ఆర్య సినిమాలో బన్నీ వాసు.. భార్య రియాక్షన్ అదుర్స్!
అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా 90స్ బయోపిక్ ఫేమ్ మౌళి హీరోగా వచ్చిన చిత్రం 'లిటిల్ హార్ట్స్' . ఈవెంట్ లో భాగంగా నిర్మాత బన్నీ వాసుకి సంబంధించిన ఒక వీడియో క్లిప్పింగ్ ను ప్రదర్శించారు.
By: Madhu Reddy | 4 Sept 2025 6:23 PM ISTసినిమా షూటింగ్ సజావుగా సాగాలి అంటే 24 విభాగాలు కరెక్ట్ గా పని చేయడమే కాకుండా నటీనటులు కూడా సకాలంలో ఆ షూటింగ్ సెట్లో ఉండాల్సిందే. కానీ అనుకోని కారణాలవల్ల వారు లేకపోతే చిత్ర బృందంలోని కొంతమంది ఆ స్థానాన్ని రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. అయితే అనుకోని సందర్భాలలో ఆర్టిస్టులు రాకపోయేసరికి.. తాను నటించి చివరికి తన భార్య చేత చివాట్లు పడ్డాను అంటూ ఒక నిర్మాత చెప్పుకొచ్చారు. మరి ఆ నిర్మాత ఎవరు? ఆయన ఏ సినిమాలో నటించారు? ఆయన భార్య ఆయనను ఎందుకు తిట్టింది? ఇలా అన్ని విషయాలపై ఆయనే క్లారిటీ ఇవ్వడం జరిగింది.
అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా 90స్ బయోపిక్ ఫేమ్ మౌళి హీరోగా వచ్చిన చిత్రం 'లిటిల్ హార్ట్స్' . ఈవెంట్ లో భాగంగా నిర్మాత బన్నీ వాసుకి సంబంధించిన ఒక వీడియో క్లిప్పింగ్ ను ప్రదర్శించారు. అది చూసిన నిర్మాత తనలో తానే నవ్వుకున్నారు. 20 ఏళ్ల క్రితం షూట్ చేసిన ఆ సన్నివేశం తాలూకు జ్ఞాపకాలను అందరితో పంచుకున్నారు. బన్నీ వాసు మాట్లాడుతూ.."సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన ఆర్య సినిమా అది. ఆరోజు చివరి రోజు షూటింగు. ముగ్గురు క్యారెక్టర్ ఆర్టిస్టులు ఆరోజు రాలేదు. దాంతో దిల్ రాజు ఆఫీస్ క్యాషియర్ శ్రీధర్, వకీల్ సాబ్ దర్శకుడు శ్రీరామ్ వేణు, నేను ముగ్గురం నటించాము. సుకుమార్ చేసిన ఆలోచన అది. మీరు ముగ్గురు వేస్ట్ గా పడున్నారు కదా ముందుకు రండి అని మాపై ఆ సన్నివేశం చిత్రీకరించారు.
సినిమా విడుదలయ్యాక ఈ సినిమా చూసి మా ఆవిడ నన్ను చాలా తిట్టింది. అప్పటినుంచి ఇక ఎక్కడా కూడా నేను కనిపించలేదు. మొన్న మధ్య మిత్రమండలి సినిమా కోసం కూడా నాతో ఏదో రీల్ చేయించారు అది చూశాక కచ్చితంగా నేనే ట్రోల్ అవుతానని అనిపించి, ఆ రీల్ బయటకు వెళ్లకుండా చేశాను" అంటూ బన్నీ వాసు చెప్పుకొచ్చారు. మొత్తానికైతే ఆర్య సినిమాలో కనిపించి తన భార్య చేత చివాట్లు పడ్డానని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు నిర్మాత బన్నీ వాసు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
బన్నీ వాసు విషయానికి వస్తే.. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన వ్యక్తి ఈయన. సినిమాల మీద ఆసక్తితోనే హైదరాబాద్ కి వచ్చిన బన్నీ వాసు.. ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా అల్లు అర్జున్ కి స్నేహితుడిగా మారి.. గీత ఆర్ట్స్ బ్యానర్లో చేరారు. ఇక అప్పటినుంచి గీత ఆర్ట్స్2 లో సినిమాలు నిర్మిస్తూ.. పార్ట్నర్ అయ్యే స్థాయికి ఎదిగారు. ఈ మధ్య తన స్నేహితులతో కలిసి బీవీ వర్క్స్ పేరిట ఒక కొత్త బ్యానర్ కూడా ప్రారంభించి.. మిత్రమండలి సినిమా కూడా నిర్మిస్తున్నారు. అలాగే ప్రస్తుతం పలు చిత్రాల ఈవెంట్లకు హాజరవుతూ అందులో కొన్ని విషయాలను పంచుకుంటున్నారు బన్నీ వాసు.
