బొత్స మాస్...వారసుడు క్లాస్...ఆ లోటు భర్తీ ఎలా ?
విజయనగరం జిల్లా రాజకీయాల్లో యువ నేతగా ఉంటూ ఈ స్థాయికి వచ్చిన వారు మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.
By: Satya P | 16 Sept 2026 8:00 PM ISTవిజయనగరం జిల్లా రాజకీయాల్లో యువ నేతగా ఉంటూ ఈ స్థాయికి వచ్చిన వారు మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ. ఆయన కాంగ్రెస్ లో యువజన నేతగా మొదటి నుంచి అడుగులు వేస్తూ వచ్చారు. ఆయన రెండు సార్లు ఎంపీగా పోటీ చేసి ఒకసారి, అయిదు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి మూడు సార్లు గెలిచారు. మంత్రిగా పదిహేనేళ్ల పాటు ఉన్నారు. ఉమ్మడి ఏపీకి పీసీసీ చీఫ్ గా కూడా పనిచేశారు. ఇటు ఉత్తరాంధ్రా జిల్లాలలో తూర్పు కాపులు బీసీలుగా ఉన్నారు. అలా ప్రముఖ బీసీ నేతగా ఉంటూనే కాపులలో కూడా ఐకాన్ లాంటి లీడర్ గా ఎదిగారు. ఉత్తరాంధ్రా నుంచి ఉభయ గోదావరి జిల్లాల దాకా బొత్స తన పలుకుబడిని పట్టుని పెంచుకున్నారు. ఉమ్మడి ఏపీలో కిరణ్ కుమార్ రెడ్డి తరువాత సీఎం కావాల్సింది తృటిలో తప్పిపోయింది. ఇక ఆయన అనుచర వర్గం చూస్తే చాలా పెద్దది. ఇంతలా బొత్స గురించి మాట్లాడితే హిస్టరీ ఉంటుంది. ఇరవై ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉంటూ ఏడు పదుల వయసుకు చేరువ అయిన ఆయన వారసత్వం కొనసాగించడం అంటే మామూలు విషయం కాదని అంటున్నారు.
డాక్టర్ బాబుగానే :
ఇక బొత్స కుమారుడు డాక్టర్ సందీప్ కుమార్తె డాక్టర్ అనూష ఇద్దరూ తండ్రి మాదిరిగా రాజకీయాల్లో చురుకుగా ఉండాలని చూస్తున్నారు. అయితే బొత్స మాదిరిగా పక్కా మాస్ లీడర్ షిప్ క్వాలిటీస్ అలవరచుకోవాల్సి ఉందని అంటున్నారు. బొత్స ఉత్తరాంధ్రా యాసలో మాట్లాడుతూ సగటు జనాన్ని ఇట్టే ఆకట్టుకుంటారు. అలాగే అందరితో కలిసిపోతారు. ఇక ఆయన మీడియాతో మాట్లాడినా సభలలో ప్రసంగించినా పాయింట్ కరెక్ట్ గా ఉంటుంది. ఆయన ప్రత్యర్ధిని కార్నర్ చేయడం కూడా సరిగ్గా గురి పెట్టినట్లుగా ఉంటుంది. అంతే కాదు ఆయన రాజకీయ చాతుర్యం కూడా వేరే లెవెల్ అని చెబుతారు. అయితే ఆయన కుమారుడు డాక్టర్ సందీప్ ని అయితే అంతా డాక్టర్ బాబుగానే చూస్తున్నారు. తండ్రి మాదిరిగా మాస్ పల్స్ పట్టుకుని మాస్ లీడర్ గా ఎదగాల్సిన అవసరం అయితే ఆయనకు ఉంది. అయితే సందీప్ ప్రస్తుతానికి క్లాస్ లీడర్ గానే ఉన్నారని అంటున్నారు.
పట్టు తెలిసిన చిన్న శ్రీను :
ఇక బొత్సకు అసలు సిసలు వారసుడిగా ఆయన పట్లు వ్యూహాలు అన్నీ తెలిసిన వారుగా చిన్న శ్రీనుని చెబుతారు. రెండున్నర దశాబ్దాల కాలంలో బొత్సను అనుసరిస్తూ ఆయన మాదిరిగా పక్కా మాస్ లీడర్ గా చిన్న శ్రీను ఎదిగారు. ఇప్పుడు ఆయన వేరే పార్టీలోకి వెళ్ళిపోయారు. దాంతో బొత్సకు కుడి భుజం విరిగినట్లు అయింది అని అంటున్నారు. మరి చిన్న శ్రీను లేని లోటుని తీర్చాల్సింది ఆయన వారసులే అని అంటున్నారు. అయితే రాజకీయంగా ఇంకా మొదట్లోనే వారు ఉన్నారని అంటున్నారు. దాంతో బొత్స నుంచి మరింత కాలం వారు రాజకీయ శిక్షణను అందుకుంటే తప్ప రాటు తేలలేరని అంటున్నారు. అంతే కాదు రాజకీయం అంటే తేలికైన వ్యవహారం కాదని అంటున్నారు. అందరితో కలిసిపోతూ అందరి వారుగా ఉండడం ద్వారానే నెగ్గుకుని రాగలరని అంటున్నారు.
గట్టిగా నిలబడితేనే :
రాజకీయాల్లో ఎందరో వారసులు వస్తారు, అయితే జనాలు వారిని ఆదరించాలి. అంతే కాకుండా పార్టీ జనాలు కూడా వారి పట్ల సానుకూలంగా ఉండాలి. ఇవి జరగాలి అంటే ఇంతకు ఇంతగా వారసులు కష్టపడాలని అంటున్నారు. బొత్స వారసులుగా కుమారుడు కుమార్తె ముందుకు రావడాన్ని వైసీపీలో అంతా స్వాగతిస్తున్నప్పటికీ తండ్రి మాదిరిగా మాస్ లీడర్ గా ఎవరు ఎదుగుతారు అన్నదే ఆసక్తిగా గమనిస్తున్నారు. చూడాలి రానున్న కాలంలో బొత్స వారసులు ఏ విధంగా తన ప్రభావాన్ని జిల్లా రాజకీయాల్లో చూపిస్తారో.
