పోస్టర్ల వెనుక అసలు లెక్కలు.. బన్నీ వాస్ చెప్పిన 'డాలర్' సీక్రెట్!
ఈ మధ్య కాలంలో సినిమా రిలీజ్ అయిన రెండో రోజే వంద కోట్ల పోస్టర్లు పడటం మనం చూస్తూనే ఉన్నాం.
By: M Prashanth | 2 Jan 2026 12:39 PM ISTఈ మధ్య కాలంలో సినిమా రిలీజ్ అయిన రెండో రోజే వంద కోట్ల పోస్టర్లు పడటం మనం చూస్తూనే ఉన్నాం. అసలు ఆ కలెక్షన్స్ నిజమా కాదా అని సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే జరుగుతుంటుంది. గత ఏడాది నాగ చైతన్య 'తండేల్' సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది. 100 కోట్ల పోస్టర్ వేయగానే చాలా మంది నెటిజన్లు డౌట్స్ రైజ్ చేశారు. దీనిపై నిర్మాత బన్నీ వాస్ ఒక ఇంటర్వ్యూలో స్పందిస్తూ చాలా ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టారు.
అసలు ఈ నంబర్ గేమ్ గురించి బన్నీ వాస్ ఏమన్నారంటే, తన వరకు 'తండేల్' ఒక బ్లాక్ బస్టర్ సినిమా అని క్లారిటీ ఇచ్చారు. బయట జనాలు దీన్ని సూపర్ హిట్ అనుకోవచ్చు, కానీ పెట్టిన బడ్జెట్ కి, వచ్చిన రిటర్న్స్ కి తనకు మాత్రం అది బ్లాక్ బస్టర్ రేంజ్ సక్సెస్ అని చెప్పారు. ఎక్కువ ఖర్చు పెట్టినా, దాన్ని తిరిగి రాబట్టడం కూడా ఒక మ్యాజిక్ అని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇక అందరికీ ఉన్న డౌట్ ఆ 100 కోట్ల ఫిగర్ ఎలా వచ్చిందనేది. దీనికి ఆయన ఒక లెక్క చెప్పారు. ఇండియాలో ఈ సినిమా దాదాపు 70 నుంచి 72 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసిందట. మిగిలిన మొత్తం ఓవర్సీస్ నుంచి, ఇతర దేశాల నుంచి వచ్చిన కలెక్షన్స్ అని వివరించారు. సాధారణ ప్రేక్షకులు కేవలం ఇక్కడి గ్రాస్ మాత్రమే చూస్తారు కానీ, నిర్మాతలు మాత్రం వరల్డ్ వైడ్ గ్రాస్ ని లెక్కలోకి తీసుకుంటారని అసలు లాజిక్ చెప్పారు.
ఇక్కడే ఆయన డాలర్ రేట్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పారు. ఒకప్పుడు డాలర్ విలువ తక్కువ ఉండేది కాబట్టి 100 కోట్లు కొట్టడం కష్టంగా ఉండేది. ఇప్పుడు డాలర్ రేటు దాదాపు 90 రూపాయల దగ్గర ఉంది కాబట్టి, ఓవర్సీస్ లో సినిమా కొంచెం బాగా ఆడినా 100 కోట్ల గ్రాస్ మార్క్ ని టచ్ చేయడం చాలా ఈజీ అయిపోయిందని అన్నారు. చైనా లాంటి దేశాల్లో వచ్చే రెవెన్యూని కూడా కలుపుకుంటే ఈ నంబర్స్ సాధ్యమే అని అన్నారు.
అయితే ఈ నంబర్స్ అన్నీ పక్కాగా నిజమేనా అంటే బన్నీ వాస్ ఒక ఓపెన్ సీక్రెట్ ని బయటపెట్టేశారు. ఏ ప్రొడ్యూసర్ అయినా సరే వచ్చిన కలెక్షన్స్ కి ఒక 5 నుంచి 10 శాతం వరకు కలిపి వేయడం కామన్ అని తేల్చేశారు. ఇది ఇండస్ట్రీలో అందరూ చేసేదే అని, అదొక ఎన్హ్యాన్స్మెంట్ అని నిజాయితీగా ఒప్పేసుకున్నారు. సినిమా మీద హైప్ క్రియేట్ చేయడానికి ఇలాంటివి తప్పవని ఆయన మాటల్లో అర్థమవుతోంది.
