Begin typing your search above and press return to search.

అమ్మాయిలను ఆపలేక కాలేజీ క్లాస్‌రూమ్ తలుపులు మూసేశారు.. అదీ విజ‌య్ క్రేజ్!

''అమ్మాయిలను ఆపలేక కాలేజీ క్లాస్‌రూమ్ తలుపులు మూసేశారు.. అదీ విజయ్ క్రేజ్!'' అంటూ బుచ్చిబాబు చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

By:  Sivaji Kontham   |   13 Oct 2026 10:23 PM IST
అమ్మాయిలను ఆపలేక కాలేజీ క్లాస్‌రూమ్ తలుపులు మూసేశారు.. అదీ విజ‌య్ క్రేజ్!
X

విజయ్ దేవ‌ర‌కొండ‌- ర‌ష్మిక మంద‌న్న ప్ర‌ధాన పాత్ర‌ల్లో రాహుల్ సాంకృత్య‌న్ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మించిన `ర‌ణ‌బాలి` అక్టోబ‌ర్ 16న‌ విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా రణబాలి గ్రాండ్ ప్రీ-రిలీజ్ వేడుకలో దర్శకుడు బుచ్చిబాబు సాన చేసిన ప్రసంగం ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తనదైన శైలిలో మాట్లాడిన ఆయన.. గత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ టాలీవుడ్ స్టార్ హీరోల క్రేజ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఇమేజ్ గురించి అత‌డు చెప్పిన ఒక సంఘటన అందరి దృష్టిని ఆకర్షించింది.

''అమ్మాయిలను ఆపలేక కాలేజీ క్లాస్‌రూమ్ తలుపులు మూసేశారు.. అదీ విజయ్ క్రేజ్!'' అంటూ బుచ్చిబాబు చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాను గతంలో `గీత గోవిందం` చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన రోజులను గుర్తుచేసుకుంటూ.. పూణెలో ఆ సినిమా షూటింగ్ జరిగినప్పుడు ఎదురైన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. ముఖ్యంగా `అర్జున్ రెడ్డి` సమయంలో హైదరాబాద్‌లోని ఒక కాలేజీలో షూటింగ్ జరుగుతుండగా.. విజయ్ కోసం ఎగబడ్డ అమ్మాయిలను అప్పట్లో ఆపలేకపోయారని.. దాంతో కాలేజీ క్లాస్‌రూమ్ తలుపులు మూసేయాల్సి వచ్చిందని తెలిపారు.

విజయ్ దేవరకొండ క్రేజ్ ఎప్పుడూ ఒక రేంజ్‌లో ఉంటుందని.. ఇది పవన్ కళ్యాణ్ రేంజ్... కళ్యాణ్ గారి స్థాయి ఉన్న నిజమైన స్టార్ ఇమేజ్ అత‌డికి ఉంద‌ని బుచ్చిబాబు అభివర్ణించారు. సామాన్య జనాల్లో.. ముఖ్యంగా యూత్‌లో విజయ్ సంపాదించుకున్న ఆదరణ మామూలుది కాదని కొనియాడారు.

ఈ సందర్భంగా రష్మిక మందన్న గురించి కూడా ఆయన సరదాగా మాట్లాడారు. రష్మికకు ఇటీవలే వివాహం జరిగిందని.. తెలుగు ఆడియన్స్ కే ఈ జంట `ర‌ణ‌బాలి` స‌క్సెస్ అనే మ్యారేజ్ గిఫ్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. చివరగా మైత్రి అధినేత‌లు రవి, నవీన్, శివ .. మ్యూజిక్ డైరెక్టర్ సాజూ అతుల్ తో పాటు చిత్ర యూనిట్ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ తన ప్రసంగాన్ని ముగించారు.

ర‌ణ‌బాలి ప్రీరిలీజ్ వేడుక‌లో హ‌రీష్ శంక‌ర్, రాహుల్ ర‌వీంద్ర‌న్ స‌హా ప‌లువురు అతిథులు పాల్గొన్నారు. బుచ్చిబాబు సాన, హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, హీరోయిన్ రష్మిక, సంగీత దర్శకుడు సాజూ అతుల్ , రవి , నవీన్ , శివ ..ఇత‌ర‌ చిత్ర యూనిట్ సభ్యులందరూ ఈ వేడుకలో ఉత్సాహంగా పాల్గొన్నారు.