అవాక్కు: CBSC ప్రశ్నాపత్రంలో స్కాన్ చేస్తే 'ఒర్రీ' పేజీ ఓపెనైంది
సీబీఎస్ఈ బోర్డు పరీక్షల్లో చోటుచేసుకున్న ఒక వింత పరిణామం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
By: Sivaji Kontham | 1 April 2026 4:38 PM ISTసీబీఎస్ఈ బోర్డు పరీక్షల్లో చోటుచేసుకున్న ఒక వింత పరిణామం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. విద్యారంగంలో డిజిటల్ సంస్కృతి పెరగడం మంచిదే అయినా..అది ఒక్కోసారి ఊహించని మలుపులు తిరుగుతుందని ఈ ఘటన నిరూపించింది. 31 మార్చి 2026న జరిగిన 12వ తరగతి చరిత్ర (హిస్టరీ) బోర్డు పరీక్షలో ఒక క్యూఆర్ కోడ్ కలకలం సృష్టించింది. పరీక్షా పత్రంపై ఉన్న ఆ కోడ్‌ను స్కాన్ చేయగా.. అది సబ్జెక్టుకు సంబంధించిన సమాచారానికి బదులుగా ఇంటర్నెట్ సెన్సేషన్ `ఒర్రీ`(అవ్రతమణి)కి సంబంధించిన గూగుల్ సెర్చ్ పేజీకి మళ్లించడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.
పరీక్ష రాస్తున్న సమయంలో ఈ వింత పరిణామాన్ని గమనించిన విద్యార్థులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. చరిత్రకు సంబంధించిన ప్రశ్నపత్రంలో ప్రస్తుత పాప్ కల్చర్ సెలబ్రిటీ అయిన ఒర్రీ పేరు కనిపించడం ఒక వింతగా మారింది. ఈ వార్త బయటకు రావడంతో సోషల్ మీడియాలో దీనిపై రకరకాల చర్చలు మొదలయ్యాయి. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన జెన్ జెడ్ చిలిపి పనా లేక పేపర్ ఎన్‌కోడింగ్ ప్రక్రియలో జరిగిన సాంకేతిక లోపమా? అని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనపై ఇంటర్నెట్ సెలబ్రిటీ ఒర్రీ తనదైన శైలిలో స్పందించడం విశేషం. సోషల్ మీడియా వేదికగా ఆయన ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ తన కీర్తి పీక్స్ కి చేరుకుందని సరదాగా వ్యాఖ్యానించారు. బోర్డు పరీక్షా పత్రంలో తన ప్రస్తావన రావడంపై ఒర్రీ చేసిన ఫన్నీ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఒర్రీ స్పందనతో ఈ మొత్తం వ్యవహారం మరింత సరదాగా మారి మీమ్స్ వెల్లువకు దారితీసింది. ఓర్రీకి అమ్మాయిల్లోనే కాదు క్యూఆర్ వ్యవస్థలోను ఏజెంట్లు ఉన్నారు! అంటూ ఇప్పుడు నెటిజనులు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
వివాదం ముదురుతుండటంతో సీబీఎస్ఈ బోర్డు ఈ విషయంపై స్పష్టత ఇచ్చింది. ఆ పరీక్షా పత్రాలు ప్రామాణికమైనవేనని బోర్డు ధృవీకరించినా కానీ.. క్యూఆర్ కోడ్ విషయంలో జరిగిన పొరపాటుపై విచారణ అవసరమని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. బోర్డు పరీక్షలు అంటే అత్యంత పకడ్బందీగా.. పవిత్రంగా నిర్వహించాల్సినవి కాబట్టి ఇలాంటి అసంబద్ధమైన లింకులు కనిపించడం వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతోందని కొందరు విమర్శిస్తున్నారు.
మొత్తంమీద 2026 విద్యా సంవత్సరంలో ఈ `ఒర్రీ క్యూఆర్ కోడ్` ఘటన అత్యంత చర్చనీయాంశమైన అంశంగా నిలిచింది. డిజిటల్ టూల్స్‌ను విద్యా వ్యవస్థలో భాగం చేసేటప్పుడు ఎంతటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ సంఘటన ఒక పాఠంగా నిలుస్తుంది. సాంకేతికత ఎంత వేగంగా దూసుకుపోతున్నా.. విద్యా సంబంధిత కీలక పత్రాల విషయంలో మానవ పర్యవేక్షణ, ఖచ్చితత్వం ఎంత ముఖ్యమో ఈ వైరల్ ఘటన గుర్తుచేస్తోంది.
