Begin typing your search above and press return to search.

బాఫ్టా-2026 అవార్డుల‌లో భార‌తీయ సినిమా విజ‌యం

`బూంగ్` విజయం భారతీయ దర్శకులకు ఒక పాఠం. ఒక గొప్ప సినిమా తీయడానికి వేల కోట్లు అక్కర్లేదు.. మట్టి వాసన ఉన్న కథ.. దానిని చెప్పే ప్రాధాన్యత ఉంటే చాలని ఈ మణిపురి చిత్రం నిరూపించింది.

By:  Sivaji Kontham   |   24 Feb 2026 9:09 AM IST
బాఫ్టా-2026 అవార్డుల‌లో భార‌తీయ సినిమా విజ‌యం
X

మణిపురి చిత్రం `బూంగ్` బాఫ్టా (BAFTA-2026) అవార్డుల్లో `బెస్ట్ చిల్డ్రన్ అండ్ ఫ్యామిలీ ఫిల్మ్` కేటగిరీలో విజయం సాధించడం భారతీయ సినిమా చరిత్రలో ఒక అద్భుత ఘట్టం. ఆర్.ఆర్.ఆర్ ప్ర‌తిష్ఠాత్మ‌క ఆస్కార్ ని గెలుచుకుంటే, మ‌ణిపురి చిత్రం బూంగ్ బాఫ్టాల్లో మెర‌వ‌డం చ‌ర్చ‌గా మారింది. తెలుగు, హిందీ, తమిళ్ వంటి భారీ పరిశ్రమలు ఎన్ని ఉన్నా కానీ.. ఒక చిన్న మణిపురి సినిమా ఈ స్థాయి గుర్తింపు పొందడాన్ని విశ్లేషిస్తే కొన్ని ఆసక్తికరమైన అంశాలు కనిపిస్తాయి.

దిగ్గజ పరిశ్రమలు ఉన్నా.. మణిపురి సినిమా ఎందుకు గెలిచింది?

భారతదేశంలో బాలీవుడ్ లేదా టాలీవుడ్ వంటి పెద్ద పరిశ్రమలు సాధారణంగా కమర్షియల్ సక్సెస్, మాస్ ఎలిమెంట్స్ మీద దృష్టి పెడతాయి. కానీ అంతర్జాతీయ వేదికలైన బాఫ్టా, ఆస్కార్ వంటివి నిజాయితీతో కూడిన కథనం కావాల‌ని కోరుకుంటాయి. ఆర్.ఆర్.ఆర్ లోని `నాటు నాటు..` పాట‌కు ఒరిజిన‌ల్ సాంగ్ కేట‌గిరీలో పుర‌స్కారం ద‌క్కిందేమో కానీ, ఆర్.ఆర్.ఆర్ సినిమా క‌థ‌, క‌థ‌నం ప‌రంగానో లేక ఇంకేదైనా విభాగంలో ఆస్కార్ ని గెలుచుకోలేద‌నే వాస్త‌వాన్ని ఈ సంద‌ర్భంలో అంగీక‌రించాలి.

కథలో వైవిధ్యం అవ‌స‌రం:

`బూంగ్` సినిమా ఒక చిన్న పిల్లాడు తన తల్లిని సంతోషపెట్టడం కోసం తండ్రిని వెతుక్కుంటూ వెళ్లే ప్రయాణాన్ని చూపిస్తుంది. ఇందులో మణిపూర్ స్థానిక సంస్కృతి, అక్కడి సామాజిక పరిస్థితులను ద‌ర్శ‌కుడు చాలా సహజంగా చూపించారు. ప్రాంతీయ కథ అయినా కానీ.. అందులోని భావోద్వేగాలు ప్రపంచంలో ఎవరికైనా అర్థమవుతాయి. భారీ బడ్జెట్ కంటే బలమైన భావోద్వేగాలే ఈ సినిమాను గెలిపించాయి.

