Begin typing your search above and press return to search.

మాలీవుడ్ (Vs) : నార్త్ ఈస్ట్: అవార్డుల‌లో నువ్వా నేనా?

అయితే ఇప్పటికీ భారత్‌లో రియలిస్టిక్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ మాలీవుడ్. ఈ ప‌రిశ్ర‌మ‌ తర్వాతే మిగిలిన వారు అనే ప్రచారం ఉన్న మాట వాస్తవమే.

By:  Sivaji Kontham   |   28 Feb 2026 9:52 AM IST
మాలీవుడ్ (Vs) : నార్త్ ఈస్ట్: అవార్డుల‌లో నువ్వా నేనా?
X

అవార్డుల విషయంలో భార‌త‌దేశంలో మలయాళ సినిమా (మాలీవుడ్) ఆధిపత్యం ఎంత ఉన్నా.. ఇప్పుడు ఈశాన్య భారత సినిమాలు అంతర్జాతీయ వేదికలపై సంచలనం సృష్టిస్తున్నాయి. ఇటీవ‌ల `బూంగ్` అనే మ‌ణిపురి చిత్రం ప‌లు అంత‌ర్జాతీయ వేదిక‌ల‌పై పుర‌స్కారాలు గెలుచుకుని, ప్ర‌తిష్ఠాత్మ‌క బాఫ్టా-2026 పుర‌స్కారాన్ని త‌న ఖాతాలో వేసుకోవ‌డంతో దీనిపై విస్త్ర‌త చ‌ర్చ సాగుతోంది. భార‌త‌దేశంలో అవార్డులు సాధించ‌డంలో మ‌ల‌యాళ ప‌రిశ్ర‌మ ఎప్పుడూ గ్రేట్ అని పొగిడేసే వారికి ఈశాన్య భార‌తంలోని సినిమాల గురించి తెలుసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది.

అవార్డుల వేటలో మలయాళం వ‌ర్సెస్ నార్త్-ఈస్ట్:

గతంలో కేవలం మలయాళ సినిమాలకే పరిమితమైన జాతీయ, అంతర్జాతీయ అవార్డుల రేసులోకి ఇప్పుడు ఈశాన్య భారత సినిమాలు (అస్సామీ, మణిపురి నుంచి) బలంగా దూసుకొస్తున్నాయి. మణిపురి చిత్రం `బూంగ్` ఇటీవల టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (టిఐఎఫ్ఎఫ్‌) వంటి వేదికలపై ప్రశంసలు అందుకుని ఉత్తరాది చిత్రాల సత్తాను చాటింది. కేవలం కొత్త కథలు మాత్రమే కాకుండా, సాంకేతిక విలువలు, మేకింగ్ స్టైల్ వల్లే ఈ సినిమాలు అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నాయి.

అయితే ఇప్పటికీ భారత్‌లో రియలిస్టిక్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ మాలీవుడ్. ఈ ప‌రిశ్ర‌మ‌ తర్వాతే మిగిలిన వారు అనే ప్రచారం ఉన్న మాట వాస్తవమే. మలయాళ సినిమాలు సహజత్వానికి, సమాజంలోని లోతులకు అద్దం పడతాయి. అందుకే జాతీయ అవార్డుల్లో మాలీవుడ్ వాటా ఎప్పుడూ ఎక్కువగా ఉంటుంది. మాలీవుడ్ లో బ‌డ్జెట్లు ఎప్పుడూ అదుపులో ఉంటాయి. అలాగే ఈశాన్య రాష్ట్రాల సినిమాలు అత్యంత తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కినా బలమైన భావోద్వేగాల వల్ల గ్లోబల్ ఆడియన్స్‌ను మెప్పిస్తున్నాయి. అన‌వ‌స‌ర‌ కమర్షియల్ హంగులు లేకుండా.. నేల విడిచి సాము చేయకుండా కథను చెప్పడం మాలీవుడ్ తో పాటు నార్త్-ఈస్ట్ సినిమాల బలం.

టాలీవుడ్ లోను మార్పు:

గతంలో కేవలం కమర్షియల్ చిత్రాలకే పరిమితమైన టాలీవుడ్ ఇటీవలే RRR, బలగం, కేరాఫ్ కంచరపాలెం, ఓ బేబి, పుష్ప‌ వంటి చిత్రాలతో అవార్డుల కంటెంట్ వైపు అడుగులు వేస్తోంది. టైమ్స్ కథనం ప్రకారం.. కేవలం అస్సామీ సినిమాలే కాకుండా మణిపురి, మేఘాలయ చిత్రాలు కూడా కేన్స్, బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్స్ వైపు చూస్తున్నాయి. మారుమూల గ్రామాల్లోని సమస్యలను కూడా ప్రపంచానికి అర్థమయ్యేలా తీయడం ఈ చిత్రాల ప్రత్యేకత. మలయాళం లాగే.. ఈశాన్య రాష్ట్రాల సినిమాలు కూడా వారి సంస్కృతిని, సంప్రదాయాలను సినిమాల్లో జీవం ఉట్టిపడేలా చూపిస్తున్నాయి. హీరో ఇమేజ్ కంటే కథకు ప్రాధాన్యత ఇవ్వడం మాలీవుడ్‌లో ఎక్కువ.

ఇప్పుడు అదే బాటలో నార్త్ ఈస్ట్ దర్శకులు కూడా పయనిస్తున్నారు. గత దశాబ్ద కాలంలో జాతీయ అవార్డులలో 30-40శాతం మలయాళం, మరాఠీ చిత్రాలే ఆక్రమించాయి. మేకప్ లేని నటన, సహజమైన లొకేషన్లు ప్రేక్షకులను కథలో లీనం చేస్తున్నాయి. భాషతో సంబంధం లేకుండా కేవలం విజువల్స్ ద్వారా కథను చెప్పే నేర్పు మాలీవుడ్ దర్శకులకు వెన్నతో పెట్టిన విద్య. కేరళ ప్రభుత్వం లాగే.. ఇప్పుడు అస్సాం, మణిపూర్ ప్రభుత్వాలు కూడా చిత్ర నిర్మాణానికి రాయితీలు ఇస్తూ ప్రోత్సహిస్తుండ‌టంతో నార్త్ ఈస్ట్ అవార్డుల్లోను వెలుగుతోంది.

అవార్డులు అంటే మలయాళం అనే మాట ఇంకా పూర్తిగా పోలేదు.. కానీ ఇప్పుడు ఉత్తరాది నుంచి వచ్చే చిన్న చిత్రాలు ఆ ఆధిపత్యానికి గట్టి పోటీని ఇస్తున్నాయి.