Begin typing your search above and press return to search.

'బార్డర్ 2' బాక్సాఫీస్.. టాక్ ఎలా ఉన్నా..

ఫుల్ రన్‌లో ఈ సినిమా సులభంగా రూ. 400 కోట్ల క్లబ్‌లో చేరుతుందని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు.

By:  M Prashanth   |   25 Jan 2026 11:16 AM IST
బార్డర్ 2 బాక్సాఫీస్.. టాక్ ఎలా ఉన్నా..
X

బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద 2026 సంవత్సరం అదిరిపోయే బోణీ కొట్టింది. భారీ అంచనాల మధ్య విడుదలైన 'బార్డర్ 2' థియేటర్ల వద్ద వసూళ్ల హడావుడి గట్టిగానే ఉంది. సన్నీ డియోల్ పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్, దేశభక్తి కథాంశం తోడవడంతో నార్త్ బెల్ట్‌లో ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. రివ్యూల విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నా.. వసూళ్ల విషయంలో మాత్రం ఈ వార్ డ్రామా ఎక్కడా తగ్గడం లేదు. రిపబ్లిక్ డే వీకెండ్ కావడంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా హడావుడి కొనసాగుతోంది.

బాలీవుడ్ ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం 'బార్డర్ 2' మొదటి రోజు ఇండియాలో రూ. 30 కోట్ల నెట్ వసూళ్లతో అద్భుతమైన ఓపెనింగ్స్ సాధించింది. కేవలం మొదటి రోజే కాకుండా, రెండో రోజు కూడా ఈ జోరు కొనసాగడం విశేషం. రెండో రోజు వసూళ్లలో సుమారు 20 నుండి 25 శాతం గ్రోత్ కనిపిస్తోందని చెబుతున్నారు. శనివారం నాటి వసూళ్లు రూ. 35 కోట్ల మార్కును దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన కేవలం రెండు రోజుల్లోనే ఈ సినిమా రూ. 65 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది.

ఆదివారం వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది. అసలు సిసలైన వేట సోమవారం అంటే రిపబ్లిక్ డే నాడు ఉండబోతోంది. ట్రేడ్ లెక్కల ప్రకారం.. ఈ నాలుగు రోజుల లాంగ్ వీకెండ్‌లో 'బార్డర్ 2' ఇండియాలో రూ. 150 కోట్ల నెట్ వసూళ్లను టచ్ చేసే అవకాశం పుష్కలంగా ఉంది. ఒక పక్కా కమర్షియల్ మాస్ సినిమాకు ఉండాల్సిన అన్ని హంగులు ఉండటంతో, సింగిల్ స్క్రీన్లలో జనం క్యూ కడుతున్నారు. ఫుల్ రన్‌లో ఈ సినిమా సులభంగా రూ. 400 కోట్ల క్లబ్‌లో చేరుతుందని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు.

సినిమా టాక్ విషయానికి వస్తే నెటిజన్ల నుండి మిక్స్ డ్ టాక్ లభిస్తోంది. కొందరు 90ల నాటి క్లాసిక్ బార్డర్‌తో పోలుస్తూ విమర్శిస్తుంటే.. మరికొందరు నేటి జనరేషన్ కు తగ్గట్టుగా యాక్షన్ సీక్వెన్స్ బాగున్నాయని మెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా సన్నీ డియోల్ స్క్రీన్ ప్రెజెన్స్, వరుణ్ ధావన్ క్లైమాక్స్ యాక్షన్ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్స్ అని చెబుతున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో కొన్ని కంప్లైంట్స్ ఉన్నా.. ఎమోషనల్ కనెక్ట్ మాత్రం ఆడియన్స్‌కు బాగా తగిలిందని తెలుస్తోంది.

వరుణ్ ధావన్, దిల్జిత్ దోసాంజ్, అహాన్ శెట్టి వంటి యంగ్ స్టార్స్ ఉండటం వల్ల నేటి తరం యువత కూడా ఈ సినిమాపై ఆసక్తి చూపిస్తున్నారు. పాత బార్డర్ గుర్తులను గుర్తు చేస్తూ ఏఐ టెక్నాలజీతో సునీల్ శెట్టి, అక్షయ్ ఖన్నా క్యారెక్టర్లను చూపించడం థియేటర్లలో విజిళ్లు వేయిస్తోంది. టాక్ ఎలా ఉన్నా దేశభక్తి సెెంటిమెంట్ పండితే బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడం ఖాయమని 'బార్డర్ 2' మరోసారి నిరూపిస్తోంది. 'బార్డర్ 2' బాలీవుడ్‌కు ఒక సాలిడ్ స్టార్ట్ ఇచ్చింది. రణవీర్ సింగ్ 'ధూరందర్' రికార్డులను కూడా ఈ సినిమా సవాల్ చేసేలా కనిపిస్తోంది. లాంగ్ రన్‌లో ఈ సినిమా ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. సన్నీ డియోల్ తన సెకండ్ ఇన్నింగ్స్‌లో 'గదర్ 2' తర్వాత మరో భారీ సక్సెస్ అందుకున్నట్లే కనిపిస్తోంది.