Begin typing your search above and press return to search.

పెద్దిగాడిని గుండెల్లో నుంచి తీసేయడం కష్టం.. బుచ్చిబాబు ఎమోషనల్

రామ్ చరణ్ సినిమా రిలీజ్ అప్‌డేట్ కోసం చాలరోజులుగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఒక క్లారిటీ వచ్చేసింది.

By:  M Prashanth   |   1 May 2026 11:33 PM IST
పెద్దిగాడిని గుండెల్లో నుంచి తీసేయడం కష్టం.. బుచ్చిబాబు ఎమోషనల్
X

రామ్ చరణ్ సినిమా రిలీజ్ అప్‌డేట్ కోసం చాలరోజులుగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఒక క్లారిటీ వచ్చేసింది. జూన్ 4న సినిమా థియేటర్లలోకి వస్తుందని మేకర్స్ ప్రకటించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన మీట్‌లో దర్శకుడు బుచ్చిబాబు సానా మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తన గురువు సుకుమార్ సమక్షంలో సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూనే, ఈ ప్రాజెక్ట్ తనకి ఎంత స్పెషలో బుచ్చిబాబు చాలా ఎమోషనల్‌గా పంచుకున్నారు.

ముందుగా తన గురువు సుకుమార్‌కి థాంక్స్ చెబుతూ స్పీచ్ మొదలుపెట్టిన బుచ్చిబాబు.. ఏప్రిల్ 30న సినిమా తీసుకురాలేకపోయినందుకు అందరినీ క్షమించమని అడిగారు. జూన్ 4న వస్తున్నందుకు అందరి ఆశీస్సులు కావాలని కోరారు. "పెద్దిగాడు మీ అందరి హృదయాలకి చాలా దగ్గరగా ఉంటాడు. వాడిని గుండెల్లో నుంచి తీసేయడం ఎవరికీ అంత ఈజీ కాదు" అంటూ ఈ కథలోని ఇంటెన్సిటీ ఏంటో ఒకే ఒక్క మాటతో చెప్పేశారు. చరణ్ సార్ మీద ఉన్న ప్రేమతోనే ఈ సినిమాను ఇంతగా తీర్చిదిద్దగలిగానని ఆయన గుర్తు చేసుకున్నారు.

బుచ్చిబాబు స్పీచ్ మధ్యలో యాంకర్ ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. సెట్స్ మీద ఇంత పెద్ద యాక్టర్లను ఎలా హ్యాండిల్ చేస్తారని అడగగా.. తనకి ఎప్పుడూ ఒక రకమైన టెన్షన్ ఉంటుందని బుచ్చిబాబు నిజాయితీగా ఒప్పుకున్నారు. దానికి సుకుమార్ గారు స్పందిస్తూ.. సెట్స్ మీద బుచ్చిబాబు రెండు రకాలుగా ఉంటాడని, షాట్ గ్యాప్‌లో చాలా వినయంగా ఉన్నా, కెమెరా వెనుక మాత్రం విశ్వరూపం చూపిస్తాడని కితాబిచ్చారు.

ఒక డైరెక్టర్‌కి ఆ కమాండ్ ఉండటం వల్లే ఇంత భారీ ప్రాజెక్ట్‌ను హ్యాండిల్ చేయగలుగుతున్నాడని తన శిష్యుడిని పొగిడారు.

ఇక మెగా ఫ్యాన్స్ కోసం స్పెషల్ మెసేజ్ ఇస్తూ.. పెద్ది క్యారెక్టర్‌లో చరణ్ సార్‌ను చూశాక ఆయనను మర్చిపోవడం ఎవరికీ సాధ్యం కాదన్నారు. ఈ సినిమా చాలా కమర్షియల్ గా ఉంటూనే, ప్రతి ఒక్కరిని ఎమోషనల్ గా కనెక్ట్ చేస్తుందని భరోసా ఇచ్చారు. చరణ్ సార్ ఇచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకోవడానికి తన సర్వశక్తులు ఒడ్డానని చెప్పారు. తన మీద నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరికీ సినిమాతోనే సమాధానం చెబుతానని బుచ్చిబాబు చాలా కాన్ఫిడెంట్‌గా కనిపించారు.

చివరలో సరదాగా కొంచెం సందడి కూడా నెలకొంది. ఈ మధ్య డైరెక్టర్లు తమ సినిమాలను ప్రమోట్ చేయడానికి స్టెప్పులు వేస్తున్నారు కదా, మీరు కూడా ట్రై చేయండి అని యాంకర్ అడగగా.. "ఈ జన్మలో కాదు కదా, వచ్చే జన్మలో కూడా నా వల్ల కాదు" అని బుచ్చిబాబు నవ్వుతూ బదులిచ్చారు. బుచ్చిబాబు మాటలు విన్నాక, 'పెద్ది' మీద ఉన్న హైప్ మరో లెవల్ కి వెళ్ళిందనే చెప్పాలి. జూన్ 4న బాక్సాఫీస్ దగ్గర చరణ్ ఏ రేంజ్ లో హైప్ క్రియేట చేస్తాడో చూడాలి.