బోయపాటికి ఓకే చెప్పిన హీరో ఎవరు?
నిజానికి బోయపాటి పేరు చెప్పగానే మొదటగా గుర్తొచ్చే హీరో బాలకృష్ణ. వీరిద్దరి కాంబోలో వచ్చిన అఖండ, అఖండ 2 సినిమాలు మాస్ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాయి.
By: M Prashanth | 6 Oct 2026 1:30 PM ISTమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కొత్త సినిమా ఏ హీరోతో చేయబోతున్నారన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. తన నెక్స్ట్ ప్రాజెక్టుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ అక్టోబర్ నెలాఖరులోగా వస్తుందని బోయపాటి చెప్పడంతో ఇప్పుడు ఓ రేంజ్ లో చర్చ జరుగుతోంది. ఆయనతో సినిమా చేయబోయే హీరో ఎవరు అనే విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది.
ఇటీవల తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బోయపాటి శ్రీను తన కొత్త సినిమాపై అప్డేట్ ఇచ్చారు. కొత్త సినిమా షూటింగ్ ప్రారంభించే ముందు స్వామివారి ఆశీస్సులు తీసుకోవడానికి తిరుమలకు వచ్చినట్లు చెప్పారు. అక్టోబర్ చివరి నాటికి కొత్త ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేస్తామని వెల్లడించారు. దీంతో బోయపాటి నెక్ట్స్ మూవీపై ఒక్కసారిగా ఇంట్రెస్ట్ పెరిగింది.
నిజానికి బోయపాటి పేరు చెప్పగానే మొదటగా గుర్తొచ్చే హీరో బాలకృష్ణ. వీరిద్దరి కాంబోలో వచ్చిన అఖండ, అఖండ 2 సినిమాలు మాస్ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాయి. మరోసారి బాలయ్యతో అఖండ 3 ఉంటుందని బోయపాటి ఇప్పటికే స్పష్టం చేశారు. కానీ ఆ సినిమా వెంటనే పట్టాలెక్కే పరిస్థితి లేదు. బాలకృష్ణ ప్రస్తుతం దాదా సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయాల్సి ఉంది.
దీంతో బోయపాటి కొత్త సినిమా ముందుగా మరో హీరోతోనే ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇక బోయపాటి పేరు వినగానే ట్రెండింగ్ లోకి వస్తున్న పేరు అల్లు అర్జున్. సరైనోడుతో ఆ కాంబినేషన్ భారీ విజయాన్ని అందుకుంది. అప్పటి నుంచే వీరిద్దరి కలయికలో మరో సినిమా ఉంటుందనే ప్రచారం ఉంది. ఇప్పుడు బోయపాటి కొత్త సినిమా ప్రకటనపై అప్డేట్ ఇవ్వడంతో సోషల్ మీడియాలో అల్లు అర్జున్ పేరు మళ్లీ ట్రెండ్ అవుతోంది.
అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. అల్లు అర్జున్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు. అట్లీ దర్శకత్వంలోని ‘రాకా’పై ఆయన దృష్టి ఉంది. ఆ తర్వాత లోకేశ్ కనగరాజ్‌తో సినిమా చేయాల్సి ఉంది. ఆ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటికిప్పుడు అల్లు అర్జున్ బోయపాటి సినిమాకు డేట్స్ ఇవ్వడం కష్టమేననే మాట వినిపిస్తోంది.
అదే సమయంలో తమిళ స్టార్ హీరో కార్తీ పేరు కూడా బోయపాటి కొత్త సినిమా విషయంలో వినిపిస్తోంది. పవర్ ఫుల్ స్టోరీ కోసం కార్తీతో బోయపాటి చర్చలు జరుపుతున్నారనే ప్రచారం కొంతకాలంగా ఉంది. అయితే దీనిపై కూడా అధికారికంగా ఎలాంటి క్లారిటీ లేదు. మరోవైపు బోయపాటి కూడా టాప్ ప్రొడక్షన్ హౌస్ లతో సినిమాల కోసం చర్చలు జరుపుతున్నట్లు టాక్. అసలు బోయపాటికి ఓకే చెప్పిన హీరో ఎవరు అనేది మాత్రం అధికారిక ప్రకటనతోనే తేలనుంది. అప్పటివరకు ఎన్ని రూమర్లు వినిపించినా.. ఏది నిజమో వేచి చూడాల్సిందే.
