నా దృష్టిలో అందమైన హీరో ఆయనే!
అందమంటే గ్లామర్ కాదు, మంచి మనసు అంటున్నారు హాస్య బ్రహ్మ బ్రహ్మానందం. పీపుల్ స్టార్ ఆర్. నారాయణ మూర్తి స్వీయ దర్శకత్వం వహిస్తూ నిర్మించిన సినిమా యూనివర్సిటీ: పేపర్ లీక్.
By: Sravani Lakshmi Srungarapu | 19 Aug 2025 4:32 PM ISTఅందమంటే గ్లామర్ కాదు, మంచి మనసు అంటున్నారు హాస్య బ్రహ్మ బ్రహ్మానందం. పీపుల్ స్టార్ ఆర్. నారాయణ మూర్తి స్వీయ దర్శకత్వం వహిస్తూ నిర్మించిన సినిమా యూనివర్సిటీ: పేపర్ లీక్. ఆగస్ట్ 22న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో మూవీ లోగోను లాంచ్ చేసిన బ్రహ్మానందంకు నారాయణ మూర్తి ఈ సినిమాను చూపించగా సినిమా చూసిన తర్వాత బ్రహ్మానందం మూవీ గురించి, నారాయణ మూర్తి గురించి మాట్లాడుతూ ప్రశంసించారు.
తేనెటీగ లాంటోడు
నారాయణ మూర్తి తేనెటీగ లాంటి వారని, తిరుగుతూనే ఉంటారని, అన్ని చోట్ల నుంచి తేనె పోగు చేసుకుని వచ్చి తలా ఒక్కో చుక్క పంచి పెడుతుంటారని, నా దృష్టిలో అందమైన హీరో ఎవరని అడిగితే తాను నారాయణ మూర్తి పేరే చెప్తానని, నారాయణ మూర్తిని 40 ఏళ్లుగా చూస్తున్నానని, తన గురించి కంటే ఎక్కువగా ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి అన్నారు బ్రహ్మానందం.
అదే ప్యాంటుషర్టు, అదే చెప్పులు
నారాయణ మూర్తి పేద ప్రజల కోసం ఎన్నో త్యాగాలు చేశారని, ఆఖరికి ఆయన జీవితాన్ని కూడా వారికే అంకితం చేశారని, ఆయన చేసినన్ని మంచి పనులు తాను చేయలేదని.. చేస్తానో లేదో కూడా తెలియదని చెప్పిన బ్రహ్మానందం, నారాయణ మూర్తి అప్పట్నుంచి ఇప్పటివరకు అలానే ఉన్నారనీ, ఏమీ మారలేదని, అదే ప్యాంటు, అదే షర్టు, అవే చెప్పులు, అదే ఆటోతో సరిపెట్టుకుంటున్నారని, ఎవరెన్ని ప్రలోభాలు పెట్టినా వేటికీ తలవంచకుండా, అన్నింటికీ ఎదురీదారని, తనకు వెంకటేశ్వరస్వామి అంటే ఇష్టమని, అలానే నారాయణ మూర్తి అంటే కూడా ఇష్టమని చెప్పారు.
దేశాన్ని మళ్లీ బడిలో వేయాలి
ఈ సినిమా చూసి తాను చాలా ఎమోషన్ కు గురయ్యానని, ప్రస్తుతం మన దేశంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందో చాలా స్టడీ చేసి నారాయణమూర్తి ఈ సినిమా తీశారని, ఈ సినిమాలో ఎన్నో నిజాలు, జీవితపు లోతులు ఉన్నాయని, సినిమాలోని కొన్ని డైలాగులు కట్టిపడేసేలా ఉన్నాయని, ఈ దేశాన్ని మళ్లీ బడిలో వేయాలి అంటూ బ్రహ్మానందం పేర్కొన్నారు.
