ఆటలంటే పడి చచ్చే టాప్-10 స్టార్లు..ఫుట్‌బాల్‌పైనా అమితాసక్తి!
సినిమాలు, క్రీడలు అనేవి భారతదేశంలో అత్యంత ఆదరణ కలిగిన రెండు రంగాలు. వెండితెరపై ప్రేక్షకులను అలరించే సినీ సెలబ్రిటీలు చాలామంది.. నిజ జీవితంలో క్రీడలను అమితంగా ప్రేమిస్తుంటారు.
By: Sivaji Kontham | 19 Jun 2026 6:00 AM ISTసినిమాలు, క్రీడలు అనేవి భారతదేశంలో అత్యంత ఆదరణ కలిగిన రెండు రంగాలు. వెండితెరపై ప్రేక్షకులను అలరించే సినీ సెలబ్రిటీలు చాలామంది.. నిజ జీవితంలో క్రీడలను అమితంగా ప్రేమిస్తుంటారు. కేవలం వినోదం కోసమే కాకుండా.. పలు క్రీడలలో పెట్టుబడులు పెడుతూ, వాటికి బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తూ క్రీడా రంగాన్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. తాజాగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ ఫుట్ బాల్ మ్యాచుల నేపథ్యంలో ఆటలపై అమితాసక్తిని కనబరుస్తూ క్రీడలను ప్రోత్సహిస్తున్న భారతీయ టాప్ స్టార్లపై ప్రత్యేక కథనం...
ఈ జాబితాలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ అందరికంటే ముందు వరుసలో ఉంటారు. 70 ప్లస్ వయసులోనూ ఆయన ఇప్పటికీ నవయువకుడిలా ప్రతి క్రీడను ఎంతో ఆసక్తిగా ఫాలో చేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ ఫుట్ బాల్ మ్యాచుల్ని నిరంతరం వీక్షిస్తున్న అమితాబ్, ఐపిఎల్ టోర్నీని కూడా అస్సలు వదలకుండా చూసే పెద్ద అభిమాని. క్రికెట్, కబడ్డీ, ఫుట్ బాల్, మహిళా క్రికెట్, టెన్నిస్, షటిల్.. ఆట ఏదైనా సరే అమితాబ్ కల్పించే అవేర్ నెస్ (అవగాహన) వేరే లెవల్‌లో ఉంటుంది. సినిమాలతో పాటు ఆటలను కూడా ఫాలో అవ్వడానికి తనకు రోజుకు 24 గంటలు సరిపోవడం లేదని, 36 గంటలు కావాలని ఆయన అడుగుతుంటారంటే క్రీడలపై ఆయనకు ఎంతటి ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చు.
బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ కేవలం ఐపిఎల్ ఫ్రాంఛైజీ కోల్‌కతా నైట్ రైడర్స్ ఓనర్ మాత్రమే కాదు.. ఆట అంటే పడిచచ్చే వీరాభిమాని. క్రీడలపై ఉన్న ఆ ఇష్టమే ఆయనను క్రికెట్ ఫ్రాంఛైజీ ఓనర్ గా అంతలా రాణించేలా చేసింది. క్రికెట్ మాత్రమే కాకుండా ఇంకా చాలా క్రీడలపై షారూఖ్ కి విపరీతమైన ఆసక్తి ఉంది. అందుకోసమే ఆయన క్రీడా రంగంలో భారీగా పెట్టుబడులు కూడా పెడుతున్నారు. షారూఖ్ ఖాన్‌తో పాటు బాలీవుడ్‌లో క్రికెట్, ఫుట్ బాల్ ఆటల్ని ప్రేమించే స్టార్లు చాలామందే ఉన్నారు. ముఖ్యంగా రణబీర్ కపూర్, జాన్ అబ్రహం, అభిషేక్ బచ్చన్ వంటి హిందీ తారలు ఫుట్ బాల్ ఆటపై విపరీతమైన ఆసక్తిని కనబరుస్తూ.. ఇండియన్ సూపర్ లీగ్ (ISL) వంటి టోర్నమెంట్లలో ఫుట్ బాల్ జట్లను కొనుగోలు చేసి ఆ క్రీడను మరింత ముందుకు నడిపిస్తున్నారు.
ఇక టాలీవుడ్ విషయానికి వస్తే.. విక్టరీ వెంకటేష్ క్రికెట్ కి ఎంతటి వీర ప్రేమికుడో అందరికీ తెలిసిందే. ఐపిఎల్ మ్యాచ్ లు అయినా, వరల్డ్ కప్ మ్యాచ్ లు అయినా ఆయన అస్సలు వదిలిపెట్టరు. కేవలం టీవీలకే పరిమితం కాకుండా నేరుగా లైవ్ గా గ్రౌండ్ కి వెళ్లి మరీ భారత జట్టును ఉత్సాహపరుస్తుంటారు. వెంకీ సోదరుడు, ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కుమారుడైన హీరో దగ్గుబాటి రానా కూడా క్రీడలను ప్రోత్సహించడంలో ముందున్నారు. ముఖ్యంగా మన దేశీయ ఆట అయిన ప్రోకబడ్డీ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ.. ఆ ఆటకు దేశవ్యాప్తంగా అసాధారణమైన ప్రాచుర్యాన్ని కల్పించడంలో రానా కీలక పాత్ర పోషించారు.
అలాగే అక్కినేని ఫ్యామిలీలో కింగ్ నాగార్జున, నాగచైతన్య, అఖిల్ ముగ్గురూ క్రీడల పట్ల అమితాసక్తిని కనబరుస్తూ గొప్ప స్పోర్ట్స్ అభిమానులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. వీరిలో యువ హీరో అఖిల్ అక్కినేని ఎంత మంచి క్రికెట్ ప్లేయర్ అన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రతి ఏటా జరిగే సీసీఎల్ (సెలబ్రిటీ క్రికెట్ లీగ్)లో అఖిల్ బ్యాటింగ్‌తో, ఆల్‌రౌండ్ ప్రదర్శనతో చేసే మెరుపుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. క్రికెట్ సహా పలు క్రీడలపై ఈ ముగ్గురికీ మంచి అవగాహన ఉంది. వీరితో పాటు టాలీవుడ్‌లో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, నితిన్ వంటి పలువురు స్టార్ హీరోలు ఫుట్ బాల్ ఆటపై విపరీతమైన ఆసక్తిని కనబరుస్తూ, అంతర్జాతీయ ఫుట్ బాల్ మ్యాచ్‌లను క్రమం తప్పకుండా ఫాలో అవుతూ యువతలో క్రీడా స్ఫూర్తిని నింపుతున్నారు. మెజారిటీ సెలబ్రిటీలు క్రికెట్ ఆటతో పాటు అథ్లెటిక్స్ ని ఇష్టపడుతున్న వారి జాబితాలో ఉన్నారు.
