కవితకు నా సానుభూతి.. జగదీష్ రెడ్డి షాకింగ్ స్పందన
ఈ వ్యాఖ్యలపై స్పందించిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత గుంటకండ్ల జగదీష్ రెడ్డి తనదైన శైలిలో స్పందించారు.
By: A.N.Kumar | 3 Aug 2025 6:54 PM ISTతెలంగాణ రాజకీయాల్లో మరోసారి బీఆర్ఎస్ నేతల మధ్య వివాదాలు తెరపైకి వచ్చాయి. ఇటీవల నల్గొండలో జరిగిన ఓ సమావేశంలో పార్టీ నాయకురాలు కవిత చేసిన వ్యాఖ్యలు పార్టీలో చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై స్పందించిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత గుంటకండ్ల జగదీష్ రెడ్డి తనదైన శైలిలో స్పందించారు.
జగదీష్ రెడ్డి మాట్లాడుతూ, “కవిత గారు నల్గొండ నాయకుడి వ్యాఖ్యల మీద మాట్లాడిన తీరుపై ఆశ్చర్యం కలిగింది. ఉద్యమ కాలంలో ఆమె పాత్రపై ఆవిడకు జ్ఞానం అవసరమై ఉండొచ్చు. అయినా సరే, ఆమె చేసిన వ్యాఖ్యలపై నాకు సానుభూతి ఉంది” అని వ్యాఖ్యానించారు. తనను విమర్శించిన నాయకులను సమర్థించేందుకు కవిత ప్రయత్నిస్తున్న తీరును ఆయన తప్పుబట్టారు.
అంతేకాకుండా, “కేసీఆర్ శత్రువులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మీడియా అధినేత రాధాకృష్ణల మాటలను మరోసారి గట్టిగా పునరావృతం చేయడమే ఆమె ప్రయత్నం. ఇది అనర్హ చర్య. పార్టీని బలోపేతం చేయాల్సిన సమయంలో ఇలాంటి విమర్శలు చేయడం అనవసరం” అని ఆయన హాట్ కామెంట్స్ చేశారు.
ఇంతకుముందు కవిత మాట్లాడుతూ “నల్గొండలో ఓ నేత బీఆర్ఎస్ ను నాశనం చేశాడు” అని సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ వ్యాఖ్యలతో బీఆర్ఎస్ లోపలే విభేదాలు బహిర్గతమయ్యాయి. ఈ పరిణామాలు పార్టీకి కొత్త తలనొప్పిగా మారే అవకాశం ఉంది.
ఇక ఒకవేళ ఈ వాదోపవాదాలు కొనసాగితే బీఆర్ఎస్ పునరుద్ధరణ ప్రయత్నాలకు ఆటంకం కలగొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే కవిత – జగదీష్ రెడ్డి మధ్య ఈ మాటల యుద్ధం ఎక్కడ ఆగుతుందో, అది ఎలా పరిష్కారమవుతుందో వేచి చూడాలి.
