Begin typing your search above and press return to search.

చలాన్ కట్టండి ప్లీజ్.. స్టేజ్ మీదే ప్రొడ్యూసర్ కి బ్రహ్మాజీ రిక్వెస్ట్!

ఈవెంట్ 4:30 గంటలకు అని చెప్పి, నిర్మాతలు తనకు వరుసగా పది ఫోన్లు చేశారని బ్రహ్మాజీ వాపోయారు.

By:  M Prashanth   |   8 Dec 2025 11:31 PM IST
చలాన్ కట్టండి ప్లీజ్.. స్టేజ్ మీదే ప్రొడ్యూసర్ కి బ్రహ్మాజీ రిక్వెస్ట్!
X

టాలీవుడ్ లో ఏ ఈవెంట్ జరిగినా అక్కడ నటుడు బ్రహ్మాజీ ఉంటే ఆ సందడే వేరు. తనదైన సెటైర్లు, కామెడీ టైమింగ్ తో అందరినీ నవ్విస్తుంటారు. తాజాగా తరుణ్ భాస్కర్ హీరోగా నటిస్తున్న 'ఓం శాంతి శాంతి శాంతిః' సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ లో కూడా బ్రహ్మాజీ హైలైట్ గా నిలిచారు. సినిమా విశేషాల కంటే ఆయన చెప్పిన ఒక ట్రాఫిక్ ఇన్సిడెంట్, దానికి లింక్ చేస్తూ ప్రొడ్యూసర్ కి పెట్టిన కండిషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సాధారణంగా సినిమా ఫంక్షన్లకు అతిథులు లేటుగా రావడం కామన్. కానీ ఈ ఈవెంట్ కు టైమ్ కి రావడానికి ఆయన పడ్డ పాట్లు, ఆ హడావిడిలో ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసిన విషయం ఆయనే స్వయంగా బయటపెట్టారు. స్టేజ్ మీద మైక్ పట్టుకోగానే సీరియస్ గా మొదలుపెట్టి.. "వచ్చేటప్పుడు నన్ను మామూలుగా టెన్షన్ పెట్టలేదు" అంటూ అసలు స్టోరీని రివీల్ చేశారు.

ఈవెంట్ 4:30 గంటలకు అని చెప్పి, నిర్మాతలు తనకు వరుసగా పది ఫోన్లు చేశారని బ్రహ్మాజీ వాపోయారు. "రండి రండి అని బెదరగొట్టేశారు" అంటూ నవ్వించారు. ఆ కంగారులో వస్తుండగా వేదికకు దగ్గర్లోని సిగ్నల్ దగ్గర ఇరుక్కుపోయారట. అక్కడ ట్రాఫిక్ క్లియర్ అవ్వడానికి దాదాపు 10 నిమిషాలు పట్టిందని, దీంతో ఆలస్యం అవుతుందేమోనని టెన్షన్ పడ్డానని చెప్పారు.

టైమ్ కి రీచ్ అవ్వాలనే ఆత్రుతలో బ్రహ్మాజీ అక్కడ చిన్న సాహసమే చేశారు.

"సిగ్నల్ దగ్గర లైన్ జంప్ చేసి పారిపోయి వచ్చాను.. కానీ వాడు ఫోటో తీసేసాడు" అంటూ ట్రాఫిక్ కెమెరాకు అడ్డంగా దొరికిపోయిన విషయాన్ని చాలా ఫన్నీగా చెప్పారు. కచ్చితంగా ఇంటికి చలాన్ వస్తుందని, అయితే ఆ తప్పు తనది కాదని, త్వరగా రమ్మని ఫోన్లు చేసిన వాళ్లదేనని లాజిక్ లాగారు. ఇక్కడే బ్రహ్మాజీ తన మార్క్ పంచ్ వేశారు. ఇంటికి రాబోయే ఆ చలాన్ ను నిర్మాత సృజన్ కు పంపిస్తానని, దయచేసి మీరే పే చేయాలని స్టేజ్ మీదే ఓపెన్ గా డిమాండ్ చేశారు.

ఒకవేళ నిర్మాత కట్టకపోతే.. "నా ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వాళ్లయినా పే చేయొచ్చు" అంటూ ఆఫర్ ఇవ్వడంతో ఆడిటోరియం మొత్తం నవ్వులతో నిండిపోయింది. తన కోసం రూల్స్ బ్రేక్ చేశా కాబట్టి, ఆ ఫైన్ నిర్మాతే భరించాలని ఆయన తేల్చి చెప్పేశారు. మొత్తానికి 'ఓం శాంతి శాంతి శాంతిః' ఈవెంట్ లో బ్రహ్మాజీ స్పీచ్ ఓ రేంజ్ లో పేలింది. తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా నటిస్తున్న ఈ సినిమా కూడా బ్రహ్మాజీ స్పీచ్ లాగే ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంటుందని టీజర్ చూస్తే అర్థమవుతోంది. జనవరి 23న రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ బ్రహ్మాజీ చలాన్ గోలతో భలే కిక్ స్టార్ట్ అయ్యాయి. మరి ఆ చలాన్ నిజంగా నిర్మాత కడతారో లేదో చూడాలి.