప్రశాంతతను కోరుకుంటున్నారు. కెమెరా ముందు ఎన్ని పాత్రలు పోషించినా? దైవ సన్నిధిలో లభించే ఆనందం వెలకట్టలేనిదని అంతే బ‌లంగా న‌మ్ముతారు. గ్లామర్ పరిశ్రమలో ఎన్ని ఆకర్షణలు ఉన్నా? ఆధ్యాత్మిక మార్గమే మనిషికి నిజమైన వికాసాన్ని ఇస్తుందని నటీమణులు నిరూపిస్తున్నారు. ఈ భక్తి ప్రయాణం వారికి వృత్తిపరంగానే కాకుండా వ్యక్తిగతంగానూ ఎంతో పరిణతిని అందిస్తోంది.