K- పాప్: భారత్‌లోకి ప్రవేశించిన కొరియన్ వైరస్
కరోనా క్రైసిస్ సమయంలోనే బిటిఎస్- కే పాప్ అనేది కూడా ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీని పెంచుకోవడం మొదలైంది.
By: Sivaji Kontham | 29 Dec 2025 5:33 PM ISTచైనా నుంచి కరోనా వైరస్ వచ్చింది. ప్రపంచాన్ని అల్లకల్లోలంగా మార్చింది. మానవ ప్రపంచానికి చుక్కలు చూపించిన టెర్రర్ డేస్‌ని ఎవరూ మర్చిపోలేదు. కానీ కరోనా భయాల నుంచి తేరుకుని ప్రపంచం నెమ్మదిగా వినోదాన్ని ఆస్వాధించడంలో పుష్కలంగా నిమగ్నమైంది. కరోనా క్రైసిస్ సమయంలోనే బిటిఎస్- కే పాప్ అనేది కూడా ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీని పెంచుకోవడం మొదలైంది.
కొరియాలో ఖాళీగా ఉన్న యూత్ చెడిపోతున్నారనే ఉద్ధేశంతో అక్కడ ప్రభుత్వం పాప్ సంస్కృతికి విస్త్రతమైన ప్రచారం కల్పించి ప్రోత్సహించడం ప్రారంభించింది. పాప్ గాయకులుగా ప్రతిభ చూపించిన వారికి తాయిలాలు అందించింది. ఆ తర్వాత ఆ దేశంలో అత్యాచారాలు తగ్గిపోయాయని నివేదికలు చెప్పాయి. ఈ విషయాన్ని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ గ్లోబల్ రైజింగ్ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి చెప్పారు. మెగాస్టార్ ఇచ్చిన డీటెయిలింగ్ తో కే పాప్ కొరియాలో ఎందుకు అభివృద్ధి చెందిందో చాలా మందికి క్లారిటీ వచ్చింది. అదే సమయంలో ఇలాంటి కల్చర్ భారతదేశంలో పుట్టుకొస్తే బావుంటుంది కదా! అని భావించారు. ఇప్పుడు భారతదేశంలో యువతను కూడా చెడు మార్గంలో ప్రయాణించకుండా ఇలాంటి పాప్ కల్చర్ కి అలవాటు చేయాల్సిన సమయం ఆసన్నమైందని కూడా అర్థమైంది.
అయితే కే-పాప్ అనేది నెమ్మదిగా కరోనా వైరస్ లా ప్రపంచాన్ని అల్లుకుపోతోంది. కొరియన్ పాప్ కల్చర్ అందరికీ నచ్చింది. ఆ దేశ సినిమాలు, టీవీ షోలే కాదు.. పాప్ పాటలను, వాటిలో అదిరిపోయే కొరియోగ్రఫీని కూడా భారతదేశ ప్రజలు ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా ముంబై, కోల్ కత, పూణే, దిల్లీ వంటి మెట్రో నగరాల్లోని యువతరం ఎక్కువగా కే- పాప్ ని ఇష్టపడుతున్నారు. కొన్ని నెలలుగా కే పాప్ గురించి తెలుగు మీడియాలు కూడా కథనాలు ప్రచురిస్తుండడంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు కూడా ఇలాంటి ఒక బ్యాండ్ కొరియాలో ఉందని తెలిసిపోయింది.
ఇలాంటి సమయంలో కే-పాప్ బ్యాండ్, బీటీఎస్ త్వరలో భారతదేశానికి రాబోతోందని తెలుస్తోంది. కొత్త సంవత్సరంలో భారతీయ అభిమానులకు కూడా కే- పాప్ ట్రీట్ అందనుంది. 2026లో భారతదేశంలో బీటీఎస్ కార్యక్రమానికి సాధ్యమయ్యే ప్రదేశాలలో ఒకటిగా ముంబైని ఎంపిక చేసుకుందని కూడా గుసగుస వినిపిస్తోంది. జెన్ జెడ్ ని ఉర్రూతలూగించే వైరస్ ఇది.. ట్రీట్ కోసం ఎదురు చూడండి! అంటూ ఇప్పటికే సైలెంట్ గా ప్రచారం మొదలైపోయింది. కే పాప్ లో టీనేజీ ట్యాలెంట్ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించడమే ఈ ప్రపంచవ్యాప్త ఆకర్షణకు కారణం. కే-పాప్ కి భారతదేశంలో అమ్మాయిల్లోను భారీ ఫాలోయింగ్ పెరుగుతోంది. దీంతో కొరియన్ బ్యాండ్ లు ముంబైలో ఒక భారీ ప్రదర్శన ఇవ్వాలని నిర్ణయించినట్టు గుసగుస వినిపిస్తోంది. అయితే అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. కే - పాప్ తరహాలోనే ఐ- పాప్ (ఇండియన్ పాప్) కూడా అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందాలంటే ఏం చేయాలి? ఇక్కడి ట్యాలెంట్ ఎలాంటి కసరత్తు చేయాలి?
