జాన్వీ రోల్ పై చర్చలకు ఫుల్ స్టాప్? బుచ్చిబాబు కొత్త ప్లాన్ ఇదే!
సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి వచ్చిన రెస్పాన్స్ లో జాన్వీ పాత్రకు సంబంధించిన అభిప్రాయాలు భిన్నంగా కనిపించాయి.
By: M Prashanth | 14 Jun 2026 10:11 PM ISTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లీడ్ రోల్ లో తెరకెక్కిన పెద్ది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న వేళ.. ఇప్పుడు మరోసారి ఆ సినిమా వార్తల్లో నిలిచింది. అయితే ఈసారి చర్చ వసూళ్ల గురించి, రికార్డుల గురించి కాదు. హీరోయిన్ జాన్వీ కపూర్ రోల్ చుట్టూ గత కొన్ని రోజులుగా సాగుతున్న చర్చలపై దర్శకుడు బుచ్చిబాబు సనా చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి.
సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి వచ్చిన రెస్పాన్స్ లో జాన్వీ పాత్రకు సంబంధించిన అభిప్రాయాలు భిన్నంగా కనిపించాయి. కొందరు ఆమె రోల్ కు సరైన ప్రాధాన్యత దక్కలేదని భావించగా.. మరికొందరు క్యారెక్టరైజేషన్ పై సందేహాలు వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలోనూ ఆ అంశం పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో నిర్వహించిన సక్సెస్ ప్రెస్ మీట్ లో బుచ్చిబాబు నేరుగా స్పందించారు.
"జాన్వీ రోల్ గురించి చాలా చర్చ జరిగింది. సినిమా రన్ టైమ్ కారణంగా తొలగించిన కొన్ని సన్నివేశాలు ఇప్పుడు మళ్లీ యాడ్ చేస్తున్నాం. బుధవారం నుంచి ఆ కొత్త సీన్స్ ప్రేక్షకులకు కనిపిస్తాయి. అవి వచ్చిన తర్వాత ఆమె రోల్ పై ఉన్న అన్ని డౌట్స్ కు ఆన్సర్ వస్తుంది" అని వెల్లడించారు. తాను ఎప్పుడూ ఉమెన్ రోల్స్ ను తక్కువ చేసి చూపించే ఉద్దేశంతో సినిమాలు చేయనని, ఉమెన్ ఎంపవర్మెంట్ కు మద్దతుగా నిలిచే వ్యక్తినని బుచ్చిబాబు స్పష్టం చేశారు.
జాన్వీ రోల్ ను తప్పుగా అర్థం చేసుకోవద్దని, పూర్తి కథలో ఆ పాత్రకు ఉన్న ఇంపార్టెన్స్ కొత్త సీన్స్ తో క్లారిటీ వస్తుందని చెప్పారు. సాధారణంగా సినిమా విడుదలైన తర్వాత కథ లేదా పాత్రల విషయంలో వచ్చిన విమర్శలను దర్శకులు పెద్దగా పట్టించుకోరు. కానీ ప్రేక్షకుల అభిప్రాయాలను గౌరవిస్తూ ఇప్పటికే ఎడిట్ చేసిన సీన్స్ మళ్లీ యాడ్ చేయాలని నిర్ణయించడం ఆసక్తికరంగా మారింది. దీనివల్ల స్టోరీ మరింత బలపడుతుందా? జాన్వీ పాత్రపై అభిప్రాయాలు మారతాయా? అన్న ఆసక్తి నెలకొంది.
ఇక సినిమా విజయంపై కూడా బుచ్చిబాబు ఆనందం వ్యక్తం చేశారు. తన ఆలోచనలకు రామ్ చరణ్ స్క్రీన్ పై ప్రాణం పోశారని ఆయన కొనియాడారు. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు, పెద్దవాళ్లు కూడా థియేటర్లకు వచ్చి సినిమాను ఆదరిస్తుండటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఒక మాస్ స్టోరీకి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ లభించడం తమ టీమ్ కు మరింత ఉత్సాహాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు.
నిర్మాత వెంకట సతీశ్ కిలారు సినిమాకు వస్తున్న రెస్పాన్స్ పై సంతృప్తి వ్యక్తం చేశారు. రెండో వీకెండ్ లో వసూళ్లు అంచనాలకు మించి నమోదవుతున్నాయని తెలిపారు. టికెట్ ధరలు నార్మల్ రేంజ్ లో ఉండటంతో కుటుంబ ప్రేక్షకులు మళ్లీ మళ్లీ సినిమా చూసే అవకాశం ఉందని, అదే మూవీ లాంగ్ రన్ కు కారణం అవుతుందని అభిప్రాయపడ్డారు. ఏదేమైనా బాక్సాఫీస్ వద్ద విజయాన్ని ఆస్వాదిస్తున్న పెద్ది.. ఇప్పుడు జాన్వీ రోల్ కు యాడ్ చేయనున్న కొత్త సీన్స్ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎక్స్ ట్రా సీన్స్ చర్చలకు ఫుల్ స్టాప్ పెడతాయా? లేక కొత్త చర్చలకు దారితీస్తాయా? అన్నది వేచి చూడాలి.
