Begin typing your search above and press return to search.

CBFC సంచలన నిర్ణయం: సినిమాలకు 'తత్కాల్' సెన్సార్ రద్దు..ఆఖరి నిమిషం హడావుడికి బ్రేక్!

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సి) 1 జూన్ 2026 నుండి సినిమాల సెన్సార్ ప్రక్రియలో అత్యంత కీలకమైన తత్కాల్ సర్టిఫికేషన్ విధానాన్ని అధికారికంగా రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుందని బాలీవుడ్ హంగామా త‌న క‌థ‌నంలో పేర్కొంది.

By:  Sivaji Kontham   |   4 Jun 2026 4:41 PM IST
CBFC సంచలన నిర్ణయం: సినిమాలకు తత్కాల్ సెన్సార్ రద్దు..ఆఖరి నిమిషం హడావుడికి బ్రేక్!
X

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇకపై సినిమాల విడుదల ప్రణాళికలు పూర్తిగా మారిపోనున్నాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సి) 1 జూన్ 2026 నుండి సినిమాల సెన్సార్ ప్రక్రియలో అత్యంత కీలకమైన తత్కాల్ సర్టిఫికేషన్ విధానాన్ని అధికారికంగా రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుందని బాలీవుడ్ హంగామా త‌న క‌థ‌నంలో పేర్కొంది. ఇన్నాళ్లూ అదనపు రుసుము చెల్లించడం ద్వారా అత్యంత వేగంగా ఫాస్ట్-ట్రాక్ పద్ధతిలో సెన్సార్ సర్టిఫికేట్ పొందేందుకు ఈ తత్కాల్ విధానం మేకర్స్‌కు ఎంతో సహాయపడేది. అత్యవసర పరిస్థితుల కోసం మొదట్లో ఈ సదుపాయాన్ని ప్రవేశపెట్టినా.. కాలక్రమేణా పెద్ద నిర్మాణ సంస్థలన్నీ తమ సినిమా విడుదల ప్రణాళికల్లో దీనిని ఒక సాధారణ విష‌యంలా మార్చేసుకున్నాయి. ఇప్పుడీ సేఫ్టీ నెట్ అకస్మాత్తుగా తొలగిపోవడంతో ప్రొడ్యూసర్లు అందరూ తప్పనిసరిగా సాధారణ సెన్సార్ ప్రక్రియనే అనుసరించాల్సి ఉంటుంది. దీని కింద అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత సర్టిఫికేట్ రావడానికి ప్రస్తుత నిబంధనల ప్రకారం గరిష్టంగా 60 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది.

పైకి ఇది కేవలం ఒక అడ్మినిస్ట్రేటివ్ మార్పులా కనిపిస్తున్నా.. పరిశ్రమపై దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉండబోతోందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవలి కాలంలో మన దేశంలో చాలామంది నిర్మాతలు, దర్శకులకు సినిమా విడుదల తేదీకి కేవలం కొన్ని వారాల ముందు వరకు ఎడిటింగ్, విజువల్ ఎఫెక్ట్స్ (వీఎఎఫ్ఎక్స్‌), సౌండ్ మిక్సింగ్ వంటి పనులను ఆఖరి నిమిషం దాకా సాగదీయడం ఒక అలవాటుగా మారింది. ఒకవేళ పనులు ఆలస్యమైనా `తత్కాల్` మార్గం ఉందనే ధీమాతో ఉండేవారు. కానీ ఇకపై ఆ వెసులుబాటు లేదు కాబట్టి.. నిర్మాతలు తమ చిత్రాలను విడుదల తేదీ కంటే కనీసం ఒకటి లేదా రెండు నెలల ముందే పూర్తిగా సిద్ధం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. లేనిపక్షంలో సెన్సార్ సర్టిఫికేషన్ ఆలస్యమైతే సినిమా విడుదల తేదీలు ప్రమాదంలో పడే అవకాశం ఉంది.

