ఒకే ఫ్రేమ్‌లో రణబీర్ వర్సెస్ రణ్‌వీర్: 'బ్రహ్మాస్త్ర 2' ప్యాకేజీ ప్లాన్!
మొదటి భాగం డైలాగ్స్ .. ఇతర అంశాలపై వచ్చిన విమర్శలను దృష్టిలో ఉంచుకుని.. ఈసారి అయాన్ ముఖర్జీ స్క్రిప్ట్ విషయంలో మరింత జాగ్రత్త వహిస్తున్నారు.
By: Sivaji Kontham | 10 April 2026 8:45 AM ISTభారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫాంటసీ అడ్వెంచర్ `బ్రహ్మాస్త్ర` సీక్వెల్‌కు సంబంధించి రణబీర్ కపూర్ తాజాగా అందించిన అప్‌డేట్స్ అభిమానుల్లో భారీ అంచనాలను పెంచుతున్నాయి. నిజానికి బ్రహ్మాస్త్ర పార్ట్ 1 కి మిశ్రమ స్పందనలు వచ్చినా, పార్ట్ 2 పై ఆ ప్రభావం పడకూడదని దర్శకుడు అయాన్ ముఖర్జీ భావిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం `బ్రహ్మాస్త్ర: పార్ట్ 2 - దేవ్` ప్రీ-ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకున్నాయని.. దర్శకుడు అయాన్ ముఖర్జీతో కలిసి రణబీర్ అతి త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్నారని తెలుస్తోంది. మొదటి భాగం ముగింపులో పరిచయం చేసిన అత్యంత శక్తివంతమైన `దేవ్` పాత్ర చుట్టూ ఈ సీక్వెల్ కథ తిరుగుతుందని.. ఈ క్రమంలో సినిమా స్కేల్ మొదటి భాగం కంటే పది రెట్లు పెద్దదిగా ఉంటుందని రణబీర్ స్వయంగా వెల్లడించడం విశేషం.
ఈ సీక్వెల్‌లో ఉత్కంఠ పెంచుతున్న అంశం ఒకటి ఉంది. అది `దేవ్` పాత్రలో ఎవరు కనిపిస్తారు అనేదే. బాలీవుడ్ అగ్ర హీరో రణవీర్ సింగ్ లేదా కన్నడ స్టార్ యశ్ పేర్లు ఈ పాత్ర కోసం ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఒకవేళ రణవీర్ సింగ్ ఈ పాత్రను పోషిస్తే.. వెండితెరపై రణబీర్ కపూర్ వర్సెస్ రణవీర్ సింగ్ మధ్య జరిగే పోరాటం ప్రేక్షకులకు కనువిందుగా మారుతుంది. అయితే దీనిపై అధికారికంగా వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. మొదటి భాగం సాధించిన విజయం.. దేవ్ పాత్రపై ఉన్న సస్పెన్స్, ఈ సీక్వెల్‌పై అంచనాలను ఆకాశానికి చేర్చాయి.
మొదటి భాగం డైలాగ్స్ .. ఇతర అంశాలపై వచ్చిన విమర్శలను దృష్టిలో ఉంచుకుని.. ఈసారి అయాన్ ముఖర్జీ స్క్రిప్ట్ విషయంలో మరింత జాగ్రత్త వహిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా `అస్త్రవర్స్` అనే సినిమాటిక్ యూనివర్స్‌ను మరింత విస్తరించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కేవలం రెండో భాగమే కాకుండా.. మూడో భాగానికి సంబంధించిన ప్రణాళికలు కూడా ఇప్పటికే సిద్ధంగా ఉన్నట్లు రణబీర్ హింట్ ఇచ్చారు. `యె జవానీ హై దీవానీ` వంటి సినిమాలకు సీక్వెల్స్ అవసరం లేదని చెప్పిన రణబీర్.. `బ్రహ్మాస్త్ర`ను మాత్రం ఒక గొప్ప ట్రయాలజీగా పూర్తి చేయడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నారు.
రణబీర్ ప్రస్తుతం `రామాయణ`, `లవ్ అండ్ వార్` వంటి భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నా.. వీటి షూటింగ్ పూర్తయిన వెంటనే `బ్రహ్మాస్త్ర` సీక్వెల్ చిత్రీకరణలో పాల్గొననున్నారు. మొదటి భాగంలో శివ - ఈషా మధ్య ఉన్న ప్రేమకథ కంటే.. రెండో భాగంలో అస్త్రాల మధ్య జరిగే భీకర యుద్ధం... దేవ్ గతంపై ఎక్కువ ఫోకస్ ఉంటుందని సమాచారం. ఈ సినిమా కోసం రణబీర్ తన లుక్, బాడీ లాంగ్వేజ్‌లో మళ్ళీ విభిన్నమైన మార్పులు చేసుకునే అవకాశం ఉంది. అంతర్జాతీయ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
మొత్తానికి `బ్రహ్మాస్త్ర 2` షూటింగ్ ఆశించిన దానికంటే ముందే ప్రారంభం కానుండటం సినీ ప్రియులకు శుభవార్త అనే చెప్పాలి. 2026 చివరిలో లేదా 2027లో ఈ సినిమాను విడుదల చేసేలా ప్రాథమికంగా ప్లాన్ చేసినా.. తాజా అప్‌డేట్స్ ప్రకారం షూటింగ్ షెడ్యూల్స్ వేగంగా జరగనున్నాయి. మొదటి భాగం మిక్స్‌డ్ రివ్యూలు అందుకున్నా.. బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించే వసూళ్లను సాధించింది. ఇప్పుడు `దేవ్` పాత్రతో సృష్టించబోయే విధ్వంసం ఏ స్థాయిలో ఉంటుందోనని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా దురంధర్ ఫ్రాంఛైజీతో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన రణ్ వీర్ సింగ్ ఈ పాత్రలో నటిస్తారన్న ప్రచారంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
