కార్మికుల సమ్మె పై ప్రముఖ నిర్మాత ఫైర్
తెలుగు చిత్రసీమ కార్మికుల సమ్మె సైరన్‌తో షూటింగులు స్థంభించిపోవడం చర్చనీయాంశంగా మారింది.
By: Sivaji Kontham | 4 Aug 2025 9:43 AM ISTతెలుగు చిత్రసీమ కార్మికుల సమ్మె సైరన్‌తో షూటింగులు స్థంభించిపోవడం చర్చనీయాంశంగా మారింది. మునుపెన్నడూ లేనంతగా 24 శాఖల కార్మికుల తరపున ఫెడరేషన్ సమ్మెకు పిలుపునివ్వడం సంచలనంగా మారింది. ఫిలింఛాంబర్- నిర్మాతల మండలితో కొన్నేళ్లుగా మంతనాలు సాగుతున్నా 30శాతం భత్యం పెంపుపై సరైన స్పందన లేదని, నిర్మాతలు పూర్తిగా తిరస్కరించిన కారణంగానే తాము సమ్మెకు దిగుతున్నట్టు ఫెడరేషన్ ప్రతినిధులు ఈ ఆదివారం అధికారికంగా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసి దానిలో వెల్లడించారు.
అందరికీ ఇది ఇబ్బందే:
ఈ సమ్మె కారణంగా డైలీ వేజెస్ పై జీవించే చోటా మోటా కార్మికుల జీవితాలు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయని, ఇక ఉపేక్షించలేమని ఫెడరేషన్ మాజీ కార్యదర్శి జగదీశ్ రెడ్డి ప్రముఖ మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. సమ్మె కారణంగా తెలుగు చిత్రసీమలో పెద్ద సినిమాల ప్రణాళికలు తీవ్ర ఇబ్బందుల్లో పడనున్నాయి. పలువురు తెలుగు చిత్రసీమ అగ్ర కథానాయకుల సినిమాలతో పాటు, ఇరుగు పొరుగు భాషల నుంచి వచ్చి ఇక్కడ షూటింగులు చేస్తున్న నిర్మాణ సంస్థలకు సమ్మె చాలా ఇబ్బందికర పరిస్థితుల్ని తేనుంది.
పరిశ్రమ నష్టాల్లో ఉంది:
అయితే ఇలాంటి మెరుపు సమ్మె సరికాదని, పరిశ్రమ కష్టాల్లో ఉన్నప్పుడు ఇలా చేయడం ధర్మం కాదని ఫైరయ్యారు ప్రముఖ టాలీవుడ్ నిర్మాత సి.కళ్యాణ్. సడెన్ గా ఇలా సమ్మెలు చేయడం అన్యాయం. దీని కారణంగా చాలా షూటింగులు ఆగిపోతాయి. సినీపరిశ్రమ పెరిగిన బడ్జెట్లతో చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నాయి. జనం థియేటర్లకు రాకపోవడంతో ఎగ్జిబిటర్లు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కార్మికులు సమ్మె చేయడం సరైన నిర్ణయం కాదని ఆగ్రహించారు. సినీపెద్దలతో కూచుని మాట్లాడుకోండి.. సమస్యను పరిష్కరించుకోండి... మరోసారి ప్రయత్నించండి! అని ఫెడరేషన్ ప్రతినిధులకు సూచించారు.
మూడేళ్ల కోసారి సవరించాలని రూల్:
ఒక్కో సినిమా సెట్లో వంద నుంచి 200 మంది కార్మికులు పని చేస్తుంటారు. ప్రస్తుతం వీరికి రూ.1400 రోజువారీ భత్యం అందుతోంది. అయితే హైదరాబాద్ లాంటి మెట్రో నగరంలో పెరిగిన ఖర్చుల దృష్ట్యా భత్యం పెంచాలని, మూడేళ్ల కోసారి నిర్మాతలు భత్యాన్ని సవరించాల్సి ఉన్నా అలా జరగడం లేదని కార్మిక ఫెడరేషన్ చెబుతోంది.
