ఈ కసి ఏంటి బుచ్చి? తిండీ తిప్పలూ మానేసి మరీ..
రెండో సినిమా చేస్తే స్టార్ హీరోతోనే చేయాలని పట్టుబట్టి మరీ కూర్చున్నారు.
By: Sravani Lakshmi Srungarapu | 18 Oct 2025 11:00 PM ISTసినీ ఇండస్ట్రీలో కొందరు దీపం ఉన్నప్పుడే ఇంటిని చక్కబెట్టుకోవాలనే నానుడిని మనసులో పెట్టుకుని అవకాశమున్నప్పుడే వరుస సినిమాలను చేసి కెరీర్లో దూసుకెళ్లాలని చూస్తే, మరికొందరు మాత్రం ప్రతీ ఎంపిక విషయంలోనూ చాలా జాగ్రత్తగా, ఆచితూచి అడుగులేసి కెరీర్ ను బాగా బిల్డ్ చేసుకుని ఎక్కువ కాలం పాటూ ఇండస్ట్రీలో ఉండటానికి ప్రయత్నిస్తారు.
సుకుమార్ దగ్గర శిష్యరికం చేసిన బుచ్చిబాబు
అలాంటి వారిలో డైరెక్టర్ బుచ్చిబాబు సాన కూడా ఒకరు. ఉప్పెన సినిమాతో తెలుగు సినిమాకు పరిచయమైన బుచ్చిబాబు మొదటి సినిమాతోనే డైరెక్టర్ గా ఎంతో పేరు తెచ్చుకున్నారు. సుకుమార్ దగ్గర శిష్యరికం చేసిన బుచ్చిబాబు, గురువు దారిలానే కెరీర్లో నెక్ట్స్ స్టేజ్ కు వెళ్లాలనుకున్నారు. అందుకే ఉప్పెన తర్వాత ఎన్ని ఆఫర్లు వచ్చినా తొందరపడి వెంటనే ఒప్పుకోలేదు.
స్టార్ హీరోతోనే చేయాలని..
రెండో సినిమా చేస్తే స్టార్ హీరోతోనే చేయాలని పట్టుబట్టి మరీ కూర్చున్నారు. ఉప్పెన తర్వాత బుచ్చిబాబు, ఎన్టీఆర్ హీరోగా సినిమా చేస్తారని అన్నారు. కానీ ఆ ప్రాజెక్టు పట్టాలెక్కకపోవడంతో, బుచ్చిబాబు తన పట్టుని ఏ మాత్రం వదలకుండా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కు కథ చెప్పి, సినిమాను ఓకే చేయించుకున్నారు. చరణ్ వేరే కమిట్‌మెంట్స్ తో బిజీగా ఉండటం వల్ల అవన్నీ అయిపోయేవరకు లేటైనా సరే వెయిట్ చేశారు తప్పించి తొందర పడలేదు.
పెద్ది విషయంలో కాంప్రమైజ్ అవని బుచ్చిబాబు
ఎట్టకేలకు చరణ్ కమిట్‌మెంట్స్ మొత్తం పూర్తయ్యాక పెద్ది అనే సినిమాను మొదలుపెట్టిన బుచ్చిబాబు సినిమా విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవడం లేదు. చరణ్ తో సినిమా అంటే ఆషామాషీగా ఉండకూడదని భావించిన బుచ్చిబాబు ఈ మూవీ కోసం హీరోయిన్ గా బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ను ఎంపిక చేయగా, మ్యూజిక్ కోసం ఏకంగా ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ను రంగంలోకి దింపారు.
వీటన్నింటి వల్ల పెద్దిపై మొదటి నుంచీ భారీ అంచనాలే ఉన్నాయి. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా బుచ్చిబాబు పెద్దిని రూపొందిస్తున్నారు. అందులో భాగంగానే బుచ్చిబాబు తన ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయడం లేదని తెలుస్తోంది. తన హెల్త్ ఎలా ఉన్నా, భోజనం మానేసినా సరే పెద్ది షూటింగ్, ఎడిటింగ్, మ్యూజిక్ వర్క్స్ ను మాత్రం రెగ్యులర్ గా చేస్తూనే ఉన్నారని, ఇవన్నీ తెలుసుకున్న రామ్ చరణ్, బుచ్చిబాబుకు ముందు ఆరోగ్యంపై దృష్టి పెట్టి, దానికి తగిన ప్రాధాన్యతనివ్వాలని సూచించారని తెలుస్తోంది. తిండి, నిద్రా మానేసి మరీ బుచ్చిబాబు ఈ సినిమాకు వర్క్ చేస్తున్నారంటే పెద్ది విషయంలో అతనెంత కసిగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.
