బోర్డర్ కి బ్రేకులే లేవా?
దాదాపు మూడేళ్ల తర్వాత రిలీజ్ అయిన సీక్వెల్ సైతం బాక్సాఫీస్ ను వసూళ్లతో రప్పాడిస్తోంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్ అయిన `బోర్డర్ 2` ఊహించని సక్సెస్ ను సొంతం చేసుకుంది.
By: Srikanth Kontham | 29 Jan 2026 1:49 PM IST`బోర్డర్` ప్రాంచైజీకి బ్రేకులు లేవా? హిట్లు మీద హిట్లు కొడుతూ సీక్వెల్స్ ప్రకటిస్తూనే ఉంటారా? అంటే సన్నివేశం అలాగే కనిపిస్తోంది. సరిగ్గా మూడు దశాబ్దాల క్రితం రిలీజ్ అయిన `బోర్డర్` అప్పట్లో ఎలాంటి సంచలనాలు నమోదు చేసిందో చెప్పాల్సిన పనిలేదు. 1997 లో రిలీజ్ అయిన `బోర్డర్` ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. జె.పి. దత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భారతీయ సినిమా చరిత్రలో అత్యుత్తమ యుద్ధ చిత్రాలలో ఒకటిగా నిలిచిపోయింది. 1971 భారత్-పాక్ వార్ లోని `లొంగేవాలా యుద్ధం` ఆధారంగా జే.పి దత్ తెరకెక్కించారు .
అప్పట్లో 12 కోట్ల బడ్జెట్ లో నిర్మించిన సినిమా 65 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి భారతీయ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డు నమోదు చేసింది. అప్పటి వరకూ ఏ బాలీవుడ్ సినిమా ఆ రేంజ్ వసూళ్లను సాధించలేదు.
సన్ని డియోల్, జాకీ ష్రాఫ్, సన్నీ శెట్టి, అక్షయ్ ఖన్నా, పునీత్ ఇస్సార్, సుదేశ్ బెర్రీ, కుల్ భూషన్ కర్బాందా లాంటి నటీనటుల పెర్పార్మెన్స్ తో గొప్ప చిత్రంగా నిలిచింది. ఆ సినిమాలోని `సందేషే ఆతే హై` సాంగ్ ఇప్పటికీ దేశభక్తికి మారు పేరుగా నిలుస్తుంది. అప్పట్లో మూడు జాతీయ అవార్డులు , అనేక ఫిలింఫేర్ అవార్డులు వరించాయి.
దాదాపు మూడేళ్ల తర్వాత రిలీజ్ అయిన సీక్వెల్ సైతం బాక్సాఫీస్ ను వసూళ్లతో రప్పాడిస్తోంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్ అయిన `బోర్డర్ 2` ఊహించని సక్సెస్ ను సొంతం చేసుకుంది. విడుదలైన కేవలం 6 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల మార్కును అందుకుంది. మొదటి రోజే 30 కోట్ల నెట్ వసూళ్లతో 2026లో అతిపెద్ద ఓపెనింగ్ సాధించిన చిత్రంగా నిలిచింది. రిపబ్లిక్ డే రోజున ఏకంగా 59 కోట్ల వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఈ సినిమా లాంగ్ రన్‌లో 500 కోట్ల క్లబ్ లో చేరుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
`బోర్డర్ 2` లో సన్నీ డియోల్ తన పాత పాత్రలోనే కొనసాగగా, వరుణ్ ధావన్, దిల్‌జిత్ దోసాంజ్, అహన్ శెట్టి కీలక పాత్రల్లో కనిపించారు. ఈ నేపథ్యంలో తాజాగా `బోర్డర్ 3`ని కూడా ప్రకటించారు. `బోర్డర్ 2` కంటే ముందే భూషణ్ కుమార్.. అనురాగ్ సింగ్ మరో ప్రాజెక్ట్ కోసం పని చేస్తామన్నారు. అనంతరం `బోర్డర్ 3`ని పట్టాలెక్కిస్తామని వెల్లడించారు. 30 ఏళ్ల తర్వాత కూడా అదే దేశ భక్తిని వెండి తెరపై ఆవిష్కరించి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన ఆదరణ పొందుతున్నాం. అందుకే ఈ స్పూర్తి దాయక ప్రయాణాన్ని మూడో భాగంతోనూ కొనసాగించా లనుకుంటున్నామని తెలిపారు.
