బ్రెజిల్ సీరియల్‌లో బాలీవుడ్ హంగామా
బాలీవుడ్ సంగీతానికి ఉన్న క్రేజ్ ఎంతో ప్రత్యేకమైంది. భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లోనూ బాలీవుడ్ సంగీతం శ్రోతల్ని అలరిస్తుంది.
By: Srikanth Kontham | 19 April 2026 9:45 AM ISTబాలీవుడ్ సంగీతానికి ఉన్న క్రేజ్ ఎంతో ప్రత్యేకమైంది. భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లోనూ బాలీవుడ్ సంగీతం శ్రోతల్ని అలరిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగానూ హిందీ సినిమా సంగీతానిది ప్రత్యేకమైన స్థానం. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఓ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. 2009లో బ్రెజిల్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన `కామినో దాస్ ఇండియస్` అనే టెలివిజన్ సిరీస్, బాలీవుడ్ ఐకానిక్ సాంగ్స్‌ను డ్యాన్స్ స్టైల్‌ను అద్భుతంగా రీక్రియేట్ చేసింది. బ్రెజిలియన్ నటీనటులు అచ్చం దేశీ శైలిలో స్టెప్పులు వేయడం చూసి భారతీయులు ఫిదా అవుతున్నారు.
ఈ బ్రెజిలియన్ సీరియల్‌లో బాలీవుడ్ సూపర్ హిట్ సాంగ్ `కజరారే`ను చాలా గ్రాండ్‌గా చిత్రీకరించారు. ఒరిజినల్ పాటలో ఐశ్వర్య రాయ్ ప్రదర్శించిన హావభావాలు, డ్యాన్స్ మూమెంట్స్‌ను బ్రెజిలియన్ నటి అచ్చం అలాగే దించేసింది. పాట మాత్రమే కాదు. భారతీయ వివాహ వేడుకల్లో ఉండే రంగురంగుల దుస్తులు, సెట్టింగులు, ఆ డ్రామాను కూడా వారు ఎంతో అద్భుతంగా ప్రదర్శించారు. దీనికి సంబంధించిన క్లిప్స్ ఒకటి నెట్టింట ప్రత్యక్షమవ్వడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే? ఈ సీరియల్ ప్రారంభ థీమ్ సాంగ్‌గా `ఓంకార` సినిమాలోని `బీడీ జలైలే` పాటను వాడుకున్నారు.
సునిధి చౌహాన్ స్వరంతో సాగే ఈ మాస్ పాట బ్యాక్‌గ్రౌండ్‌లో వస్తుంటే? టైటిల్స్ పడటం చూస్తుంటే బాలీవుడ్ సినిమాల ప్రభావం దక్షిణ అమెరికా దేశాలపై ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. `నాగడ నాగడ`, `సలామ్-యే-ఇష్క్` వంటి ఇతర పాపులర్ సాంగ్స్ కూడా కథా గమనంలో సందర్భోచితంగా వినిపిస్తాయి. ఈ సీరియల్ నేపథ్యం కూడా పూర్తిగా భారతీయ సంస్కృతికి దగ్గరగా ఉంటుంది. రాజస్థాన్‌లోని జైపూర్ నగరంలో జరిగే ఒక కులాంతర ప్రేమకథ చుట్టూ ఈ సిరీస్ తిరుగుతుంది. ఉన్నత వర్గానికి చెందిన మాయ అనే యువతికి, దళిత వర్గానికి చెందిన యువకుడికి మధ్య జరిగే సంఘర్షణను ఇందులో చూపించారు.
భారతీయ సమాజంలోని కుల వ్యవస్థ, ఆచార వ్యవహారాలను బ్రెజిలియన్ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా మలిచి చూపించడంలో ఈ షో విజయం సాధించింది. నిర్మాణ విలువల విషయానికి వస్తే ఈ సిరీస్ కోసం బ్రెజిలియన్ ప్రొడక్షన్ టీమ్ భారీగా ఖర్చు చేసింది. జైపూర్ , ఆగ్రా వంటి నగరాల్లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో భారీ సెట్లను నిర్మించి భారతీయ వీధులను తలపించేలా చేశారు. ఫలితంగా ఈ షో `ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డు`ను కూడా దక్కించుకుంది. `కామినో దాస్ ఇండియస్` ద్వారా బాలీవుడ్ సంగీతం, నృత్యం ఖండాతరాలను దాటి ప్రేక్షకులను అలరిస్తున్నాయి. భాషతో సంబంధం లేకుండా సంగీతం ఎలా బంధాలను పెంచుతుందో ? బ్రెజిలియన్ సీరియల్ నిరూపించింది. భారతీయ అభిమానులు ఈ వీడియోలను చూస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విదేశాల్లో దేశీ పాటలకు ఉన్న గ్లోబల్ రీచ్ ఈ వీడియోతో మరోసారి ప్రూవ్ అయింది.