ఇతర సినీ పరిశ్రమలు ప్రయత్నించలేదా?

అంటే..? ప్రయతించాయి.. కానీ మన దగ్గర ఉన్న కొన్ని పరిమితులు అడ్డంకిగా మారుతున్నాయని విశ్లేషిస్తున్నారు. తెలుగు లేదా హిందీలో ఒక సినిమా తీయాలంటే హీరో ఇమేజ్, పాటలు, ఫైట్లు వంటి లెక్కలు ఉంటాయి. ఇవి అంతర్జాతీయ జ్యూరీలను పెద్దగా ఆకర్షించవు. ఒక చిన్న సినిమా అంతర్జాతీయ స్థాయికి వెళ్లాలంటే సరైన ప్రొడక్షన్ హౌస్ సపోర్ట్ ఉండాలి. `బూంగ్` చిత్రానికి ఫర్హాన్ అక్తర్, రితేష్ సిధ్వాని వంటి పెద్ద నిర్మాతలు అండగా నిలబడటం వల్ల ఈ సినిమా టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్ వంటి వేదికల ద్వారా `బాఫ్టా-2026` వరకు వెళ్ళగలిగింది. మన దగ్గర ఇలాంటి చిన్న చిత్రాలను ప్రోత్సహించే పెద్ద నిర్మాతలు తక్కువ.

ఈశాన్య భారత ప్రాంతీయ కథల ప్రత్యేకత ఏమిటి?

భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాల కథలకు ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉంది. అక్క‌డ క‌ల్చ‌ర్ ని ఇంకా బ‌య‌టి ప్ర‌పంచం చూడ‌లేదు. ఇప్పటికీ వెండితెరపైకి రాని ఎన్నో అందమైన లోకేషన్లు.. తెలియని ఆచారాలు అక్కడ ఉన్నాయి. ప్రపంచ సినిమా ప్రేక్షకులకు ఇది ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది. అక్కడి సినిమాల్లో గ్లామర్ తక్కువ, సహజత్వం ఎక్కువ. మనుషుల మధ్య ఉండే సంబంధాలను.. ప్రకృతిని వారు చూపే విధానం చాలా హృద్యంగా ఉంటుంది. మణిపూర్ వంటి ప్రాంతాల్లో ర‌క‌ర‌కాల‌ రాజకీయ, సామాజిక అశాంతి ఉన్నా కానీ.. అవేమీ అడ్డుకాదని నిరూపిస్తూ వారు తీసే సినిమాలు వారి జీవన పోరాటాన్ని ప్రతిబింబిస్తాయి.

సాధారణంగా ఆస్కార్ గెలిచినప్పుడు లేదా పెద్ద మైలురాళ్లు దాటినప్పుడే గూగుల్ ఇంట‌రాక్టివ్ సెర్చ్ యానిమేష‌న్లు చేస్తుంది. లక్ష్మీప్రియా దేవి ( బూంగ్ దర్శకురాలు) పేరు సెర్చ్ చేస్తే ఈ యానిమేషన్ రావడం అనేది భారతీయ ప్రాంతీయ సినిమాకు లభించిన అంతర్జాతీయ గౌరవంగా భావించాలి. గూగుల్-ఇండియా బూంగ్ విక్ట‌రీని సెల‌బ్రేట్ చేయ‌డం అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.

`బూంగ్` విజయం భారతీయ దర్శకులకు ఒక పాఠం. ఒక గొప్ప సినిమా తీయడానికి వేల కోట్లు అక్కర్లేదు.. మట్టి వాసన ఉన్న కథ.. దానిని చెప్పే ప్రాధాన్యత ఉంటే చాలని ఈ మణిపురి చిత్రం నిరూపించింది. రాజమౌళి RRR తో యాక్షన్ విభాగంలో భారతీయ సినిమా స‌త్తాను ప్ర‌పంచానికి చాటితే, `బూంగ్` కథా బలంతో బాఫ్టా-2026లో మెరిసింది.