మీమ్స్ బోయ్ గా మార్చేసారంటూ బ్రహ్మానందం!
హాస్యబ్రహ్మ బ్రహ్మానందం కొంత కాలంగా సినిమాలకంటే? సోషల్ మీడియాలో హైలైట్ అవుతోన్న సంగతి తెలిసిందే.
By: Srikanth Kontham | 13 Sept 2025 1:17 PM ISTహాస్యబ్రహ్మ బ్రహ్మానందం కొంత కాలంగా సినిమాలకంటే? సోషల్ మీడియాలో హైలైట్ అవుతోన్న సంగతి తెలిసిందే. బ్రహ్మానందం పేరిట సోషల్ మీడియాలో మీమ్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆయన గత సినిమాల ఎక్స్ ప్రెషన్స్...డైలాగ్ లతో మీమ్స్ పేరిట సోషల్ మీడియాలోనూ నవ్వించడం పరిపాటిగా మారింది. బ్రహ్మానందం లేకుండా మీమ్స్ లేవన్నంతగా ఫేమస్ అయిపోయారు. ఇండస్ట్రీలో చాలా మంది హాస్య నటులున్నా? బ్రహ్మానందం సీన్స్ సింక్ అయినట్లు మరో నటుడి సీన్స్ సింక్ అవ్వవన్నది చాలా మంది అభిప్రాయం.
స్టార్ హీరోల చిత్రాల ప్రమోషన్ సందర్భాల్లోనూ ఆయా యూనిట్లు బ్రహ్మానందం పేరిట వచ్చిన మీమ్స్ వేసి ప్రచారం చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. వీటిని ఆయనే అంతే సరదాగా తీసుకుంటారు. కానీ వాటి గురించి ప్రత్యేకంగా ఇంత వరకూ ఎక్కడా స్పందించలేదు. తొలిసారి వీటి గురించి బ్రహ్మానందం ఓపెన్ అయ్యారు. తనని సినిమాలకే పరిమితం చేయకుండా సోషల్ మీడియాలో మీమ్స్ బోయ్ గాను మార్చారన్నారు. ఏ రూపంలోనైనా పది మందినీ నవ్వించడం తన ప్రధాన లక్ష్యంగా భావిస్తానన్నారు. నవ్వడంలోనే ఎంతో ఆరోగ్యంతో ఉండగలమని..అలాంటి నవ్వును తాను పంచడం గొప్ప వరంగా భావిస్తున్నట్లు తెలిపారు.
అలాగే భవిష్యత్ లో రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా? అనే ప్రశ్న రెయిజ్ అవ్వగా తనకు రాజకీయ నేపథ్యం లేదని , రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం కూడా తనకు లేదన్నారు. తాను నిరుపేద కుటుంబంలో పుట్టినట్లు చెప్పుకొచ్చారు. అలాగే అధ్యాపకుడిగా జీవితాన్ని ప్రారంభించడం..అటుపై ఆ వృత్తిని వదిలేసి సినిమాల్లోకి రావడం గురించి ప్రస్తావించారు. దాదాపు 1200 చిత్రాల్లో నటించినట్లు తెలిపారు. తన జీవితం సినిమాలకే అంకితమని...నటన మాత్రం ఎప్పటికీ వదలనని తెలిపారు.
తన పదవికి రిటైర్మెంట్ ఉండొచ్చు ఏమోగానీ.. తన పెదవికి రిటైర్మెంట్ ఇవ్వలేనన్నారు. చివరి వరకూ నవ్విస్తూనే ఉంటానన్నారు. చిరంజీవి నటించిన `చంటబ్బాయ్` సినిమాతో బ్రహ్మానందం సినీ జీవితం ప్రారంభమైన సంగతి తెలిసిందే. 1986లో ఆ సినిమా రిలీజ్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ బ్రహ్మానందం తెలుగు చలన చిత్ర పరిశ్రమకు తన సేవలు అందిస్తున్నారు. హాస్య బ్రహ్మాగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయిన గొప్ప నటులు.
