వాళ్లు లేకుంటే బ్రహ్మీని మర్చిపోయేవారా?
ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించిన బ్రహ్మీకి ఫ్యాన్ బేస్ మామూలుగా ఉండదు.
By: M Prashanth | 5 Feb 2026 9:00 PM ISTకామెడీ కింగ్ బ్రహ్మానందం క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. హాస్య బ్రహ్మగా కొన్నేళ్లుగా ఆడియన్స్ ను అలరిస్తున్న ఆయన.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనదైన గుర్తింపు సంపాదించుకున్నారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించిన బ్రహ్మీకి ఫ్యాన్ బేస్ మామూలుగా ఉండదు. అయితే ఆయనకు సోషల్ మీడియా ప్రత్యేక గుర్తింపు ఇచ్చిందని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు.
ఎందుకంటే మీమర్స్, యూట్యూబర్స్ ఆయనను మీమ్ గాడ్ గా పిలుచుకుంటారు. దాదాపు బ్రహ్మీ లేని మీమ్స్, ట్రోల్స్ కనపడడం కష్టమే. అయితే ఇప్పుడు తన ఫోటోలతో వస్తున్న మీమ్స్, ట్రోల్స్ గురించి ఓ ఈవెంట్ లో మాట్లాడిన బ్రహ్మానందం, అక్కడ వేదికపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారి అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
తన ఫోటోలు, విజువల్స్ తో ఎన్నో మీమ్స్ వస్తున్నాయని, చాలామంది వాటిని షేర్ చేస్తున్నారని చెప్పిన ఆయన.. వాటిని ఎప్పుడూ నెగిటివ్ గా తీసుకోలేదని పరోక్షంగా తెలిపారు. "చాలా మంది మీ ఫోటోలు, విజువల్స్ తో మీమ్స్ వాడేస్తున్నారు సర్.. మీరు పట్టించుకోవట్లేదు సర్ అంటుంటారు. కానీ నేను వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవే నన్ను ప్రజల్లో నిలబెట్టాయి" అని స్పష్టం చేశారు.
తనను మీమ్ గాడ్ అని పిలుస్తున్నారని, ఆ పేరు విన్నప్పుడు తాను ఆనందించానని ఇన్ డైరెక్ట్ గా చెప్పారు హాస్య బ్రహ్మ. "ఇంత మంది మీమర్స్ ఉన్నారు కాబట్టి నాకు ఆ పేరు వచ్చింది. వాళ్లు లేకపోతే ఎవరు నన్ను గుర్తుపెట్టుకునేవారు?" అని ప్రశ్నించారు. తనపై ఇలా చేయొద్దు, అలా చేయొద్దు అని నిబంధనలు పెట్టి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు.
"నేను ఇలా చేయొద్దు, అలా అనొద్దు అని చెప్పి ఉంటే.. బ్రహ్మానందం ఓల్డ్ కమెడియన్.. ఫేడ్ అవుట్ అయిపోయాడు అనేవారు. నన్ను బతికించింది.. నన్ను ఇప్పటికీ ప్రజల్లో నిలబెట్టింది మీమర్స్, యూట్యూబర్స్ మాత్రమే. వాళ్లందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెబుతున్నాను" అంటూ తన ఆనందాన్ని వేదికపై వ్యక్తపరిచారు బ్రహ్మానందం.
అయితే సోషల్ మీడియాలో ఎప్పుడూ మీమ్స్, యూట్యూబ్ వీడియోలు, షార్ట్ క్లిప్స్ పెద్ద ఎత్తున వైరల్ అవుతుంటాయి. పాత సినిమాల సీన్స్ కూడా కొత్తగా ట్రెండ్ అవుతుంటాయి. ఈ నేపథ్యంలో బ్రహ్మానందం ఎక్స్‌ప్రెషన్స్, డైలాగ్స్ ఎక్కువగా యూజ్ చేస్తారు మీమర్స్, యూట్యూబర్స్. అలా ఒకప్పుడు ఎక్కువగా థియేటర్లలో నవ్వులు పంచిన బ్రహ్మీ.. ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా ప్రస్తుత జెనరేషన్ కు బాగా దగ్గరయ్యారు. అయితే కాలం మారినా ఆయన కామెడీ మ్యాజిక్ మాత్రం అలాగే కొనసాగుతోందని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ట్రోల్స్ ను పాజిటివ్ గా తీసుకోవడం చాలా మంచి విషయమని చెబుతున్నారు.
