Begin typing your search above and press return to search.

8 ఏళ్లు, 20 వేల సినిమాలు- లక్ష సీన్స్ కట్ : సెన్సార్ బోర్డ్ పనితనం

ఈ నేపథ్యంలో బెంగళూరుకు చెందిన డెవలపర్, రీసెర్చర్ అమన్ భార్గవ నేతృత్వంలో 2024 డిసెంబర్ నుంచి స్వచ్ఛంద సభ్యుల బృందం సెన్సార్‌షిప్ రికార్డులను సేకరిస్తోంది.

By:  M Prashanth   |   16 Sept 2025 7:32 PM IST
8 ఏళ్లు, 20 వేల సినిమాలు- లక్ష సీన్స్ కట్  : సెన్సార్ బోర్డ్ పనితనం
X

భారత సినిమా సెన్సార్ బోర్డు (CBFC) 2017 నుంచి ఇప్పటివరకు 1,00,000కు పైగా సినిమా సన్నివేశాలను ఎడిట్ చేసినట్లు సీబీఎఫ్ సీ వాచ్ అనే ప్లాట్‌ ఫామ్ ద్వారా తాజా డేటా వెల్లడైంది. సినిమా ప్రేక్షకులు సీబీఎఫ్ సీ నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సన్నివేశాలను తొలగించడం లేదా సందేహాస్పద కంటెంట్‌ను అనుమతించడంపై వారు నిరసన తెలుపుతున్నారు.

కొందరు సినీ అభిమానులు సీబీఎఫ్ సీని ఓ ప్రాపగండ టూల్ గా భావిస్తున్నారు. అధికారంలో ఉన్న ప్రభుత్వం ఐడియాలజీను సీబీఎఫ్ సీ పాటిస్తుందని ప్రేక్షకుల్లో ఓ భావన ఉంది. రాజకీయ, మతపరమైన అంశాలను రక్షించేలా లేదా ప్రభుత్వ దృక్కోణానికి అనుగుణంగా కథనాలను రూపొందించేలా సీబీఎఫ్ సీ చర్యలు ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో బెంగళూరుకు చెందిన డెవలపర్, రీసెర్చర్ అమన్ భార్గవ నేతృత్వంలో 2024 డిసెంబర్ నుంచి స్వచ్ఛంద సభ్యుల బృందం సెన్సార్‌షిప్ రికార్డులను సేకరిస్తోంది. వారు సీబీఎఫ్ సీ వాచ్ అనే ఓపెన్-సోర్స్ ఇంటరాక్టివ్ వెబ్‌ సైట్‌ ను రూపొందించారు. ఇది 2017 నుంచి 2025 వరకు CBFC చేసిన సెన్సార్ నిర్ణయాలను ట్రాక్ చేస్తుంది. డేటాబేస్ ప్రకారం.. గత 7ఏళ్లలో సుమారు 20,000 సినిమాలకు 1,01,000కు పైగా కట్స్ చేశారు.

ఈ కట్స్‌ను అశ్లీలత, మాదక ద్రవ్యాలు, హింస, లైంగిక కంటెంట్, మతపరమైన లేదా రాజకీయ అంశాల వంటి విభాగాలుగా విభజించారు. డేటా విశ్లేషణలో మతపరమైన, రాజకీయ, మాదక ద్రవ్యాలకు సంబంధించిన కంటెంట్‌పై సీబీఎఫ్ సీ ఎక్కువగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అయితే అశ్లీలత, హింస, లైంగిక కంటెంట్‌ పై తక్కువగా సెన్సార్ చేసినట్లు కనిపిస్తోంది.

ప్రాంతీయ సెన్సార్ షిప్ లో వేరియేషన్స్ ఉన్నాయి. చెన్నై, తిరువనంతపురం సెన్సార్ కార్యాలయాలు ఇతర ప్రాంతాల కంటే ఎక్కువ కంటెంట్‌ ను సెన్సార్ చేసినట్లు తేలింది. ప్రస్తుతం, 17,300 సినిమాలకు సంబంధించి 1,01,000 సెన్సార్‌ షిప్ రికార్డులను వెబ్ సైట్ అందిస్తోంది. వెబ్‌సైట్‌ను రూపొందించడంలో ప్రారంభంలో సవాళ్లు ఎదురైనప్పటికీ.. ఇప్పుడు ఇది అందరికీ అందుబాటులో ఉంది. అయితే కంటెంట్ ను కంట్రోల్ చేయడం అంటే సమాజాన్ని నియంత్రించడమేనని ఈ అంకెలు చెబుతున్నాయి.