Begin typing your search above and press return to search.

మోడ్ర‌న్ స్త్రీ: ఉపాసన ఫేవ‌రిజంపై జాతీయ చర్చ

స్త్రీ ఆకాశంలో స‌గం. పురుషుడిలోను స‌గం. కానీ సంఘంలో స్త్రీ స్థానం ఎక్క‌డ ఉంది? మ‌గువ‌కు అర్థ‌రాత్రి స్వాతంత్య్రం సంపూర్ణంగా అందుతోందా? ఇవ‌న్నీ ఇప్ప‌టికీ శేష ప్ర‌శ్న‌లుగానే ఉన్నాయి.

By:  Sivaji Kontham   |   20 Nov 2025 9:54 AM IST
మోడ్ర‌న్ స్త్రీ: ఉపాసన ఫేవ‌రిజంపై జాతీయ చర్చ
X

స్త్రీ ఆకాశంలో స‌గం. పురుషుడిలోను స‌గం. కానీ సంఘంలో స్త్రీ స్థానం ఎక్క‌డ ఉంది? మ‌గువ‌కు అర్థ‌రాత్రి స్వాతంత్య్రం సంపూర్ణంగా అందుతోందా? ఇవ‌న్నీ ఇప్ప‌టికీ శేష ప్ర‌శ్న‌లుగానే ఉన్నాయి. అయితే ఆడ‌ది త‌న‌కు తానుగా ఆర్థిక‌ స్వావ‌లంబ‌న సాధించాల‌ని, మాన‌సిక శారీర‌క - ఆరోగ్యం స‌హా స్వ‌యం ఉపాధిలోను స‌మృద్ధిగా ఉన్న‌ప్పుడే త‌న‌ను తాను సంస్క‌రించుకోగ‌ల‌ద‌నే అభిప్రాయం వ్య‌క్తం చేసారు ఉపాస‌న‌.

స్త్రీలు వివాహం చేసుకున్నా కెరీర్ ని కూడా కొన‌సాగించాల‌ని, అయితే దీనికోసం భాగ‌స్వామితో క‌లిసి నిర్ణ‌యం తీసుకోవాల‌ని ఉపాస‌న సూచించారు. నేటి మ‌హిళ‌ల‌కు ఆర్థిక స్థిర‌త్వం చాలా అవ‌స‌రం. త‌న కాళ్ల‌పై తాను నిల‌బ‌డాలి. అలాగే స్త్రీ ఇత‌రుల ఒత్తిడితో ప‌ని లేకుండా త‌న‌కు త‌గ్గ వ్య‌క్తిని ఎంపిక చేసుకునే అవ‌కాశం ఉండాలి! అని కూడా ఉపాస‌న అన్నారు. నేటిత‌రం ఇత‌రుల ఒత్తిడి కంటే నిజాయితీతో కూడిన‌ సంబంధం కోసం వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటున్నారని కూడా ఉపాస‌న అన్నారు. ప్ర‌స్తుతం ఉపాస‌న అభిప్రాయం జాతీయ స్థాయిలో డిబేట్ గా మారింది.

పెళ్లిలో అస్థిర‌త‌, గృహ హింస గురించి ఉపాస‌న గ‌తంలో త‌న ధృక్ప‌థాన్ని వెల్ల‌డించారు. స్త్రీల‌ను గౌర‌వించి పూజించ‌క‌పోతే దేవుడి గుడిలో దేవ‌త విగ్ర‌హం ఎందుకు? అని కూడా ప్ర‌శ్నించారు. ఇప్పుడు స్త్రీ ఆర్థిక భ‌ద్ర‌త గురించి, భ‌ర్త విష‌యంలో స్త్రీల ఎంపిక గురించి ఉపాస‌న సూటిగా మాట్లాడ‌టం ఆస‌క్తిని పెంచుతోంది. కెరీర్- పెళ్లి కచ్ఛితంగా అమ్మాయి విష‌యంలో క‌లిసే ఉండాల‌ని కూడా కుండ‌బ‌ద్ధ‌లు కొట్టారు. ప్ర‌తి స్త్రీ భ‌విష్య‌త్ ని భ‌ద్రంగా ఉంచుకోవాల‌నే అభిప్రాయాన్ని వ్య‌క్తం చేసారు.

స్త్రీలు త‌మ ఆరోగ్యం విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాలి. మాన‌సిక శ్రేయ‌స్సు చాలా ముఖ్య‌మ‌ని కూడా సూచించారు. మహిళలు తమ సొంత లక్ష్యాలను, సంతృప్తికరమైన జీవితాన్ని గడపడానికి టైమ్ ని మ్యానేజ్ చేయ‌డం నేర్చుకోవాల‌ని కూడా అన్నారు. ఉపాస‌న ఆద‌ర్శ‌వంత‌మైన సూచ‌న‌ల‌పై ఇప్పుడు జాతీయ స్థాయిలో డిబేట్ కొన‌సాగుతోంది. ఉపాస‌న‌పై నెటిజనులు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.