సీక్వెల్ సినిమాలో పాటలకే అంత టైమా?
సినిమాల్లో పాటలు లేకపోతే రన్ టైమ్ కూడా చాలా కలిసొస్తుందని, అనవసరంగా సాంగ్స్ ఎందుకని చాలా మంది ఆడియన్స్ ఫీలవుతూ ఉంటారు.
By: Sravani Lakshmi Srungarapu | 16 Jan 2026 2:00 PM ISTఈ మధ్య సినిమాల్లో తప్పదు అంటే తప్ప పాటల్ని భాగం చేయడం లేదు. సినిమా ఫ్లో కు పాటలు పంటి కింద రాయిలా మారుతున్నాయని భావించి వీలైనన్ని తక్కువ సాంగ్స్ తోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అందులో భాగంగానే షూటింగ్ కూడా చేసిన సాంగ్స్ ను మేకర్స్ ఎడిటింగ్ లో సినిమా నుంచి తీసేస్తున్నారు. ఈ మధ్య చాలా సినిమాలు ఈ రూట్ లోనే వెళ్తున్నాయి.
సినిమాల్లో పాటలు లేకపోతే రన్ టైమ్ కూడా చాలా కలిసొస్తుందని, అనవసరంగా సాంగ్స్ ఎందుకని చాలా మంది ఆడియన్స్ ఫీలవుతూ ఉంటారు. కానీ త్వరలో రాబోతున్న ఓ బాలీవుడ్ సినిమాలో ఏకంగా ఒకటికి తొమ్మిది పాటలుండటం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. జనవరిలో రిలీజ్ కానున్న అతి పెద్ద సినిమాల్లో బోర్డర్2 కూడా ఒకటి. సన్నీ డియోల్, వరుణ్ ధావన్, దిల్జిత్ దోసాంబ్, అహాన్ శెట్టి ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
రిపబ్లిక్ డే సందర్భంగా బోర్డర్2 రిలీజ్
దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కిన బోర్డర్2 రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజవుతోంది. బోర్డర్ మూవీకి సీక్వెల్ గా వస్తున్న సినిమా కావడంతో ఆడియన్స్ లో ఈ సినిమాపై మంచి ఆసక్తి నెలకొంది. తాజాగా మేకర్స్ ఈ సినిమా ఆల్బమ్ ను రిలీజ్ చేశారు. బోర్డర్2 ఆల్బమ్ రన్ టైమ్ మొత్తం 50 నిమిషాలకు పైగానే ఉండటం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
బోర్డర్2లో 9 పాటలు
సినిమాలో 9 పాటలుండటం సోషల్ మీడియాలో పెద్ద డిస్కషన్ గా మారింది. అయితే బోర్డర్2 ఆల్బమ్ పై ఆడియన్స్ నుంచి మిక్డ్స్ రెస్పాన్స్ వస్తోంది. ఈ 9 పాటల్లో కొన్ని బావున్నాయని కొందరు ప్రశంసిస్తుంటే, మరికొందరు యావరేజ్ అని, ఇంకొందరు బోర్డర్2 లాంటి భారీ సినిమాకు ఇంకా మంచి మ్యూజిక్ ఉంటే బావుండేదని తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
పాటలకే 50 నిమిషాలు
బోర్డర్2 సినిమా 3 గంటల 20 నిమిషాలుండని ఇన్ సైడ్ టాక్. ఈ రన్ టైమ్ లో సుమారు 50 నిమిషాలు పాటలకే పోతే మిగిలిన రన్ టైమ్ సినిమాకు సరిపోతుందా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే ఆడియన్స్ బోర్డర్2 ఆల్బమ్ లోని సాంగ్స్ కు ఎమోషనల్ గా కనెక్ట్ అయితే ఆ ఎమోషనే వారికి సినిమాపై మరింత ఆసక్తిని కలిగిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకవేళ మ్యూజిక్ ఎలాంటి ఇంపాక్ట్ చేయలేకపోతే త్వరలో రానున్న ట్రైలర్ పైనే ఆ భారం కూడా పడనుంది. ఏదేమైనా ఏకంగా 9 పాటలున్నాయని రివీల్ అవడంతో బోర్డర్2 వార్తల్లోకెక్కి ఊహించని విధంగా వార్తల్లో నిలిచింది.
