Begin typing your search above and press return to search.

మెట్ గాలా- 2026: క‌ళ్ల‌న్నీ ఈ గాయ‌ని వింత గౌనుపైనే..!

ప్రపంచ ప్రఖ్యాత ఫ్యాషన్ వేడుక `మెట్ గాలా 2026`లో మరోసారి అసాధారణ ప్రయోగాలతో క‌ట్టి ప‌డేస్తోంది.

By:  Sivaji Kontham   |   7 May 2026 2:51 PM IST
మెట్ గాలా- 2026: క‌ళ్ల‌న్నీ ఈ గాయ‌ని వింత గౌనుపైనే..!
X

చురుకైన‌ కళ్లు, గ్లోసీ లిప్స్.. ముఖంపై అమర్చిన ఒక చిన్న రత్నం.. ఇవేవీ కాదు ఆక‌ర్ష‌ణ‌లు.. ఆమె ధ‌రించిన ఆ వింతైన డ్రెస్ అస‌లు ఆక‌ర్ష‌ణ‌. `ఫ్యాషన్ ఈజ్ ఆర్ట్` అనే థీమ్‌కు అనుగుణంగా ప్ర‌ఖ్యాత ర్యాప‌ర్ `కార్డి బి` ధ‌రించిన ఈ గౌన్ `మెట్ గాలా 2026` ఈవెంట్లో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. పూర్తి వివ‌రాల్లోకి వెళితే..





ప్రపంచ ప్రఖ్యాత ఫ్యాషన్ వేడుక `మెట్ గాలా 2026`లో మరోసారి అసాధారణ ప్రయోగాలతో క‌ట్టి ప‌డేస్తోంది. ఈ వేదికపై ప్రముఖ రాపర్ కార్డి బి తన విలక్షణమైన వస్త్రధారణతో అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ``ఫ్యాషన్ ఈజ్ ఆర్ట్` (ఫ్యాషన్ ఒక కళ) అనే థీమ్‌ను తూచా తప్పకుండా అనుసరిస్తూ కార్డి బి ధరించిన గౌను ఆహూతులందరినీ విస్మయానికి గురిచేసింది. ప్రముఖ డిజైనర్ మార్క్ జాకబ్స్ రూపొందించిన ఈ `స్కల్ప్చరల్ గౌను` కేవలం ఒక డిజైన‌ర్ గౌనులా కాకుండా.. నడిచే ఒక కళాఖండంలా కనిపించడం విశేషం.

ఈ అపురూపమైన గౌను రూపకల్పన వెనుక ఒక చారిత్రక కళాత్మక ప్రేరణ ఉంది. 1933వ సంవత్సరానికి చెందిన హన్స్ బెల్మర్ పాపుల‌ర్ కళాఖండం `ది డాళ్‌` ఆధారంగా దీనిని తీర్చిదిద్దారు. మానవ శరీర ఆకృతిని ఒక వినూత్న కోణంలో ఆవిష్కరించడం ఈ డిజైన్ ప్రధాన ఉద్దేశ్యం. బాడీని ఒక కాన్వాస్‌గా మార్చి.. దానిపై రకరకాల ఆకృతులను అమర్చినట్లుగా ఈ దుస్తులు కనిపిస్తాయి. కార్డి బి తన బోళాత‌నం నిండిన‌ స్టైల్‌కు అనుగుణంగానే ఈ విభిన్న‌మైన‌ డిజైన్‌ను ఎంపిక చేసుకోవడం త‌న‌ ప్రత్యేకతను చాటిచెప్పింది.

ఈ గౌను తయారీలో రంగుల మేళ‌వింపును డిజైన్‌లో అత్యంత స‌ర‌ళంగా ఇమిడిపోయేలా చేసారు. చర్మం రంగులో ఉన్న బాడీసూట్‌పై నలుపు రంగు ఫ్లోరల్ లేస్‌ను పొందుపరిచారు. ఈ నలుపు రంగు కింద పింక్.. పీచ్ .. లావెండర్ వంటి సున్నితమైన రంగులు అప్పుడప్పుడూ మెరుస్తూ ఒక వైవిధ్య‌మైన‌ కాంట్రాస్ట్‌ను ఇచ్చాయి. కేవలం పారదర్శక గ్లాసీ లుక్ మాత్రమే కాకుండా.. ఈ దుస్తుల్లోని డిజైన్‌ ప్ర‌తి ఒక్కరినీ విపరీతంగా ఆకర్షించింది.

ముఖ్యంగా ఈ గౌనుకు ఉన్న ఓవ‌ర్‌సైజ్డ్ స్లీవ్స్ .. పాదాల వద్ద ఉన్న ఆకృతులు దీనిని ఒక శిల్పంలా మార్చేశాయి. శరీరానికి హత్తుకున్నట్లు ఉంటూనే.. అకస్మాత్తుగా ఉబ్బినట్లుగా ఉండే ఈ `పిల్లోవీ షేప్స్` ఒక డ్రమాటిక్ లుక్‌ను ఇచ్చాయి. సాధారణంగా గౌను అనగానే ఒక పద్ధతిలో ఉంటుందని ఊహించే వారికి కార్డి బి ప్రదర్శించిన ఈ వేరబుల్ ఆర్ట్ సరికొత్త పాఠాలు నేర్పింది. ఈ భారీ స్లీవ్స్ ..పొడవాటి ట్రైన్ గౌన్ కార్డి బీని మెట్ గాలా రెడ్ కార్పెట్ మీద కేంద్ర‌క ఆక‌ర్ష‌ణ‌గా నిలబెట్టాయి.

కార్డి బి ఎంపిక చేసుకున్న మేకప్- హెయిర్ స్టైల్ కూడా ఈ వింత గౌనుకు పూర్తిగా అతికిన‌ట్టు కుదిరాయి. ముఖంపై అమర్చిన ఒక చిన్న రత్నం .. గ్లోసీ లిప్స్ మరింత మోడ్ర‌న్ లుక్‌ని ఇచ్చాయి. అదే సమయంలో నలుపు రంగు డ్రెస్‌కు భిన్నంగా కార్డి బి ధరించిన పింక్ కలర్ ప్లాట్‌ఫామ్ బూట్లు అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఇలాంటి సాహసోపేతమైన ప్రయోగాలు ఫ్యాషన్ ప్రపంచంలో చర్చలకు దారితీసినా.. మెట్ గాలా అంటేనే నిబంధనలను బ్రేక్ చేయడం అని కార్డి బి మరోసారి నిరూపించారు. ప్ర‌స్తుతం ఈ వింతైన లుక్ ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా షేర్ అవుతోంది. కార్డి బి అమెరిక‌న్ ర్యాప‌ర్. ప్ర‌పంచంలోనే అత్యంత భారీ ఫాలోయింగ్ ఉన్న‌ ప్ర‌తిభావ‌నిగా గుర్తింపు తెచ్చుకున్నారు.