'ఉస్తాద్ భగత్‌సింగ్' ఈవెంట్‌లో అరుదైన దృశ్యం!
టాలీవుడ్ టాప్ డైరెక్టర్లు కొంత మంది శిష్యులని తయారు చేసి ఇండస్ట్రీకి ఇచ్చారు. వారు స్టార్లతో ఎన్నో అద్భుతమైన బ్లాక్ బస్టర్లు అందించారు.
By: Ravindar Gorantla | 16 March 2026 7:47 PM ISTటాలీవుడ్ టాప్ డైరెక్టర్లు కొంత మంది శిష్యులని తయారు చేసి ఇండస్ట్రీకి ఇచ్చారు. వారు స్టార్లతో ఎన్నో అద్భుతమైన బ్లాక్ బస్టర్లు అందించారు. ఇండస్ట్రీ హిట్లని తమ ఖాతాలో వేసుకున్నారు. ప్రముఖ సీనియర్ డైరెక్టర్ల తరహాలోనే టాప్ డైరెక్టర్ సుకుమార్ తన శిష్యులని ఇండస్ట్రీకి అందిస్తున్నారు. సుకుమార్ వద్ద దర్శకత్వ శాఖలో పని చేసిన ఐదుగురు దర్శకులుగా మంచి పేరు తెచ్చుకుంటున్న విషయం తెలిసిందే. అయితే అందులో బుచ్చిబాబు సానకున్న ప్రత్యేకత వేరు. మిగతా వారు సుకుమార్ డైరెక్టర్ అయ్యాక ఆయన వద్ద శిష్యరికం చేస్తే బుచ్చిబాబు మాత్రం ఆయన స్టూడెంట్.
సుకుమార్ సినిమాల్లోకి రావడానికి ముందు మ్యాథ్స్ లెక్చరర్‌గా వర్క్ చేశారు. ఆ టైమ్‌లో డైరెక్టర్ బుచ్చిబాబు సాన ఆయన వద్ద శిష్యుడిగా చేరి పాఠాలు నేర్చుకున్నారు. అప్పటి నుంచి వీరిద్దరిది విడదీయరాని బంధం. అదే అనుబంధంబుచ్చిబాబుని ఇండస్ట్రీలోకి ప్రవేశించేలా చేసింది. ఆయన వద్ద దర్శకత్వ శాఖలో శిష్యుడిగా చేరేలా చేసింది. ఆర్య 2 నుంచి రంగస్థలం వరకు ఆయన వద్ద బుచ్చిబాబు దర్శకత్వ శాఖలో పని చేయడమే కాకుండా `రంగస్థలం` సినిమాకు సంబంధించిన కొన్ని ఐడియాలు ఇచ్చాడని స్వయంగా సుకుమార్ స్టేజ్‌పైనే చెప్పడం విశేషం.
`ఉప్పెన`తో డైరెక్టర్‌గా పరిచయమై తొలి మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్‌ని సొంతం చేసుకోవడమే కాకుండా గురువుకు తగ్గ శిష్యుడు అనిపించుకున్నాడు. బుచ్చిబాబు శిష్యుడిగా చేరిన దగ్గరి నుంచి గురువు సుకుమార్ ఆయనపై ప్రత్యేకమైన అభిమానం చూపించే వారట. అదే కృతజ్ఞతని బుచ్చిబాబు కూడా చూపించడంమొదలు పెట్టాడు. ఇప్పుడు అదే అభిమానాన్ని, గౌరవాన్ని స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్‌పై చూపించడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. `ఉస్తాద్ భగత్‌సింగ్` ఈవెంట్‌లో ఈ అరుదైన దృశ్యం కనిపించింది.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటించిన `ఉస్తాద్ భగత్‌సింగ్` మార్చి 19న భారీ స్థాయిలో రిలీజ్‌కు రెడీ అవుతున్న విషయం తెలిసిందే. `గబ్బర్‌సింగ్` తరువాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు భారీగానే ఉన్నాయి. సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మూవీ టీమ్ ఆదివారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని ఏర్పాటు చేసింది. యూసఫ్ గూడ్ పోలీస్ గ్రౌండ్స్‌లో జరిగిన ఈ ఈవెంట్‌కు భారీ స్థాయిలో పవన్ కల్యాణ్ అభిమానులు హాజరయ్యారు.
టీమ్‌తో పాటు ఈ కార్యక్రమంలో `పెద్ది` దర్శకుడు బుచ్చిబాబు కూడా హాజరయ్యాడు. ఈ సందర్భంగా తన గురువు సుకుమార్ తరువాత హరీశ్ శంకర్‌ని కూడా అలాగే భావిస్తానన్నాడు. ఈవెంట్‌కి రాగానే దర్శకుడు హరీశ్ శంకర్ కాళ్లకు నమస్కరించే ప్రయత్నం చేశాడు. ఇది గమనించిన హరీశ్ శంకర్ వద్దని వారిస్తూ వెనక్కి జరిగి బుచ్చిబాబుని ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని నుదుటిపై ముద్దు పెట్టి తన ప్రేమని వ్యక్తం చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. స్టార్ డైరెక్టర్ హరీశ్ శంకర్ అంటే `పెద్ది` డైరెక్టర్ బుచ్చిబాబుకు ఇంత గౌరమా? అని అంతా ఆశ్చర్యపోతున్నారు. వీరిద్దరి మధ్య అనుబంధం చూసి ముచ్చటపడుతున్నారు.
