బాలీవుడ్ లో విధ్వంసానికి రంగం సిద్ధం చేస్తున్న బోయపాటి
తెలుగు సినీ పరిశ్రమలో యాక్షన్ అనే పదం వినగానే గుర్తొచ్చే డైరెక్టర్లలో బోయపాటి శ్రీను ముందుంటారు.
By: Sravani Lakshmi Srungarapu | 29 Jan 2026 9:00 PM ISTతెలుగు సినీ పరిశ్రమలో యాక్షన్ అనే పదం వినగానే గుర్తొచ్చే డైరెక్టర్లలో బోయపాటి శ్రీను ముందుంటారు. మాస్ ఫైట్లు, తలలు తెగిపడటం, హీరోకు నెక్ట్స్ లెవెల్ ఎలివేషన్లు ఇవ్వడం, రక్తపాతం.. ఇవి బోయపాటి మూవీలో ఉండే ప్రధానాంశాలు. బోయపాటి మొదటి సినిమా భద్ర నుంచి రీసెంట్ గా వచ్చిన అఖండ2 వరకు కూడా ఆయనిదే స్టైల్ ను ఫాలో అవుతూ వచ్చారు.
నార్త్ లో బోయపాటి సినిమాలకు భారీ క్రేజ్
బోయపాటి సినిమాలకు టాలీవుడ్ లో ఎంత క్రేజ్ ఉంటుందో నార్త్ లో కూడా అంతే క్రేజ్ ఉంటుంది. ఆయన తీసే మాస్ సినిమాలను చూడ్డానికి అక్కడి ఆడియన్స్ తెగ ఎగ్జైట్ అవుతుంటారు. అందుకే బోయపాటి చేసిన అన్ని సినిమాల హక్కులూ హిందీలో భారీ రేటుకు అమ్ముడవుతూ ఉంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకునే అఖండ2 సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించారు బోయపాటి.
అఖండ2తో మార్క్ వేయాలని చూసిన బోయపాటి
కానీ ఎన్నో అంచనాల మధ్య వచ్చిన అఖండ2 అనుకున్న ఫలితాన్ని అందించలేకపోయింది. ఈ సినిమా ఎన్నో రికార్డులను తిరగరాస్తుందనుకుంటే నిరాశ పరిచింది. అఖండ2తో ఎలాగైనా సరే నార్త్ లో తన మార్క్ వేయాలని చూసిన బోయపాటికి ఎదురుదెబ్బ తగిలింది. అయినా సరే ఆయన తన ప్రయత్నాన్ని విరమించుకోవడం లేదని తెలుస్తోంది.
బాలీవుడ్ ఎంట్రీకి ప్రయత్నాలు
అందులో భాగంగానే ఇప్పుడు బోయపాటి బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నారట. తన మాస్ ను బాలీవుడ్ లో కూడా పరిచయం చేసి, అక్కడ కూడా మాస్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకోవాలని బోయపాటి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే ఆయన రీసెంట్ గా ఓ స్టార్ హీరోను కలిసి డిస్కషన్స్ చేశారని, అన్నీ అనుకున్నట్టు జరిగితే త్వరలోనే బోయపాటి బాలీవుడ్ ఎంట్రీ ఖాయమని వార్తలు వినిపిస్తున్నాయి.
రణ్‌వీర్ సింగ్ తో చర్చలు
అయితే బోయపాటి బాలీవుడ్ ఎంట్రీ కూడా అలాంటి ఇలాంటి హీరోతో చేయాలనుకోవడం లేదట. రీసెంట్ గా ఓ భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న హీరోపై బోయపాటి కన్నేశారట. ఆయన మరెవరో కాదు, రణ్‌వీర్ సింగ్. ఇటీవలే దురంధర్ మూవీతో భారీ సక్సెస్ ను సొంతం చేసుకున్న రణ్‌వీర్ సింగ్ కోసం బోయపాటి ఓ కథను రెడీ చేసి, రీసెంట్ గా ముంబై వెళ్లి ఆయన్ను కలిసి డిస్కస్ కూడా చేశారని అంటున్నారు. ఒకవేళ రణ్‌వీర్ ఈ కథను ఓకే చేస్తే బోయపాటి కెరీర్ కు అది చాలా కలిసొస్తుంది.
టాలీవుడ్ స్థాయి ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించిన తరుణంలో బాలీవుడ్ స్టార్లందరూ సౌత్ డైరెక్టర్లతో పని చేయడానికి ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు బాలీవుడ్ హీరోలు సౌత్ డైరెక్టర్లతో కలిసి వర్క్ చేయగా, రణ్‌వీర్ సింగ్ కూడా ఎప్పట్నుంచో సౌత్ డైరెక్టర్ తో వర్క్ చేయాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే బోయపాటి, రణ్‌వీర్ సింగ్ ను కలిసి తన కథను డిస్కస్ చేశారని తెలుస్తోంది. బోయపాటి మార్క్ యాక్షన్ కు బాలీవుడ్ స్టార్ ఇమేజ్ కూడా తోడైతే బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద బోయపాటి విధ్వంసం చూడటం ఖాయం. మరి దీనికి సంబంధించిన అప్డేట్ ఎప్పుడోస్తుందో చూడాలి.
