Begin typing your search above and press return to search.

ఒక్క పూట భోజ‌నం పెట్టినందుకు కృష్ణ‌వంశీ న‌న్ను హీరోని చేశాడు

తెలుగు సినీ పరిశ్రమలో నటుడు బ్రహ్మాజీ మరియు డైరెక్ట‌ర్ కృష్ణవంశీ మధ్య ఉన్న అనుబంధం ఎంత ప్రత్యేకమో మరోసారి వెలుగులోకి వచ్చింది.

By:  Sravani Lakshmi Srungarapu   |   23 April 2026 10:40 AM IST
ఒక్క పూట భోజ‌నం పెట్టినందుకు కృష్ణ‌వంశీ న‌న్ను హీరోని చేశాడు
X

తెలుగు సినీ పరిశ్రమలో నటుడు బ్రహ్మాజీ మరియు డైరెక్ట‌ర్ కృష్ణవంశీ మధ్య ఉన్న అనుబంధం ఎంత ప్రత్యేకమో మరోసారి వెలుగులోకి వచ్చింది. ఓ ఇంటర్వ్యూలో బ్రహ్మాజీ తన సినీ ప్రయాణంలో ఎదురైన అనుభవాలతో పాటు, కృష్ణవంశీతో తనకు ఏర్పడిన స్నేహం ఎలా జీవితాంత బంధంగా మారిందో హృదయానికి హత్తుకునే విధంగా వివరించారు. సినీ రంగంలో ఇద్దరూ స్ట్రగుల్ అవుతున్న రోజుల్లో జరిగిన ఒక చిన్న సంఘటన వారి మధ్య ఉన్న నమ్మకానికి పునాది వేసిందని ఆయన గుర్తుచేశారు. ఆ సమయంలో కృష్ణవంశీ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో రెండు రోజులుగా భోజనం చేయకుండా ఉన్నప్పటికీ, ఆ విషయం తెలియకుండానే బ్రహ్మాజీ తన దగ్గర ఉన్న మంత్లీ మెస్ పాస్‌తో పాండీ బజార్‌లోని ఒక చిన్న హోటల్‌కు తీసుకెళ్లి భోజనం చేయించారు. ఆ చిన్న సహాయం కృష్ణవంశీ జీవితంలో ఒక మలుపుగా నిలిచిందని, దాన్ని ఆయన ఎప్పటికీ మరచిపోలేదని బ్రహ్మాజీ భావోద్వేగంగా తెలిపారు.

తర్వాత కాలంలో డైరెక్ట‌ర్ గా ఎదిగిన కృష్ణవంశీ, తన కెరీర్‌లో కీలక మైలురాయిగా నిలిచిన నిన్నే పెళ్లాడతా చిత్రం భారీ విజయాన్ని సాధించిన అనంతరం బ్రహ్మాజీకి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. తనను హీరోగా పెట్టి సినిమా తీస్తానని చెప్పిన ఆయన, ఆ వాగ్దానాన్ని నిజం చేస్తూ అవకాశాలు కల్పించారు. అలాగే గులాబీ, సింధూరం, చంద్రలేఖ, ఖడ్గం వంటి చిత్రాల్లో కూడా బ్రహ్మాజీకి గుర్తింపు పొందే పాత్రలు ఇచ్చారు. ముఖ్యంగా గులాబీ, నిన్నే పెళ్లాడతా లాంటి గొప్ప సినిమాల్లో త‌న‌కు న‌టించే అవ‌కాశ‌మిచ్చార‌ని బ్ర‌హ్మాజీ తెలిపారు. కృష్ణవంశీ తనకు సరిపోయే పాత్రలే ఇస్తారని, పాత్ర పరంగా సరైన న్యాయం జరిగేలా చూసేవారని బ్రహ్మాజీ స్పష్టం చేశారు.

సాయం అందుకుని వెంట‌నే మ‌ర్చిపోయే రోజుల్లో కృష్ణ‌వంశీ, బ్ర‌హ్మాజీ పెట్టిన ఒక్క పూట భోజనాన్ని త‌న జీవిత కాలం గుర్తుపెట్టుకోవ‌డ‌మే కాకుండా, ఆ రుణాన్ని బ్ర‌హ్మాజీతో సింధూరం సినిమా తీసి తీర్చుకున్నారు. బ్ర‌హ్మాజీ పెట్టింది ఒక్క పూట భోజ‌న‌మే అయుండొచ్చు. కానీ అప్ప‌టికే రెండ్రోజులుగా ఏమీ తిన‌క‌పోవ‌డంతో మ‌ర్నాడు తిరిగి వెన‌క్కి వెళ్లిపోదామ‌నుకున్న కృష్ణ‌వంశీకి మ‌ళ్లీ సినిమాపై ఆశ‌ల్ని పెంచింది ప‌రోక్షంగా బ్ర‌హ్మాజీనే.

ఒక్క పూట భోజ‌నం పెట్టినందుకే కృష్ణ‌వంశీ రుణం తీర్చుకుని సింధూరం సినిమా చేయ‌గా, త‌న కెరీర్ లో సింధూరం లాంటి సినిమా ఇచ్చినందుకు బ్ర‌హ్మాజీ కూడా ఆయ‌న‌కు ఎప్ప‌టికీ కృత‌జ్ఞుడిగా ఉన్నారు. మొత్తానికి ఆక‌లి నుంచి ప్రారంభ‌మైన వారి స్నేహం, సింధ‌ష్ట్రరం వ‌ర‌కు సాగిన జ‌ర్నీ వెనుక ఉన్న అనుబంధం నిజంగా ప్ర‌త్యేకంగా నిలుస్తుంద‌ని చెప్పాలి.

ఇక త‌న కెరీర్ ప్రారంభ దశను గురించి మాట్లాడుతూ బ్రహ్మాజీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చాలామంది దానిని కష్టకాలంగా పేర్కొన్నప్పటికీ, తాను మాత్రం దాన్నొక అందమైన ప్రయాణంగా భావిస్తానని చెప్పారు. మనకు ఇష్టమైన పని చేస్తుంటే అది కష్టం అనిపించదు అన్న ఆయన మాటల్లో ఆత్మవిశ్వాసం స్పష్టంగా కనిపించింది. అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగినా, ఎప్పుడూ అవమానంగా భావించలేదని, అవి సహజమైన ప్రక్రియగా తీసుకున్నానని వివరించారు. తన స్నేహితులే దర్శకులు, అసోసియేట్లు కావడంతో పెద్దగా ప్రతికూల అనుభవాలు ఎదురుకాలేదని ఆయ‌న గుర్తు చేసుకున్నారు.