మీమ్ ఫెస్ట్: స్టార్లలో ఎవరినీ వదిలి పెట్టరా?
సోషల్ మీడియా ఈ రోజుల్లో ఎవరినీ వదిలిపెట్టడం లేదు. ఎక్కడ ఏ తేడా ఉన్నా 'మీమ్స్ ఫెస్ట్' మొదలైపోతోంది.
By: Sivaji Kontham | 3 Aug 2025 11:11 PM ISTసోషల్ మీడియా ఈ రోజుల్లో ఎవరినీ వదిలిపెట్టడం లేదు. ఎక్కడ ఏ తేడా ఉన్నా `మీమ్స్ ఫెస్ట్` మొదలైపోతోంది. అందం, ప్రతిభతో పాటు, అన్నీ సవ్యంగా ఉన్నా విమర్శించేవాళ్లు లేకపోలేదు. డిజిటల్ మీడియా ట్రెండ్ లో ఇది చాలా రొటీన్ గా మారిపోయింది. అందుకే ఇప్పుడు సోషల్ మీడియా కామెంట్లను ఎవరూ అంతగా పట్టించుకోవడం లేదు. ఇలాంటివి ఎక్కువ సీరియస్ గా తీసుకోకూడదు అనే సెలబ్రిటీలు ఒక అభిప్రాయానికి వచ్చారు.
అయితే ఇటీవల ఎక్కువగా ట్రోలింగుకి గురవుతున్న వారిలో జాన్వీ కపూర్- ఖుషి కపూర్ సిస్టర్స్, కియరా అద్వాణీ, దీపిక, ఆలియా వంటి ప్రముఖులు ఉన్నారు. జాన్వీని కొందరు ప్లాస్టిక్ ఫేస్ అని విమర్శించారు. పరంసుందరి ప్రమోషన్స్ కొనసాగుతున్న ఈ సమయంలో జాన్వీపై తీవ్రమైన కామెంట్లు చర్చగా మారుతున్నాయి. మరోవైపు జాన్వీ సోదరి ఖుషి కపూర్ `ది ఆర్చీస్- నాదనియాన్`లతో తెరంగేట్రం చేయగా, ఈ అమ్మడి అందం, నటన గురించి కించపరిచే వ్యాఖ్యలు వినిపించాయి. కియరా అద్వాణీ 'వార్ 2' బికినీ లుక్ పైనా నెటిజనులు తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఏఐలో సృష్టించిన బికినీ, ఫ్లాట్ బట్ అంటూ క్రిటిసైజ్ చేస్తున్నారు. కియరా పిరుదులను కృత్రిమ మేధస్సుతో రూపొందించారని విమర్శిస్తున్నారు. మరోవైపు ఆలియా భట్, దీపిక పదుకొనే లాంటి సీనియర్ నాయికలను కూడా నెటిజనులు విడిచిపెట్టడం లేదు. ముఖ్యంగా ఇంకా నలభైలో అయినా అడుగుపెట్టని దీపికను `ఫిఫ్టి ప్లస్` అంటూ విమర్శిస్తున్నారు కొందరు. అయితే దీపికను విమర్శించేది ఆలియా అభిమానులు అంటూ కొందరు హింట్ ఇస్తున్నారు. ఆలియా పేరును పదే పదే ప్రస్థావిస్తూ మీమ్స్ తో విసిగించడం కూడా ప్రత్యక్షంగా కనిపిస్తోంది. ఇది కేవలం ఎవరో కొందరు స్టార్లకు మాత్రమే కాదు.. మేల్ ఫీమేల్ అనే విభేధం లేకుండా, అందరికీ ఈ సమస్య ఉంది.
ఏది ఏమైనా డిజిటల్ యుగంలో విమర్శలు, ప్రతి విమర్శలు, సెటైర్లు, కామెంట్లు, ఇతర కుట్ర సిద్ధాంతాలు చాలా రొటీన్‌గా మారాయి. ఎక్కడైనా కువిమర్శ కంటే సద్విమర్శకే ఎక్కువ ఫాలోయింగ్ ఉంటుంది. అలా మంచి విమర్శ చేయలేని వారికి సోషల్ మీడియాలలో ఒకరిని తిట్టే అర్హత లేదు. స్టార్ల శరీరాకృతిపై ఇలా దారుణమైన విమర్శలు, దూషణలు చేయడం నిజంగా హర్షించదగిన పరిణామం కాదు. అయితే ఇలాంటి అనవసర రాద్ధాంతానికి పాల్పడే నెటిజనులు, చెడు వ్యాఖ్యలు చేసే కంటే తారలు అందాన్ని మెరుగుపరుచుకోవడానికి లేదా ప్రతిభ పరంగా నిరూపించుకునేందుకు ఏం చేయాలో సరైన సలహాలు, సూచనలు అందిస్తే బావుంటుందేమో!