ఈ నూతన నిబంధనల ప్రభావం సంక్రాంతి, దసరా, దీపావళి, క్రిస్మస్, స్వాతంత్య్ర‌ దినోత్సవం వంటి ప్రధాన పండుగ సీజన్లపై స్పష్టంగా కనిపించనుంది. ఇప్పటికే ఈ సీజన్లలో పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతుంటాయి. ఇలాంటి తరుణంలో ఏ ఒక్క సినిమాకైనా సెన్సార్ అనుమతులు ఆలస్యమైతే.. ఆ చిత్రం వాయిదా పడటం లేదా ఊహించని విధంగా ఇతర చిత్రాలతో బాక్సాఫీస్ క్లాషెస్ (పోటీ) కు దారితీయడం ఖాయం. ఈ ప్రభావం కేవలం థియేటర్లకే పరిమితం కాకుండా ప్రమోషనల్ టూర్లు, అడ్వాన్స్ బుకింగ్స్, ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్, డిజిటల్ అగ్రిమెంట్లు, థియేటర్ల కేటాయింపు వంటి ప్రతి ఒక్క అంశంపై పడుతుంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా భారీ మార్కెటింగ్ ప్రణాళికలతో బహుభాషల్లో విడుదలయ్యే పాన్-ఇండియా సినిమాలకు సెన్సార్ ఆలస్యమైతే మొత్తం విడుదల సైకిల్ తలకిందులవుతుంది.

అయితే ఈ నిర్ణయాన్ని పరిశ్రమలోని కొందరు ట్రేడ్ అనలిస్టులు సానుకూల కోణంలో కూడా చూస్తున్నారు. ఈ మార్పు వల్ల చిత్ర పరిశ్రమలో ఒక క్రమశిక్షణ పెరుగుతుందని వారు అంచనా వేస్తున్నారు. తత్కాల్ సదుపాయం ఉండటం వల్లే చాలామంది మేకర్స్ బద్ధకించి ఆఖరి నిమిషం వరకు పనులను పెండింగ్ పెట్టేవారని.. ఇప్పుడు ఆ ఆప్షన్ లేకపోవడం వల్ల ల్యాబ్‌లలో ప్రాజెక్ట్‌లను సకాలంలో పూర్తి చేయడానికి మరింత వాస్తవిక ప్రణాళికలు వేసుకుంటారని భావిస్తున్నారు. దీనితో పాటు ఈ మార్పు పరిశ్రమలో అందరికీ సమానమైన అవకాశాలను కల్పిస్తుంది. గతంలో పెద్ద నిర్మాతలు ఎక్కువ డబ్బు చెల్లించి త్వరగా సెన్సార్ క్లియరెన్స్ తెచ్చుకునేవారు. చిన్న నిర్మాతలు మాత్రం సాధారణ క్యూలో నిలబడాల్సి వచ్చేది. ఇప్పుడు బడ్జెట్ లేదా సినిమా స్కేల్‌తో సంబంధం లేకుండా అన్ని చిత్రాలు ఒకే కాలక్రమాన్ని అనుసరించాల్సి ఉంటుంది.

మునుముందు ఈ మార్పుకు అలవాటు పడటం చిత్ర పరిశ్రమకు కొంత కష్టంగా అనిపించినా.. ఒకటి మాత్రం స్పష్టం: ఈ `తత్కాల్` సెన్సార్ విధానం రద్దు కావడం అనేది కేవలం ఒక చిన్న ప్రక్రియ మార్పు మాత్రమే కాదు. భారతదేశంలో సినిమాల నిర్మాణం, విడుదల షెడ్యూల్స్, మార్కెటింగ్, థియేట్రికల్ బిజినెస్ నడిచే విధానాన్ని ఇది సమూలంగా మార్చివేయబోతోంది. సరైన సమయంలో సినిమాను థియేటర్లలోకి తీసుకురావడమే విజయానికి ప్రధాన సూత్రంగా భావించే చలనచిత్ర రంగంలో ఈ నిర్ణయం చాలామంది ఊహించిన దానికంటే అత్యంత ప్రాధాన్యత కలిగిన సంచలనంగా మారబోతోంది.