Begin typing your search above and press return to search.

12వ తరగతి CBSE పేపర్‌లో QR కోడ్ రహస్యం బట్టబయలు!

సాధారణంగా బోర్డు పరీక్షలంటే విద్యార్థులకు చెమటలు పడతాయి. కానీ 2026 CBSE 12వ తరగతి హిస్టరీ పేపర్ మాత్రం విద్యార్థులను ఆశ్చర్యంలో ముంచెత్తింది.

By:  Madhu Reddy   |   2 April 2026 4:32 PM IST
12వ తరగతి CBSE పేపర్‌లో QR కోడ్ రహస్యం బట్టబయలు!
X

సాధారణంగా బోర్డు పరీక్షలంటే విద్యార్థులకు చెమటలు పడతాయి. కానీ 2026 CBSE 12వ తరగతి హిస్టరీ పేపర్ మాత్రం విద్యార్థులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. పరీక్ష పత్రంపై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసిన విద్యార్థులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. అది హిస్టరీ పాఠాలకు బదులు, సోషల్ మీడియా స్టార్ 'ఓరీ' ప్రొఫైల్‌కు దారితీసింది. పరీక్షల ఒత్తిడిలో ఉన్న స్టూడెంట్స్‌కు ఈ ఘటన ఒక రేంజ్ వినోదాన్ని పంచింది. అసలు ఆ కోడ్‌లో ఏముందో పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం.

హిస్టరీ పేపర్‌లో చరిత్ర సృష్టించిన 'ఓరీ':

మార్చి 30న జరిగిన హిస్టరీ బోర్డు ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్‌పై సెక్యూరిటీ కోసం ఒక క్యూఆర్ కోడ్‌ను ముద్రించారు. పేపర్ ప్రామాణికతను చెక్ చేయడానికి ఉద్దేశించిన ఆ కోడ్‌ను కొందరు విద్యార్థులు స్కాన్ చేయగా, అది సెలబ్రిటీల ఫ్రెండ్ మరియు ఇంటర్నెట్ సెన్సేషన్ ఓర్హాన్ అవత్రామణి అలియాస్ 'ఓరీ' కి సంబంధించిన సెర్చ్ పేజీని చూపించింది. ఇక ఒక నేషనల్ బోర్డ్ ఎగ్జామ్ పేపర్‌లో ఇలాంటి వింత జరగడం సోషల్ మీడియాలో దావానంలా వ్యాపించింది. సెట్-1 మరియు సెట్-3 పేపర్లలో కూడా ఇదే రిజల్ట్ రావడంతో అంతా షాక్ అయ్యారు.

మురిసిపోయిన ఓరీ.. ఇన్‌స్టాగ్రామ్ రచ్చ:

ఈ విషయం కాస్తా 'ఓరీ' దృష్టికి వెళ్లడంతో ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తాను సీబీఎస్‌ఈ ఎగ్జామ్ పేపర్‌పై ఉండటం తన కల నిజమైనట్లు అనిపిస్తోందని ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో పోస్ట్ చేశారు. "ఓ మై గాడ్.. నేను ఎగ్జామ్ పేపర్‌పై ఉన్నాను, సిబిఎస్ఈ పేపరే ఇప్పుడు కొత్త ఫుల్‌ఝడి ప్యాకెట్" అంటూ తనదైన స్టైల్లో సరదాగా కామెంట్ చేశారు. ఇక దీంతో నెటిజన్లు "చరిత్ర పేపర్లో ఓరీ కొత్త చరిత్ర సృష్టించాడు" అంటూ రకరకాల మీమ్స్‌తో ఎంజాయ్ చేస్తున్నారు.

గతంలో 'రిక్ రోల్' ప్రాంక్ గుర్తుందిగా?:

సీబీఎస్‌ఈ పేపర్లలో ఇలాంటి వింతలు జరగడం ఇదే మొదటిసారి కాదు. ఈ ఏడాది మార్చి 9న జరిగిన మ్యాథ్స్ పేపర్‌పై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే.. ఫేమస్ సింగర్ రిక్ ఆస్ట్లీ పాడిన "నెవర్ గన్నా గివ్ యు అప్" అనే వీడియో ప్లే అయ్యింది. ఇంటర్నెట్ భాషలో దీనిని 'రిక్ రోల్' ప్రాంక్ అంటారు.ఇక అప్పట్లో బోర్డు స్పందిస్తూ అది కేవలం భద్రత కోసమేనని చెప్పింది. కానీ ఇప్పుడు మళ్ళీ హిస్టరీ పేపర్‌లో ఓరీ ప్రత్యక్షమవ్వడం చూస్తుంటే, ఎవరో కావాలనే ఇలాంటి 'ప్రాంక్స్' చేస్తున్నారా అనే అనుమానం కలుగుతోంది.

సాంకేతిక లోపమా లేక సరదా ప్రయోగమా?:

పరీక్షల టెన్షన్‌లో ఉన్న విద్యార్థులకు ఇది కాస్త ఉపశమనాన్ని ఇచ్చినప్పటికీ, భద్రతా పరంగా ఇది పెద్ద లోపమే అని చెప్పాలి. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న బోర్డు పరీక్షల్లో ఇలాంటి అసంబద్ధమైన లింకులు ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఇక టెక్నాలజీ మరియు పాప్ కల్చర్ కలిసి చదువును కూడా ఒక మీమ్ లా మార్చేయడం ఆశ్చర్యకరంగా ఉంది. మరి ఈ 'ఓరీ' సెర్చ్ రిజల్ట్‌పై సీబీఎస్‌ఈ అధికారులు అధికారికంగా ఏమని సమాధానం ఇస్తారో వేచి చూడాలి.

చదువులో వినోదం:

మొత్తానికి 2026 బోర్డు పరీక్షలు విద్యార్థులకు ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోనున్నాయి. హిస్టరీ పేపర్‌లో ప్రశ్నలకు సమాధానాలు వెతకడమే కష్టమనుకుంటే, ఇలాంటి ట్విస్టులు విద్యార్థులకు లైఫ్ టైమ్ మెమరీని ఇచ్చాయి. ఇక సీబీఎస్‌ఈ లాంటి పెద్ద సంస్థలు భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడతాయని ఆశిద్దాం. అప్పటివరకు ఓరీ మాత్రం ఈ సడన్ ఫేమ్‌ను ఫుల్లుగా ఎంజాయ్ చేస్తూనే ఉంటాడు!