Begin typing your search above and press return to search.

రూ.100 టికెట్లో నిర్మాతకు వెళ్లేది ఎంత?.. బన్నీ వాసు ఏం చెప్పారంటే?

సినిమా టికెట్ రేట్ల వ్యవహారం ఎప్పుడూ సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశమే. ఎందుకంటే బడా మూవీ రిలీజ్ అయితే చాలు.. కచ్చితంగా టికెట్ రేట్లు పెరుగుతాయి.

By:  M Prashanth   |   4 Dec 2025 11:36 PM IST
రూ.100 టికెట్లో నిర్మాతకు వెళ్లేది ఎంత?.. బన్నీ వాసు ఏం చెప్పారంటే?
X

సినిమా టికెట్ రేట్ల వ్యవహారం ఎప్పుడూ సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశమే. ఎందుకంటే బడా మూవీ రిలీజ్ అయితే చాలు.. కచ్చితంగా టికెట్ రేట్లు పెరుగుతాయి. అది కొన్నేళ్లుగా ఒక ఆనవాయితీగా వస్తోంది. ప్రభుత్వాల అనుమతులతో ధరలను పెంచుతున్నారు నిర్మాతలు. ప్రీమియర్స్ షోస్ కు అయితే ఏకంగా డబుల్ రేట్లకు అమ్మేందుకు జీవోలు అందుకుంటున్నారు.

దీంతో నిర్మాతలకు పెద్ద ఎత్తున డబ్బులు వెళ్తున్నాయని.. భారీ లాభాలు అందుకుంటున్నారని ఎప్పటి నుంచో విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు ఆ విషయంపై ప్రముఖ నిర్మాత బన్నీ వాసు మాట్లాడారు. హారర్ మూవీ ఈషా గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుతూ.. పలు వ్యాఖ్యలు చేశారు. అవి ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.

ఏ మూవీ టికెట్ ధరలో అయినా అన్నీ పోనూ ప్రొడ్యూసర్ కు 28 శాతం మాత్రమే వస్తుందని తెలిపారు. మనమంతా ఒక ఫ్యామిలీ అని మీడియా ప్రతినిధులతో ఆయన అన్నారు. ఆ విషయాన్ని కచ్చితంగాా జనాల్లోకి తీసుకెళ్లాలని కోరారు. అందరూ సినిమా రిలేటెడ్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆ విషయాన్ని చెబుతున్నట్లు తెలిపారు.

మొన్న అందరూ కలిసి చాలా క్లియర్ గా లెక్కలు వేశామని, అప్పుడు ప్రొడ్యూసర్ కేవలం 28 శాతం కన్నా తక్కువే ఇంటికి తీసుకెళ్తాడని క్లారిటీ వచ్చిందని అన్నారు. అంటే ఒక టికెట్ ధర రూ.100 అయితే.. తమకు వచ్చేది రూ.28 మాత్రమే అని చెప్పారు. అన్నీ పోనూ ప్రొడ్యూసర్ ఇంటికి తీసుకెళ్లేది అదేనని బన్నీ వాసు స్పష్టం చేశారు.

అయితే సినిమాపై మిగిలిన దానిలో 35-40 శాతం ఇన్ కమ్ ట్యాక్స్ కడుతున్నామని తెలిపారు. టికెట్ రేట్ రూ.600 కావొచ్చు.. రూ.800 కావొచ్చు.. కానీ ఆ మొత్తం ప్రొడ్యూసర్ కే వచ్చేస్తుందని జనాలు అనుకుంటున్నారని చెప్పారు. రూ.600 తినేస్తున్నారని అనుకుంటున్నారని అన్నారు. కానీ రియాలిటీని మీడియా అయినా చెప్పాలని కోరారు.

టికెట్ రేట్ లో ఎవరికి ఎంత వెళ్తుందో చెప్పాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఆ విషయాన్ని విశ్లేషణాత్మకంగా రాస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇటీవల నిర్మాత ఎస్ కే ఎన్ కూడా టికెట్ రేట్ పై ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. మల్టీప్లెక్స్ లో పాప్‌ కార్న్‌, సమోస, కూల్‌ డ్రింక్స్‌, థియేటర్‌ యాడ్స్‌ తో నిర్మాతకు సంబంధం ఉండదని అన్నారు. ఒక ఫ్యామిలీ దాదాపు రూ.2200 ఖర్చు పెట్టి సినిమా చూస్తే.. అందులో 17 శాతం మాత్రమే ప్రొడ్యూసర్‌ కు దక్కుతుందని చెప్పారు.