బుచ్చి నెక్స్ట్ ప్లాన్ ఏంటి? అలా జరిగే ఛాన్స్ ఉందా?
డైరెక్టర్ బుచ్చిబాబు సనా ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్‌గా మారారు. ఆయన తెరకెక్కించిన పెద్ది సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్ అందుకోవడంతో ఇప్పుడు అందరి దృష్టి ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై పడింది.
By: M Prashanth | 8 Jun 2026 6:28 PM ISTడైరెక్టర్ బుచ్చిబాబు సనా ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్‌గా మారారు. ఆయన తెరకెక్కించిన పెద్ది సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్ అందుకోవడంతో ఇప్పుడు అందరి దృష్టి ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై పడింది. వరుసగా రెండు విజయాలు అందుకున్న బుచ్చిబాబు తన మూడో సినిమా ఎవరితో చేయబోతున్నారనే చర్చ జోరుగా సాగుతోంది.
సుకుమార్ శిష్యుడిగా సినీ జర్నీ ప్రారంభించిన బుచ్చిబాబు, తొలి సినిమాగా ఉప్పెనను తెరకెక్కించారు. వైష్ణవ్ తేజ్ హీరోగా వచ్చిన ఆ చిత్రం చిన్న సినిమాగా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. కొత్త స్టోరీ, ఎమోషన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఉప్పెన బుచ్చిబాబును దర్శకుడిగా ప్రత్యేకంగా నిలబెట్టింది. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న ఆయన, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో పెద్ది చేశారు.
భారీ అంచనాల మధ్య విడుదలైన ఆ మూవీ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. దీంతో బుచ్చిబాబు పేరు మరోసారి గట్టిగా వినిపిస్తోంది. ఆ సక్సెస్ తో ఇప్పుడు ఆయన తర్వాత స్టెప్ ఎలా ఉండబోతుందన్న ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో బుచ్చిబాబు సినిమా చేసే అవకాశాలపై గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి.
ఇటీవల పెద్ది ప్రమోషన్స్ లో ఆ విషయంపై ప్రశ్నించగా, ఆయన డైరెక్ట్ గా ఆన్సర్ చెప్పకుండా 'చర్చలు జరుగుతున్నాయి.. సమయం వచ్చినప్పుడు చెబుతా' అని అన్నారు. దీంతో మహేష్ తో సినిమా చేసే అవకాశాలను పూర్తిగా కొట్టిపారేయలేమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే మరోవైపు ఇంకో ఆసక్తికరమైన చర్చ కూడా నడుస్తోంది. బుచ్చిబాబు తన గురువు సుకుమార్ కెరీర్ ను ఫాలో అవుతారా అనే ప్రశ్న వినిపిస్తోంది.
సుకుమార్ తన తొలి చిత్రం ఆర్యను అల్లు అర్జున్ తో తెరకెక్కించారు. ఆ తర్వాత జగడం మూవీని రామ్ తో చేశారు. తర్వాత మళ్లీ ఆర్య 2తో అల్లు అర్జున్ వద్దకు వెళ్లి, ఆ తర్వాత 100% లవ్ ను నాగచైతన్యతో రూపొందించారు. అంటే స్టార్ హీరోలు, మీడియం రేంజ్ హీరోలు అనే తేడా లేకుండా కథకు సరిపోయే హీరోలతో సుకుమార్ సినిమాలు చేశారు. ఇప్పుడు బుచ్చిబాబు కూడా అదే ప్లాన్ ఎంచుకుంటారా? లేక పెద్ది తర్వాత మరో స్టార్ హీరోతో సినిమా చేస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.
అదే సమయంలో మరో అంశం కూడా చర్చకు వస్తోంది. పెద్ది విడుదల తర్వాత హీరోయిన్ రోల్ క్యారెక్టరైజేషన్ విషయంలో బుచ్చిబాబు కొన్ని విమర్శలు ఎదుర్కొన్నారు. పలు సన్నివేశాలపై వచ్చిన అభిప్రాయాల నేపథ్యంలో మార్పులు కూడా చేస్తామని ఆయన చెప్పారు. ఆసక్తికరంగా, సుకుమార్ కూడా తన రెండో చిత్రం జగడం సమయంలో హీరోయిన్ పాత్ర విషయంలో విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే ఇది పూర్తిగా యాదృచ్ఛికమే!
ఏదేమైనా ఇప్పుడు మాత్రం బుచ్చిబాబు తర్వాత సినిమా ఎవరితో ఉంటుందన్నదే ప్రధాన ప్రశ్నగా మారింది. మహేష్ బాబు వంటి స్టార్ హీరోతో సినిమా అనౌన్స్ చేస్తారా? లేక మరో కొత్త కాంబోను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారా? అన్నది అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ప్రస్తుతం మాత్రం చర్చలన్నీ ఆయన నెక్స్ట్ స్టెప్ చుట్టూనే తిరుగుతున్నాయి.
