నా బిడ్డల పెళ్లిళ్లు చేసింది నా తమ్ముడే .. !
‘నా తమ్ముడు నిరంతరం సినిమా షూటింగుల్లో బిజీగా ఉంటాడు. వారికి తీరిక దొరికే సమయం చాలా తక్కువ.
By: Garuda Media | 20 Aug 2026 3:14 PM IST‘నా తమ్ముడు నిరంతరం సినిమా షూటింగుల్లో బిజీగా ఉంటాడు. వారికి తీరిక దొరికే సమయం చాలా తక్కువ. కానీ కనీసం నా తమ్ముడు ఫోన్లో అయినా .. అన్నయ్యా ఎలా ఉన్నావ్ ? అని పలకరిస్తాడని ఎదురు చూస్తున్నానని’ ప్రముఖ సినీ నటుడు బ్రహ్మానందం సోదరుడు శ్రీ వదన్ ఆవేదన వ్యక్తం చేసినట్లు మీడియాలో, సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కానీ వాస్తవంగా నాణానికి మరో వైపు వేరే ఉంది. బ్రహ్మానందం సోదరుడు చెప్పిన దాంట్లో కొన్ని వ్యాఖ్యలనే ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు.
బ్రహ్మానందం తల్లిదండ్రులకు ఆరుగురు సంతానం. నలుగురు చనిపోగా, ఆయన సోదరుడు శ్రీ వదన్ గ్రామంలోనే ఉంటున్నాడు. శ్రీ వదన్ ముగ్గురు కూతుళ్ల పెళ్లి చేయడంతో పాటు, తన సోదరుడు నివసించడానికి బ్రహ్మానందం ఇళ్లు కట్టించి ఇచ్చారు. తనకు, తన కూతుళ్లకు అన్ని సమయాల్లో తన సోదరుడు బ్రహ్మానందం అండగా నిలిచారని శ్రీ వదన్ తెలిపారు.
సాధారణ వడ్రంగి కుటుంబం నుండి ఎదిగిన బ్రహ్మానందం సొంతూరు సత్తెనపల్లి సమీపంలోని చాగంటి వారి పాలెం. ఎంఎ తెలుగు చదివిన ఆయన పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలిలో తెలుగు లెక్చరర్ గా పనిచేశారు. అదే సమయంలో థియేటర్ ఆర్టిస్ట్, మిమిక్రీలోనూ రాణించారు. బ్రహ్మానందం పెద్ద కుమారుడు రాజా గౌతమ్ సినిమాల్లో నటించినా పెద్దగా రాణించలేకపోయారు. చిన్న కుమారుడు సిద్దార్థ్ సినిమాలకు దూరంగానే ఉన్నారు. కుటుంబ సంబంధాలకు విలువనిచ్చే బ్రహ్మానందం తన కుమారులతో కలిసి బ్రహ్మానందం అంతా ఒకే చోట నివసిస్తుండడం గమనార్హం.
