ఇన్ని తెలుగు సినిమాల మధ్య డబ్బింగ్ సినిమా ఏంటి?
అప్పుడప్పుడూ బాక్సాఫీస్ కొత్త సినిమాలు లేక వెలవెలబోతుంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో బాక్సాఫీస్ మీదికి ఒకేసారి చాలా సినిమాలు వచ్చి పడిపోతుంటాయి.
By: Garuda Media | 23 Dec 2025 11:07 AM ISTఅప్పుడప్పుడూ బాక్సాఫీస్ కొత్త సినిమాలు లేక వెలవెలబోతుంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో బాక్సాఫీస్ మీదికి ఒకేసారి చాలా సినిమాలు వచ్చి పడిపోతుంటాయి. క్రిస్మస్ వీకెండ్లో అతివృష్టే చూడబోతున్నాం. అరడజనుకు పైగా సినిమాలు బరిలో నిలిచాయి ఈ వీకెండ్లో. అందులో తెలుగు సినిమాలే అయిదు ఉన్నాయి. అవే.. ఛాంపియన్, శంబాల, దండోరా, పతంగ్, బ్యాడ్ గర్ల్స్. డబ్బింగ్ మూవీస్ ఇంకో రెండు ఉన్నాయి. వాటిలో కిచ్చా సుదీప్ సినిమా మార్క్ మీద పెద్దగా అంచనాలు లేవు. కానీ మోహన్ లాల్ సినిమా వృషభ ప్రామిసింగ్‌గా కనిపిస్తోంది. పైగా అది భారీ చిత్రం. దాన్ని తెలుగులో గీతా ఆర్ట్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థ తన చేతుల మీదుగా రిలీజ్ చేస్తోంది. ఐతే తెలుగులో క్రిస్మస్‌కు ఇన్ని సినిమాలు పోటీలో ఉండగా.. గీతా సంస్థ ఇలా ఓ మలయాళ సినిమాను తెలుగులోకి తీసుకురావడం మీద కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇదే విషయమై గీతా ఆర్ట్స్- 2 సంస్థను నడిపించే బన్నీ వాసును ప్రశ్నించారు విలేకరులు అందుకాయన సమాధానం చెప్పారు. వృషభ రెండు నెలల ముందే రావాల్సిన సినిమా అని.. అప్పుడు బాక్సాఫీస్ దగ్గర ఖాళీ కూడా ఉందని.. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడం వల్ల ఈ చిత్రాన్ని వాయిదా వేశారని బన్నీ వాసు తెలిపారు. గీతా సంస్థ తెలుగులో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేలా ముందుగానే కమిట్మెంట్ ఉండడంతో మేకర్స్ ఎప్పుడు రిలీజ్ అంటే అప్పుడు విడుదల చేయక తప్పలేదని బన్నీ వాసు తెలిపారు.
వృషభ మలయాళంతో పాటు వేర్వేరు భాషల్లో రిలీజవుతోందని.. కాబట్టి వాటితో పాటే తెలుగులోనూ రిలీజ్ చేయక తప్పడం లేదన్నారు. అల్లు అర్జున్‌కు మలయాళంలో మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే అని, తన సినిమాలను అక్కడ బాగా రిసీవ్ చేసుకుంటారని.. అలాంటపుడు ఓ మలయాళ సినిమాను గీతా సంస్థలో రిలీజ్ చేస్తున్నపుడు వారికి అన్ని విధాలా సహకరించాల్సి ఉంటుందని.. అంతే తప్ప తెలుగు సినిమాలకు వ్యతిరేకంగా వెళ్లడం లాంటిదేమీ లేదని బన్నీ వాసు స్పష్టం చేశాడు.
