Begin typing your search above and press return to search.

ఇండస్ట్రీలో కుట్రలు.. తొక్కాలని చూడడం తప్పు: బన్నీ వాస్

తాను అలా మాట్లాడిన తర్వాత చాలా మంది ఇండస్ట్రీ పెద్దలు ఫోన్ చేసి అభినందించారని కూడా తెలిపారు. ​ఈ నెగెటివ్ ప్రచారాల వెనుక తోటి నిర్మాతలే ఉండటం అత్యంత దారుణమని బన్నీ వాస్ అన్నారు.

By:  M Prashanth   |   15 Oct 2025 8:12 PM IST
ఇండస్ట్రీలో కుట్రలు.. తొక్కాలని చూడడం తప్పు: బన్నీ వాస్
X

​టాలీవుడ్‌లో నెగెటివ్ పబ్లిసిటీ, ఫేక్ రేటింగ్స్ అనేవి ఎప్పటినుంచో ఉన్న సమస్యలే అయినా, వాటిపై చాలా అరుదుగా మాత్రమే నిర్మాతలు పెదవి విప్పుతారు. కానీ, ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ మాత్రం తన లేటెస్ట్ చిత్రం ‘మిత్ర మండలి’ విషయంలో జరుగుతున్న కుట్రలపై గట్టిగా గళం విప్పారు. ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశమయ్యాయి.

మిత్ర మండలి’ మూవీలో ప్రియదర్శి, నిహారిక ఎన్ ఎం హీరో హీరోయిన్లుగా నటించగా బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, సత్య, విష్ణు ఓయి, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా, విటివి గణేష్ ముఖ్య పాత్రలు పోషించారు. ఇక సినిమాను అక్టోబర్ 16న విడుదల చేస్తుండగా ఒక రోజు ముందుగానే ప్రీమియర్స్ తో మేకర్స్ ఆడియన్స్ ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో బన్నివాసు పలు విషయాలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

కేవలం తన సినిమా ప్రమోషన్ కే పరిమితం కాకుండా, ఇండస్ట్రీలోని కొన్ని చీకటి కోణాలను ఆయన బయటపెట్టారు.​‘మిత్ర మండలి’ సినిమా మీద కొందరు కావాలనే నెగెటివ్ క్యాంపెయిన్ చేస్తున్నారని బన్నీ వాస్ ఆరోపించారు. "మా టీమ్‌లోని ఎంతో మంది రాత్రింబవళ్లు నిద్ర లేకుండా కష్టపడి పని చేస్తుంటే, కొంతమంది ఉద్దేశపూర్వకంగా సినిమాపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ కుట్రలు ఎవరు చేస్తున్నారో ఇండస్ట్రీలో అందరికీ తెలుసు, కానీ ఎవరూ మాట్లాడరు. అందుకే నేను ఎమోషనల్ అయి గట్టిగా మాట్లాడాల్సి వచ్చింది" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

తాను అలా మాట్లాడిన తర్వాత చాలా మంది ఇండస్ట్రీ పెద్దలు ఫోన్ చేసి అభినందించారని కూడా తెలిపారు. ​ఈ నెగెటివ్ ప్రచారాల వెనుక తోటి నిర్మాతలే ఉండటం అత్యంత దారుణమని బన్నీ వాస్ అన్నారు. "బయటి వ్యక్తులు కొందరు మన నిర్మాతలను కలిసి, నెగెటివ్ క్యాంపెయిన్‌లకు ఆర్థికంగా సపోర్ట్ చేయమని అడుగుతున్నారని తెలిసింది. కొందరు నిర్మాతలు తెలిసి లేదా తెలియక దీనికి మద్దతు ఇస్తున్నారు. ఇది రాజకీయాల్లో మామూలేమో కానీ, ఇండస్ట్రీలో ఒక సినిమాను తొక్కేసి మరో సినిమాను పైకి లేపాలని చూడటం మూర్ఖత్వం, చాలా తప్పు. మంచి సినిమా ఎప్పుడూ ఆడుతుంది" అని ఆయన హితవు పలికారు.

తాను మాత్రం మిగిలిన సినిమాలకు కూడా తన చేతిలో ఉన్న థియేటర్లలో సమానంగా షోలు ఇచ్చానని, కొన్నింటికి తన సినిమా కంటే ఎక్కువ షోలో ఇచ్చినట్లు తెలిపారు. అన్ని చిత్రాలు ఆడాలన్నదే తన సిద్ధాంతమని స్పష్టం చేశారు. ఇక ​ఆన్‌లైన్ రేటింగ్స్‌లో జరుగుతున్న మోసాలపైనా బన్నీ వాస్ తీవ్రంగా స్పందించారు.

"బుక్ మై షో లాంటి టికెటింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో కూడా ఫేక్ రేటింగ్స్, లైక్స్ ఇష్టమొచ్చినట్టు వేస్తున్నారు. టికెట్ కొన్నారా లేదా అనే బేసిక్ సమాచారం కూడా లేకుండా రేటింగ్ ఎలా ఇస్తారు? మంచి సినిమాకు చెడ్డ రేటింగ్ ఇచ్చి ప్రేక్షకులను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ అంశంపై ఇప్పటికే ఫిల్మ్ ఛాంబర్‌లో చర్చించాం" అని తెలిపారు. బడ్జెట్ పెరిగినా, ఎన్ని కష్టాలు ఎదురైనా సినిమాను పూర్తి చేశామని, ‘మిత్ర మండలి’ కచ్చితంగా లాభాలు తెచ్చిపెడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.